బీజేపీ గుప్పిట్లో ఈవీఎంల తయారీ సంస్థ!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్! దేశంలో జరిగే ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తయారు చేసి అందించే సంస్థ! ఇది బీజేపీ గుప్పిట్లో ఉందా?

- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో బీజేపీ నేతలు
- ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా బాధ్యతలు
- తొలగించాలంటూ ఈసీకి కేంద్ర మాజీ కార్యదర్శి శర్మ లేఖ
న్యూఢిల్లీ : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్! దేశంలో జరిగే ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తయారు చేసి అందించే సంస్థ! ఇది బీజేపీ గుప్పిట్లో ఉందా? ఈవీఎంలలో లోపాలు సవరించకపోతే బీజేపీ ఈసారి 400 సీట్లు కూడా సాధించే అవకాశం ఉన్నదని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాం పిట్రోడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీ గెలుపులో ఈవీఎంలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటిని మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు కూడా పెద్ద ఎత్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఎన్నికల సంఘానికి రాసిన లేఖ ఆసక్తి రేపుతున్నది. తీవ్ర జాప్యం జరిగినప్పటికీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) బోర్డులో బీజేపీ అనుబంధ వ్యక్తుల నియంతృత్వాన్ని తొలగించేందుకు ఇకనైనా సంబంధిత అధికారులను ఆదేశించాలని ఆ లేఖలో ఈఏఎస్ శర్మ కోరారు. ఈ మేరకు తీసుకున్న చర్యలను ప్రజలు, దేశం చూసే విధంగా బహిరంగం చేయాలని విన్నవించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్, ఇద్దరు ఎన్నకల కమిషనర్లకు శర్మ లేఖ రాశారు.
బీఈఎల్‌లో బీజేపీ ఒక రాజకీయ పార్టీగా కీలక పాత్ర పోషిస్తున్నదని, దీనితో ఈవీఎంలు తయారు చేయడంతోపాటు, ఈవీఎం చిప్‌లలో ఉంచే అత్యంత కీలకమైన రహస్య ఎన్క్రిప్టెడ్ సోర్స్ కోడ్‌ను అభివృద్ధి చేసే బీఈఎల్ పనితీరును బీజేపీ పర్యవేక్షిస్తున్నదనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. బీఈఎల బోర్డులో బీజేపీ నామినీలు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారన్న విషయాన్ని తాను గతంలోనూ లేఖ లేఖ ద్వారా తెలిపారని శర్మ.. ఎన్నికల కమిషనర్లకు గుర్తు చేశారు. తీవ్ర ఆందోళన కలిగించే ఈ అంశాన్ని తాను ఈసీఐ దృష్టికి తీసుకొచ్చినా దానిపై ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం కలుగుతున్నదని ఆయన పేర్కొన్నారు.
ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఎన్నికల సంఘానికి తెలుసని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్నికల ప్రయోజనాల కోసమే ఎన్నికల కమిషన్ ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మన్సుఖ్భాయ్ షాంజీభాయ్ కచరియా బీజేపీలో కీలక నేత అని ఆయన ఆరోపించారు. అనేక దేశాలు ఈవీఎంలను వదిలేసి బ్యాలెట్ పద్ధతిని అనుసరిస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం కళ్లు మూసుకున్నదని విమర్శించారు. రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా.. ఇప్పటికైనా సదరు ఇండిపెండెంట్ డైరెక్టర్లను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.