Gaddar | జోహర్ గద్దరన్న.. కడసారి చూపుకు పొటెత్తిన జనం! తొక్కిసలాట ఒక్కరు మృతి
Gaddar | గద్దర్‌కు అశేష జనం ఆశ్రునివాళి సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల నివాళులు దారంతా కన్నిటీ నివాళులు గద్దర్‌కు అభిమానులు కన్నీటి వీడ్కోలు కడ చూపు కోసం పోటెత్తిన అభిమానం ప్రజలతో కిక్కిరిసిపోయిన ఎల్బీ స్టేడియం ఇంటికి వెళ్లి నివాళులర్పించిన సీఎం కేసీఆర్ మహాబోధి పాఠశాల మైదానంలో సమాధి గౌరవ వందనం సమర్పించిన పోలీసులు గద్దర్ అంతిమ యాత్రలో అపశ్రుతి సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ మృతి కష్టజీవుల ఈతి బాధలను, వాటి పరిష్కరాలను మోస్తూ వచ్చిన […]

Gaddar |
- గద్దర్‌కు అశేష జనం ఆశ్రునివాళి
- సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల నివాళులు
- దారంతా కన్నిటీ నివాళులు
గద్దర్‌కు అభిమానులు కన్నీటి వీడ్కోలు
కడ చూపు కోసం పోటెత్తిన అభిమానం
ప్రజలతో కిక్కిరిసిపోయిన ఎల్బీ స్టేడియం
ఇంటికి వెళ్లి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
మహాబోధి పాఠశాల మైదానంలో సమాధి
గౌరవ వందనం సమర్పించిన పోలీసులు
గద్దర్ అంతిమ యాత్రలో అపశ్రుతి
సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ మృతి
కష్టజీవుల ఈతి బాధలను, వాటి పరిష్కరాలను మోస్తూ వచ్చిన యుద్ధనౌక ప్రయాణం ఇక ఆగిపోయింది. విప్లవోద్యమాన్ని పరవళ్లు తొక్కించిన విప్లవ గీతిక ఇక వినిపించదు! అసమానతలపై పోరు పిడికిళ్లెత్తించిన దళపతి.. ఇక కనిపించడు! అశేష అభిమానులను విషాదంలోకి నెట్టేసి.. వారి కన్నీటి నివాళ్లు అందుకున్న గద్దర్.. భౌతికంగా శాశ్వతంగా కనుమరుగయ్యాడు! ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయం మైదానంలో గద్దర్ భౌతిక కాయానికి బౌద్ధ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఉద్యమంలో ఉన్నప్పుడు గద్దర్‌కోసం వెతికిన పోలీసులే.. ఇప్పుడు అధికార లాంఛనాల ప్రకారం గాలిలోకి మూడు రౌండ్లు కాల్పలు జరిపి.. గౌరవ వందనం సమర్పించారు.
విధాత: విప్లవోద్యమ గీతిక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) అంత్యక్రియలు సోమవారం అశేష జనవాహిని సమక్షంలో అధికార లాంఛనాలతో ముగిశాయి. ఆయన స్థాపించిన మహాబోధి పాఠశాల ఆవరణలో రాత్రి 8.10గంటల సమయంలో గద్దర్ భౌతిక కాయాన్ని వారి కుటుంబ సంప్రాదాయాలను అనుసరించి, బౌద్ధ సంప్రదాయం మేరకు పెద్ద కుమారుడు సూర్యం చేతుల మీదుగా సమాధి చేశారు. ఆ సమయంలో పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి, గౌరవ వందనం సమర్పించారు.
అంతకు ముందు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఉంచిన గద్దర్ భౌతిక కాయాన్ని పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, ప్రజలు కడసారి చూసుకుని నివాళులర్పించారు. ఆయనతో అనుబంధాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. పలువురు రాజకీయ నేతలు, మేధావులు, రచయితలు, ప్రగతిశీల శక్తులు, సినీ ప్రముఖులు గద్దర్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. తమ అభిమాన గాయకుడిని కడసారి చూసుకునేందుకు వచ్చిన అభిమానులు, ప్రజలు, ప్రముఖులతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసింది.
మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన గద్దర్ అంతిమ యాత్ర గన్ పార్కు వద్దకు చేరుకున్నది. అనంతరం అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ మార్గం మీదుగా ఐదున్నర గంటల పాటు సాగి.. అల్వాల్‌లోని భూదేవి నగర్‌లో ఉన్న ఆయన స్వగృహానికి చేరుకున్నది. అక్కడ స్థానికులు పెద్ద సంఖ్యలో గద్దర్‌కు పుష్పాంజలి ఘటించారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గద్దర్ నివాసం వద్దకు వచ్చి.. విప్లవ గాయకుడి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి.. నివాళులర్పించారు. గద్దర్ భార్య, కొడుకు, కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. కేసీఆర్ వెంట మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, క్రాంతికుమార్ ఉన్నారు.
