బల్దియాలో ఫెవికాల్ వీరులు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఫెవికాల్ హీరోలు రాజ్యమేలుతున్నారు.

  • By: Somu    latest    Dec 21, 2023 10:50 PM IST
బల్దియాలో ఫెవికాల్ వీరులు
  • వదల బొమ్మాలి అంటూ కుర్చీ పట్టుకు వేలాడుతున్నారు
  • రిటైర్డ్ అయినా వదలని సీటు
  • కొందరికేమో సర్వీస్ పొడిగింపు
  • పైరవీలతో మరికొందరి ఓఎస్డీ
  • మాతృశాఖలకు డిప్యూటేషన్ అధికారుల ససేమిరా
  • తలలు పట్టుకుంటున్న జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు

విధాత, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఫెవికాల్ వీరులు రాజ్యమేలుతున్నారు. ఏళ్ల తరబడి చాలామంది ఉద్యోగులు సీటు వదలరూ… కదలరు. తాము చెప్పిందే వేదంగా పెత్తనం చెలాయిస్తున్నారు. మరోవైపు సంస్థకు భారమయ్యారు. ఈ ఉద్యోగుల తీరుతో బల్దియా పాలన కుంటుపడింది… పారదర్శకత లోపించిందన్న విమర్శలూ లేకపోలేదు. జీహెచ్ఎంసీకి ఏ ఉద్యోగి అయినా ఒక్కసారి వచ్చారంటే చాలు… రిటైర్డ్ అయినా కుర్చీ వదలడం లేదు. కొందరు సర్వీస్ పొడగింపులు తెచ్చుకుంటుంటే, మరికొందరు పైరవీలతో ఓఎస్డీల రూపంలో తిష్టవేస్తున్నారు.


ఇతర ప్రభుత్వ శాఖల నుండి జీహెచ్ఎంసీకి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు మరింత ముదుర్లయ్యారు. బల్దియాలోకి వచ్చిన ఈ అధికారులు తమ మాతృశాఖలను మర్చిపోయారు. ఇక్కడి నుండి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. వదల బొమ్మాలి అంటూ కుర్చీ పట్టుకుని వేలాడుతున్నారు. వివిధ పైరవీలతో జీహెచ్ఎంసీకి వచ్చిన ఉద్యోగులను ఏ పోస్టులో.. ఎవర్ని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. అవసరం లేకున్నా పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తున్నారు. ఈనేపథ్యంలో బల్దియాలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది తక్కువైపోయి… సూపర్ వైజ్ చేసేవారే ఎక్కువయ్యారు. ఫలితంగా మహానగర ప్రజలకు సేవలందించే వారే దిక్కు లేకుండా పోతున్నారన్న విమర్శ ఎదురవుతోంది.

18 విభాగాల్లో 35,784 మంది విధులు


గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ కోటిమందికి పైగా పౌరులకు సేవలు అందిస్తోంది. పుట్టుక నుండి చావు వరకు.. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్న ప్రజా సేవల్లో అధికంగా బల్దియాపైనే ఆధారపడాల్సి వస్తోంది. కుప్పలుతెప్పలు సేవలను కోటి మందికి పైగా ప్రజలకు అందించేందుకు జీహెచ్ఎంసీ నిత్యం శ్రమిస్తోంది. ఇందుకుగాను 18 విభాగాల్లో 35,784 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. కమిషనర్, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, హెచ్ఓడీలు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగం, స్పోర్ట్స్, మలేరియా, శానిటేషన్, అర్బన్ బయోడైవర్సిటీ, ట్రాన్స్పోర్ట్, ఈవీడీయం తదితర విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, అధికారులు పనిచేస్తున్నారు. ఇందులో చాలామంది ప్రభుత్వంలోని వివిధ శాఖల నుండి జీహెచ్ఎంసీకి డిప్యూటేషన్ పైన వచ్చిన వారే ఉండడం విస్తుగొల్పుతోంది.


సాధారణంగా ఇక్కడ మూడేళ్లు పనిచేసిన తరువాత తమ మాతృశాఖకు వెళ్ళాలి. వారి సేవలు అవసరం అని భావిస్తే మరో రెండేళ్లు కూడా ప్రభుత్వం నిబంధనల ప్రకారం అవకాశం కల్పిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా బల్దియాలో మాత్రం అలా లేదు. ఒక సంవత్సరం కోసం బల్దియాకు డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు, ఉద్యోగులు.. ఎలాంటి ఎక్స్ టెన్షన్ లేకపోయినా ఇక్కడే కొనసాగుతున్నారు. వచ్చిన వారు బల్దియాను వదలడం లేదు. ఏకంగా రిటైర్ అయిన తరువాత కూడా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పేరుతో ఓఎస్డీలుగా కొనసాగుతున్నారు. దాంతో అప్పటివరకు తమకు ప్రమోషన్ వస్తుందని భావించిన వారికి నిరాశే ఎదురవుతోంది. ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతాధికారికి… హౌజింగ్ విభాగంలో ఓఎస్డీగా పనిచేస్తుండగా, మరో ఈఈ కమిషనర్ వద్ద ఓఎస్డీగా సెటిల్ అయ్యారు. ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ రిటైర్ అయిన ఒక మహిళా అధికారిణికి ఎస్ఎన్డీ ప్రాజెక్టులో ఉపాధి కల్పించారు. అదనపు కమిషనర్లు రిటైర్డ్ అయిన ఇద్దరు ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీలో తిష్టవేశారు. తాను ఎక్కడికి వెళ్లనని, ఇక్కడే ఉంటానని.. రెండు విభాగాలకు అదనపు కమిషనర్ గా వ్యవహరిస్తున్న ఆ అధికారి చెప్పుకోవడం ఇప్పుడు బల్దియాలో హాట్ టాఫిక్ అయ్యింది.

