అంతా ‘కనుగోలు’ కనుసన్నల్లోనే! రాష్ట్ర కాంగ్రెస్‌ను నడిపిస్తున్న సలహాదారు!

- ఆయన నివేదికపైనే ఏఐసీసీ ఆధారం
- టీపీసీసీ నాయకులంతా డమ్మీలేనా?
- ఏఐసీసీ పేరిట ఆంధ్ర నేతల పెత్తనం!
- ఇప్పటికే కేవీపీ, కొప్పుల రాజు జోక్యం
- పీసీసీ నేతల మాటకు విలువ ఉందా?
- మీడియా ప్రకటనల్లోనూ ఏఐసీసీ పేరు
- ప్రశ్నార్థకంగా మారిన టీపీసీసీ అస్తిత్వం
పార్టీ నాయకులు ఏం చేయాలో నిర్దేశించేది ఆయనే! ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో చెప్పేది ఆయనే! అభ్యర్థుల ఖరారుపై నిర్ణయం తీసుకునేదీ ఆయనే! విధానపరంగా బీఆరెస్‌కంటే కాంగ్రెస్ ఎంత భిన్నంగా ఉండబోతున్నదో చెప్పేదే లేదు! బీఆరెస్ తరహాలోనే డబ్బులు వెచ్చించే సంక్షేమ పథకాలపైనే దృష్టి తప్ప.. ప్రజల సమస్యలకు పరిష్కారాల ఊసు ఉండదు! ఎవరైనా ప్రశ్నస్తే.. మీకు తెలియదు.. అంటూ సమాధానాలు! రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి వచ్చి తీరాలని సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సలహాదారుగా ఉన్న సునీల్ కనుగోలు తీరుపై ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్న అభిప్రాయాలివి!
ప్రశ్నార్థకంగా మారిన టీపీసీసీ అస్తిత్వంవిధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సలహాదారు సునీల్ కనుగోలు ఆధిపత్యంతో పీసీసీ నాయకత్వం డమ్మీగా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థుల ఖరారు మొదలు కొని పార్టీ నాయకులు ఏం చేయాలి? కార్యకర్తలు ఏం చేయాల? ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అనే అంశాలన్నింటినీ సునీల్ కనుగోలే శాసిస్తున్నారన్న చర్చ నడుస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై నమ్మకం లేని ఏఐసీసీ అసాంతం సునీల్ కనుగోలుపైనే ఆధారపడినట్లు తెలుస్తున్నది. దీంతో సునీల్ ఏది చెపితే అదే వేదంగా మారిందని పార్టీ సీనియర్ నాయకులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. అంతా సునీల్ కనుగోలు, ఏఐసీసీ నేతలే అయితే ఇక తామెందుకని కొంతమంది పీసీసీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది.
ఇది చాలదన్నట్లు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన 10 ఏళ్ల తరువాత కూడా ఏఐసీసీ పేరుతో ఆంధ్రా నాయకులు ఇక్కడ జోక్యం చేసుకోవడంపై స్థానిక నేతల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ ఆత్మగా చెప్పే కేవీపీ రామచందర్‌రావు, కాంగ్రెస్ ఏపీ నేత రఘువీరారెడ్డి సంయుక్తంగా రాసిన ‘రైతే రాజైతే’ పుస్తకాన్ని ఇటీవల హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ఆవిష్కరించారు. ఈ సభకు ఏఐసీసీ నుంచి దిగ్విజయ్ సింగ్ హాజరు కాగా, పీసీసీ నేతలందరినీ కార్యక్రమానికి ఆహ్వానించారు. దీనిద్వారా కేవీపీ తెలంగాణ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకుంటున్నాననే సంకేతాన్ని ఇచ్చారని అంటున్నారు. ఇదే తీరుగా ఏఐసీసీ వ్యూహకర్తగా పేరు పొందిన మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు కూడా తెలంగాణకు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న చర్చ పార్టీ వర్గాలలో జరుగుతున్నది.