కొద్దిసేపు గద్దర్ నివాసంలో ఉంచిన ఆయన పార్థీవ దేహాన్ని తిరిగి అంతిమ యాత్రగా గద్దర్ స్థాపించిన మహాబోధి పాఠశాలకు చేర్చారు. ఎల్బీ స్టేడియం నుంచి దాదాపు ఏడుగంటల పాటు సాగిన గద్దర్ అంతిమయాత్రలో దారి వెంట ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొని తమ అభిమాన గాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో అభిమానులు జోహార్ గద్దరన్న.. గద్దరన్న అమర్ రహే అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. కళాకారుల బృందాలు గద్దర్ పాటలను ఆలపిస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
మహాబోధి పాఠశాల ఆవరణలో గద్దర్ భౌతిక కాయాన్ని వారి కుటుంబ సంప్రాదాయాలను అనుసరించి, బౌద్ద సాంప్రదాయం మేరకు పెద్ద కుమారుడు సూర్యం చేతుల మీదుగా ఖననం చేశారు. అధికారిక లాంఛనాల మేరకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. గద్దర్ అంతిమ యాత్రలో, అంత్యక్రియలలో పాల్గొనేందుకు వచ్చిన జనాన్ని, అభిమానులను కంట్రోల్ చేయడంలో పోలీసులు కష్టసాధ్యమైంది. అంతిమయాత్ర ఏర్పాట్లలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రముఖ పాత్ర వహించారు.
గద్దర్ అంతిమయాత్ర సాగిన వాహనం వెంట రేవంత్, కాంగ్రెస్ సీనియర్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు, మల్లు రవి, మధుయాష్కి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, విమలక్క, ఆర్ నారాయణమూర్తి ఉన్నారు. వీరంతా మహాబోధి పాఠశాల వరకూ వెళ్లి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు ఉన్నారు.
కాగా గద్దర్‌కు ఎల్బీ స్టేడియంలో నివాళులర్పించిన సందర్భంలోనూ, అంతిమయాత్రలో, అంత్యక్రియ లలో, అధికారిక లాంఛనాల వరకు కూడా అటు అధికార బీఆరెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇటు కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా గద్దర్ తమవాడేనన్నట్లుగా క్లైయిమ్ చేసుకునేలా వ్యవహరించడం కొంత చర్చనీయాంశమైంది. బీఆరెస్ ఎమ్మెల్యేలు క్రాంతికుమార్, బాల్క సుమన్ ప్రభుత్వం తరఫున చివరికంటా పాల్గొనడం విశేషం.
గద్దర్ కు ప్రముఖుల నివాళులు
ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయం వద్ద సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం తరుఫున మంత్రి బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, మల్లు రవి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,
బీజెపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అరుణోదయ విప్లవ సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, ఆర్టీసీ ఎండి సజ్జనార్, సినీ దర్శకులు బి.నర్సింగ్‌రావు,
పరిటాల శ్రీరామ్, సినీ ప్రముఖులు, జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మోహన్ బాబు, మనోజ్, ఆర్. నారాయణ మూర్తి, నాగబాబు, నిహారిక, అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, గద్దర్ నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తదితరులు నివాళులర్పించారు. అల్వాల్ లో గద్దర్ నివాసం వద్ద తొక్కిసలాట చోటుచేసుకోగా, పోలీసులు లాఠీచార్జి చేయాల్సివచ్చింది.
తొక్కిసలాటలో సియాసత్ ఎడిటర్ మృతి
విధాత: గద్దర్ అంత్యక్రియల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఉర్దూ పత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ మృతి చెందారు. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ పార్థివదేహాన్ని అల్వాల్ లోని ఆయన ఇంటికి అంతిమ యాత్రగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గద్దర్ ను చూసేందుకు అభిమానులు, ప్రజలు ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
లోపల అంత మందికి స్థలం సరిపోదని పోలీసులు చెప్పినా వినిపించకుకోకుండా ముందుకు తోసుకురాగా, తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. కాగా తొక్కిసలాట సందర్భంగా ఉర్దూ పత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలిఖాన్ గుండెపోటుతో చనిపోయారు. అలీఖాన్ గద్దర్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన ఎల్బీ స్టేడియం నుంచి కూడా అంతిమ యాత్ర వాహనంలో ఉండి గద్దర్ ఇంటి వద్దకు వచ్చారు.
అలీఖాన్ వాహనం దిగిన సందర్భంలోనే అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుని ఆయన కింద పడిపోయారు. ఊపిరి సమస్యతో బాధపడుతుండగా పలువురు పక్కనే ఉన్న దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. తొక్కిసలాట సమయంలో అలిఖాన్‌కు గుండెపోటు రావడంతోనే ఆయన మృతి చెందినట్లు తెలుస్తున్నది.
అలీఖాన్ మృతి పట్ల టీయుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ సంతాపం తెలిపారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రజాసంఘాలతో కలిసి చురుగ్గా పాల్గొన్న జహీర్ అలిఖాన్ మృతి విచారకరమని, ఆయన మృతి జర్నలిస్టు సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.
Gaddar | జోహర్ గద్దరన్న.. కడసారి చూపుకు పొటెత్తిన జనం! తొక్కిసలాట ఒక్కరు మృతి https://t.co/NOVpXCQgar
గద్దర్ అంత్యక్రియల్లో గుండెపోటుతో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ గద్దర్సన్నిహితుడు జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి. pic.twitter.com/JDfb5c64jx
— vidhaathanews (@vidhaathanews) August 7, 2023