లబోదిబోమంటున్న కిందిస్థాయి ఉద్యోగులు

బల్దియాలో ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఇద్దరు ఇన్ స్పెక్టర్లకు ఒక ఏడాది పొడగింపుతో పనిచేస్తున్నారు. ఇక సూపరింటెండెంట్లు నలుగురు, అడ్మిన్ సెక్షన్ లో ఓఎస్డీ, రిటైర్డ్ తహసీల్దార్లు, లీగల్ ఆఫీసర్ తో పాటు శానిటేషన్ విభాగంలో చెత్త ఎత్తే ఒక కామాటిని కూడా ఒఎస్డీగా నియమించడం విశేషం. జోన్ల పరిధిలో కూడా రిటైర్ అయిన తరువాత ఇదే తరహాలో నియామకాలు జరుగుతుండటంతో కిందిస్థాయి ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఇదెక్కడి న్యాయమంటూ తమలో తాము మదనపడుతున్నారు. కాల్ సెంటర్ లో నలుగురు ఉద్యోగులను పర్యవేక్షించేందుకు రిటైర్డ్ అయిన ఒక అదనపు కమిషనర్ స్థాయి అధికారిని నియమించడం విశేషం. ఆ అధికారిణిని ఇప్పటికి కొనసాగిస్తుండటం బల్దియాలో ఒక్కసారి ఎంట్రీ ఇచ్చారంటే ఎలా ఉంటారనేది చెప్పకనే చెబుతుంది.

మున్సిపల్ పాలనతో సంబంధంలేని వ్యక్తులే..


జీహెచ్ఎంసీలోకి వివిధ విభాగాల నుండి అధికారులు అవసరం అని భావిస్తే కమిషనర్ ఆ విభాగానికి లేఖ రాసి వారిని తెప్పించుకుంటారు. కానీ వివిధ కారణాలతో చాలామంది హైదరాబాద్ నివాసం కోరుకుంటూ జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్ పై పని చేయడానికి వస్తున్నారు. రాజకీయ ఒత్తిడి, ఉన్నతాధికారుల ఆదేశాలతో చాలామంది జీహెచ్ఎంసీకి డిప్యూటేషన్ పై వస్తున్నారు. ఇందులో మున్సిపల్ పాలనతో సంబంధం లేని వ్యక్తులు కూడా బల్దియాలో పనిచేయడం గమనార్హం. గతంలో ఒకఅధికారి శానిటేషన్ విభాగాన్ని పర్యవేక్షించగా, ప్రస్తుతం ఇద్దరు ఉన్నతాధికారులు, ఇద్దరు జాయింట్ కమిషనర్లు ఉన్నారు. ఒకరు నగరంలో ఉన్న టాయిలెట్ల నిర్వహణ పర్యవేక్షించేందుకు అయితే, మరొకరు కార్మికులకు అందించే సేఫ్టీకిట్ల పంపిణీ పర్యవేక్షిస్తున్నారు. ఇంత మందిని పెట్టినా పనులు సక్రమంగా జరుగుతున్నాయా? అంటే అదీ లేదనే వాదనలున్నాయి. ఇక్కడి నుండి వెళ్లిన కొద్ది నెలలు, లేదా ఏడాదిలోనే మళ్లీ బల్దియాకు వచ్చేందుకు పలువురు ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. జీహెచ్ఎంసీలో వీధి దీపాల నిర్వహణ కోసం వస్తున్న ఉద్యోగులు ట్రాన్స్ కో నుండి వస్తే సరిపోతుంది. కానీ జెన్ కో నుండి వచ్చి ఇక్కడ తిష్ట వేస్తున్నారు.


సంబంధిత విభాగంలో కాకుండా ఇతర విభాగాల్లో పనిచేయడం కార్పొరేషన్ లో పరిపాటి అయిందన్న ఆరోపణలున్నాయి. ఇక ఇక్కడికి వచ్చారంటే చాలు.. ప్రత్యేక చాంబర్, ప్రత్యేక వెహికిల్, దానికి రూ.35 వేల అద్దె చెల్లించి మరి అవకాశం కల్పిస్తున్నారు. ఇలా అనవసరంగా కోట్లాది రూపాయలు బల్దియా అధికారులు వృథా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పనుల చేసేవారు తక్కువ.. వాటిని పర్యవేక్షించే వారు ఎక్కువ అన్న చందంగా తయారైంది బల్దియా పనితీరు. ఈ చర్యలు కార్పొరేషన్ నిర్వహణ ఖర్చులను కూడా పెంచుతున్నాయి. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో అవసరం ఉన్నా, లేకున్నా.. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పారనో, ఉన్నతాధికారులు రెఫర్ చేశారనో డిప్యూటేషన్ పై వచ్చిన చాలామందికి ఉన్నతాధికారులు బల్దియాలో చోటు కల్పిస్తున్నారు. ఫలితంగా బల్దియా సేవలు క్షేత్రస్థాయిలో అటకెక్కి… పౌరులకు నామమాత్ర సేవలు అందుతున్నాయి. ప్రభుత్వం స్పందించి బల్దియా పాలనపై దృష్టిసారించి, ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకుంటూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సి ఉంది.