మూడేళ్లు సొంత జిల్లాలో ఉంటే బదిలీ
లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లలో ఎన్నికల సంఘం అధికారులు వేగాన్ని పెంచారు. జిల్లాల్లో ఇప్పటికే సిద్ధం చేసిన ఓటరు లిస్టులను ప్రత్యేక అధికారులు బుధవారం పరిశీలించనున్నారు

- లోక్‌సభ ఎన్నికలకు 8న ఓటర్ల తుది జాబితా!
- మరుసటి రోజు నుంచే నాలుగు శాఖల్లో బదిలీలు
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లలో ఎన్నికల సంఘం అధికారులు వేగాన్ని పెంచారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే సిద్ధం చేసిన ఓటరు లిస్టులను ప్రత్యేక అధికారులు బుధవారం పరిశీలించనున్నారు. అనంతరం తుది జాబితాలను ప్రకటించనున్నారు. వీటి ఆధారంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఇతర పనులను ముమ్మరం చేయనున్నారు.
మూడేళ్లూ సొంతూళ్లో ఉన్నవారికి బదిలీ
పంచాయితీరాజ్, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖల్లో మూడేళ్లుగా సొంత జిల్లాల్లో ఉండి పని చేస్తున్నవారిని బదిలీ చేయనున్నట్టు తెలుస్తున్నది. మూడేళ్లుగా సొంత జిల్లాల్లో ఉన్న నేపథ్యంలో వారు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయన్న విమర్శలకు దూరంగా ఉంచేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. జూలైలో ఉద్యోగ విరమణ చేసే అధికారులు, ఉద్యోగులను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పిస్తారని తెలుస్తున్నది. 8వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించగానే.. మరుసటి రోజు నుంచే.. ఈ బదిలీలన్నీ చేపట్టి.. 15వ తేదీ లోపు పూర్తి చేయనున్నారని సమాచారం.