ఇప్పటం గ్రామస్తులకు ఇరకాటం.. జరిమానా కట్టాల్సిందేనన్న హైకోర్టు

విధాత‌: అమరావతి రాజధాని పరిధిలోని ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గ్రామస్తులు వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు 14 మంది రైతులు రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. అసలేం జరిగిందంటే… ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ సందర్భంగా తమ ప్రహరీలు కూల్చేశారని పేర్కొంటూ గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. తమకు ఏమాత్రం సమాచారం లేకుండా ఏకపక్షంగా రోడ్ల […]

ఇప్పటం గ్రామస్తులకు ఇరకాటం.. జరిమానా కట్టాల్సిందేనన్న హైకోర్టు

విధాత‌: అమరావతి రాజధాని పరిధిలోని ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గ్రామస్తులు వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు 14 మంది రైతులు రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది.

అసలేం జరిగిందంటే…

ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ సందర్భంగా తమ ప్రహరీలు కూల్చేశారని పేర్కొంటూ గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. తమకు ఏమాత్రం సమాచారం లేకుండా ఏకపక్షంగా రోడ్ల విస్తరణ చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాము ముందస్తుగా నోటీసులు ఇచ్చాకనే రోడ్లను విస్తరించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించి ఆమేరకు నోటీసుల కాపీలు కూడా కోర్టు ముందుంచారు.

దీన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది సైతం అంగీకరించారు. తమ క్లయింట్లకు ప్రభ్యత్వ నోటీసులు అందాయని ఆయనా అంగీకరించడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమను తప్పుదోవ పట్టించినందుకు, తప్పుడు ఫిర్యాదుతో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు ఒక్కో ఫిర్యాదికి రూ.లక్ష చొప్పున మొత్తం 14 మందికి జరిమానా విధించింది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మీద ఇప్పటం గ్రామస్తులు రిట్ పిటిషన్ వేశారు.

ఆ పిటిషన్ ను నేడు విచారించిన ధర్మాసనం గ్రామస్తుల పిటిషన్ ను కొట్టేసింది. కోర్టును తప్పుదోవ పట్టించడం, మోసం చేయడాన్ని తాము సమర్థించలేమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే రైతులు చదువులేని వారని, అవగాహన లేనందున అలా చేశారని, క్షమించాలని వారి తరఫున న్యాయవాది కోర్టును అభ్యర్థించగా వారు చదువుకోలేదు సరే.. మీరు చదువుకున్న విద్యావంతులే కదా.. మీరైనా వాళ్లకు చెప్పాలి కదా అంటూ వారి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో వాళ్లంతా జరిమానా కట్టక తప్పేలాలేదు.