న్యూఢిల్లీ – ద‌ర్భాంగా ఎక్స్‌ప్రెస్ రైలులో ఎగిసిప‌డ్డ అగ్నికీల‌లు

న్యూఢిల్లీ – ద‌ర్భాంగా ఎక్స్‌ప్రెస్ రైలులో ఎగిసిప‌డ్డ అగ్నికీల‌లు

విధాత‌ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఇటావా వ‌ద్ద ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. న్యూఢిల్లీ – ద‌ర్భాంగా సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్లో అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో ప్ర‌యాణికుల‌కు ఎవ‌రికీ గాయాలు కాలేదు. మంట‌లు చెల‌రేగిన వెంట‌నే బోగీల్లో ఉన్న ప్ర‌యాణికులు బ‌య‌ట‌కు దూకారు. ఎక్స్‌ప్రెస్ రైలు స‌రాయి భూప‌త్ స్టేష‌న్ మీదుగా వెళ్తున్న స‌మ‌యంలో, స్లీప‌ర్ కోచ్‌లో నుంచి పొగ‌లు రావ‌డాన్ని స్టేష‌న్ మాస్ట‌ర్ గుర్తించి, క్ష‌ణాల్లోనే లోకో పైల‌ట్‌ను అప్ర‌మ‌త్తం చేశాడు.


అనంత‌రం రైలును ఆపేసి, రైల్వే ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం అందించాడు. 2 బోగీల‌కు మంట‌లు అంటుకోవ‌డంతో, ప్రయాణికుల‌ను అంద‌ర్నీ కింద‌కు దించేశారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను ఆర్పివేసింది. అయితే అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స్లీప‌ర్ కోచ్‌లో సామ‌ర్థ్యానికి మించి ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఒక వేళ స్టేష‌న్ మాస్ట‌ర్ అప్ర‌మ‌త్తం చేయ‌క‌పోతే భారీ ప్రాణ న‌ష్టం జ‌రిగి ఉండేద‌ని అధికారులు పేర్కొన్నారు.