ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో గురువారం తెల్ల‌వారుజామున అగ్నిప్రమాదం సంభవించింది

ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం
  • టీచింగ్ బ్లాక్‌లోని డైరెక్ట‌ర్ కార్యాల‌యంలో మంట‌లు
  • ప్రాణ‌న‌ష్టం లేదు.. మంట‌లు ఆర్పిన ఏడు ఫైరింజ‌న్లు


విధాత‌: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో గురువారం తెల్ల‌వారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్న‌ద‌ని పేర్కొన్నారు.


’ఎయిమ్స్‌లో మంట‌లు చెల‌రేగిన‌ట్టు అగ్నిమాపక విభాగానికి గురువారం ఉదయం 5.59 గంటలకు కాల్ వచ్చింది. వెంటనే ఏడు ఫైర్ టెండర్లను ఘ‌ట‌నా స్థ‌లికి పంపించారు. ఉదయం 6.20 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు’ అని అగ్నిమాప‌క‌శాఖ అధికారి వెల్ల‌డించారు.


ఎయిమ్స్ రెండో అంతస్తులోని టీచింగ్ బ్లాక్‌లో ఉన్న డైరెక్టర్ కార్యాలయంలో తొలుత మంటలు చెలరేగాయ‌ని తెలిపారు. ఆ త‌ర్వాత ఆ బ్లాక్ అంతా మంట‌లు వ్యాపించిన‌ట్టు పేర్కొన్నారు. పెద్ద ఎత్తు ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ బ‌య‌ట‌కు వ్యాపించింద‌ని వెల్ల‌డించారు. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు నమోదు కానప్పటికీ, ఫైళ్లు, కార్యాలయ రికార్డులు, రిఫ్రిజిరేటర్, కార్యాలయ ఫర్నిచర్ కాలిపోయిన‌ట్టు అధికారి తెలిపారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.