జర్మనీలో రోడ్డెక్కిన అన్నదాతలు
జర్మనీలో అన్నదాతలు రోడ్డెక్కారు. జర్మనీ అంతటా ట్రాక్టర్‌లతో రోడ్లను దిగ్బంధించారు

- సబ్సిడీ కోతలకు వ్యతిరేకంగా రోడ్ల దిగ్బంధం
- జర్మనీవ్యాప్తంగా ట్రాక్టర్లు, ట్రక్కులతో ఆందోళన
విధాత: జర్మనీలో అన్నదాతలు రోడ్డెక్కారు. జర్మనీ అంతటా ట్రాక్టర్‌లతో రోడ్లను దిగ్బంధించారు. జర్మనీ ప్రభుత్వం రైతుల సబ్సిడీలకు కోతలు విధించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం ఆందోళనలు చేపట్టారు. వ్యవసాయ రాయితీలను దశలవారీగా రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడానికి వ్యతిరేకంగా వారంపాటు నిరసనలు చేపట్టాలని రైతు సంఘాల నాయకులు నిర్ణయించారు.

తొలిరోజు సోమవారం బెర్లిన్‌లో డజన్ల కొద్దీ ట్రాక్టర్లు రోడ్లపైకి తీసుకొచ్చారు. బ్రాండెన్‌బర్గ్ గేట్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాక్టర్లు, ట్రక్కుల భారీ ప్రదర్శన నిర్వహించారు. వాటిని రోడ్డుకు అడ్డంగా పెట్టి రైతులు రాస్తారోకో చేశారు. “రైతులు లేకుంటే బీర్ లేదు ” అనే బ్యానర్లు ప్రదర్శించారు. జర్మన్ రోడ్లను రైతులు ఎక్కడికక్కడ నిర్బంధించడంతో నిర్మానుష్య వాతావరణం నెలకొన్నది.
జర్మనీలో ఇటీవల రవాణా నుంచి విద్యారంగం వరకు అన్ని వర్గాల కార్మికులు ఆందోళనలు చేపడుతున్నారు. యూరోప్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నది. ద్రవ్యోల్బనం పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో వేతనాలను పెంచాలని కోరుతూ రైల్వే కార్మికులు కూడా మూడు రోజుల సమ్మెను బుధవారం ప్రారంభించబోతున్నారు.