పీకే టూ కాంగ్రెస్
ఆంధ్రాకు చెందిన సునీల్ కనుగోలు గతంలో పీకే టీమ్‌లో కీలకంగా పనిచేశారు. దాని నుంచి బయటకు వచ్చి.. సొంతంగా సర్వే సంస్థను ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనుగోలు ఇచ్చిన నివేదికలు, చేపట్టిన కార్యక్రమాల ఆధారంగానే గెలుపు సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నది. అందుకే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు సునీల్ కనుగోలుకు సలహాదారు పదవిని కట్టబెట్టింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు కర్ణాటక ఎన్నికల తరువాత సునీల్ కనుగోలు పూర్తిగా తెలంగాణపైనే కేంద్రీకరించారు.
సునీల్ నివేదికలే ఆధారం!
సునీల్ కనుగోలుపైనే పూర్తిగా ఆధార పడిన జాతీయ నాయకత్వం అతను ఏది చెపితే అది నమ్మే పరిస్థితికి వెళ్లిందని అంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై నివేదికలు తయారు చేసి జాతీయ నాయకత్వానికి పంపించడం ఆయన పని. దీంతో రాష్ట్ర నాయకులు ఎవరు ఏది చెప్పినా వినే పరిస్థితిలో జాతీయ నాయకత్వం లేదన్న అభిప్రాయాలు కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ చిన్న కార్యక్రమం చేపట్టాలన్నా సునీల్ కనుగోలు చెప్పాల్సిందేనంటున్నారు.
ఆరు గ్యారెంటీలు కనుగోలు చెప్పినవేనా?
తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు కూడా సునీల్ కనుగోలు చెప్పినవేనట! స్థానిక నాయకులు చెప్పిన వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిసింది. స్థానిక కాంగ్రెస్ నాయకత్వం 2012 నాటి కౌలు చట్టాన్ని అమలు చేస్తామని చెప్పాలని, లేకపోతే కొత్త చట్టాన్ని తీస్తామని హామీ ఇవ్వాలని ప్రతిపాదిస్తే కనుగోలు తిరస్కరించారని సమాచారం. కౌలుదారులకు గుర్తింపు ఇవ్వకుండా ఏవిధంగా ఆర్థిక సహాయం చేయగలుగుతామని ప్రశ్నిస్తే ‘మీకు తెలువదు.. ఏమి చేయాలో మాకు తెలుసు’ అన్నట్టు మాట్లాడారని ఒక సీనియర్ నేత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నాయని ఆయన చెప్పారు.

డబ్బు పంపిణీ పథకాల చుట్టూనే!
సునీల్ కనుగోలు ఆసాంతం డబ్బుల పంపిణీతో సంబంధం ఉన్న పథకాల చుట్టూ కాంగ్రెస్‌ను తిప్పినట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికారంలో ఉన్న బీఆరెస్.. పూర్తిగా డబ్బుల పంపిణీ పథకాలు చేపట్టి ఓటర్ల కొనుగోలుకు పాల్పడిందని, తమ పార్టీ చేపట్టిన ఆరు గ్యారెంటీల్లో కూడా ఇదే కనిపిస్తున్నదని సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఈరోజు బీఆరెస్ ప్రభుత్వానికి, రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య విధానపరమైన తేడా ఉండాలని, ఇది పరిపాలన, విధానాలు, చట్టాలలో మార్పు చూపించే విధంగా ప్రకటనలుండాని మరో కాంగ్రెస్ నేత అన్నారు.
గ్యారెంటీ పథకాలలో ధరణి రద్దు, భూ సమగ్ర సర్వే కానీ, రైతు భూమికి గ్యారెంటీ కార్డు ఎందుకు చెప్పలేకపోయామో అర్థం కావడంలేదని సదరు కాంగ్రెస్ నేత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీఆరెస్ సర్కారు ధరణి పోర్టల్ తీసుకు వచ్చి, పెద్ద ఎత్తు భూ దందాలకు పాల్పడిందని మేమే ఆరోపణలు చేశాం. అనేక భూమి సమస్యలు మా వద్దకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో భూములకు గ్యారెంటీ ఇవ్వకుండా తప్పుకోవడం ఎంత వరకు సబబు? గ్యారెంటీ స్కీమ్‌లో పొందు పరచకుండా, ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్‌లో చెపితే మైలేజ్ వస్తుందా?’ అని సదరు నేత వాపోయారు. మరో వైపు కనీస మద్దతు ధర పెంచుతామని చెప్పకుండా కేవలం రూ.500 బోనస్ ప్రకటిస్తే సరిపోతుందా? అని అడిగారు.
ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడానికి హామీలేవి?
డబ్బు పంపిణీ మినహా తెలంగాణ సమాజం ఆశించిన మార్పు, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఇచ్చిన గ్యారెంటీ ఏమిటన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సాగు, తాగు నీళ్ల గ్యారెంటీ, ఉద్యోగాల గ్యారెంటీ, చదువుల గ్యారెంటీ ఎక్కడా కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ సమాజానికి కావాల్సింది ఉన్నతంగా ఎదగడమని, ఆ దిశగా కార్యాచరణ కనిపించడం లేదన్న ఆవేదన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. తెలంగాణ సమాజానికి కావాల్సిన కార్యక్రమం కాకుండా సునీల్ కనుగోలు డబ్బుల పంపిణీపై హామీలిస్తే చాలన్నట్లుగా వ్యవహరించారన్న అభిప్రాయాన్ని పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఇదే జరిగితే పార్టీకి నష్టమని చెబుతున్నారు. తెలంగాణ పార్టీ నిర్ణయాలు, నాయకుల మధ్య కాకుండా ఎక్కడో జరుగుతున్నాయన్న భావనను సదరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇతంతా తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తున్నారు. తెలంగాణ నాయకులకు అభ్యర్థులను ఎంపిక చేసే శక్తి కానీ, ప్రణాళికలు రూపొందించే అధికారం కానీ, చివరకు సభలకు మీడియా ప్రక్రటనలు ఇచ్చే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని కొంతమంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.