Gaddar
గతేడాది ఇదే ఆగస్టు నెలలో ‘గద్దర్ యుగం’ పేరుతో డాక్టర్ జిలుకర శ్రీనివాస్ రాసిన వ్యాసాన్ని గద్దర్‌ను స్మరించుకుంటూ యథాతథంగా మీ ముందు ఉంచడం సముచితమే అని భావిస్తున్నాం.
విధాత: ‘గద్దర్ ఘరానా’ అని ప్రముఖ విమర్శకుడు జగన్ రెడ్డి ఒక పేరు పెట్టాడు. వాగ్గేయకార సంప్రదాయంలో సృష్టించిన కొత్త పంథాకు, తెచ్చిన మార్పుకు ఒక సంకేతంగా ‘గద్దర్ ఘరానా’ అని ఆయన నామ్నీకరణం చేశాడు. జగన్ రెడ్డి అభిప్రాయం సరైనదే. గద్దర్ రహిత ఆధునిక వాగ్గేయం అనూహ్యం. అచింత్యం. గద్దర్ రాజకీయ విశ్వాసాలేవైనా సరే, ఆయన విప్లవోద్యమానంతర పయనంలో వేసిన అడుగులు అపసవ్యమైనవని ఎవరెంత విమర్శించినా సరే.
గద్దర్ ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప బాలెడీర్. నిరుపమానమైన పర్ఫార్మర్. అందుకే ఆయణ్ణి ‘ప్రజా యుద్ధ నౌక’ అని సగర్వంగా పిలుస్తారు. అలాంటి ప్రజా వాగ్గేయకారుణ్ణి సృష్టించినదెవరు? ఆయణ్ణి ఈ నేల మీది ప్రజా పోరాటాలే సృష్టించాయన్నది యెంత నిజమో, అణగారిన కులాలే ఆయన సృష్టికి మూలమన్నది కూడా అంతే నిజం.
అవును, కుల నిర్మిత సమాజంలో సాహిత్య సాంస్కృతిక రంగాలు కూడా కుల సూత్రాల మీదే నిర్మాణమవుతాయి. అలా నిర్మాణం కాని రూపాలూ తెరమరుగవుతాయి. రూపకర్తలూ అనతి కాలంలోనే కనుమరుగవుతారు. గద్దర్ స్వయం ప్రకాశమైన ఒక సూర్యుడిలా కనిపిస్తాడు కానీ ఆ నక్షత్రాన్ని మోసిందీ వెలుగులు ఈ లోకం మీద విరజిమ్మేలా బాహువులు సాచిందీ మాత్రం అణగారిన కులాలే.
వర్గ వ్యతిరేక పోరాటంలో అంతర్భాగంగా ఆయన రూపొందింది ఎంత నిజమో పీడిత కుల సమాజం ఆయనను తీర్చిదిద్దింది కూడా అంతే నిజం. పాటను ఆయన విప్లవీకరించాడని విమర్శకులు అంటారు. కానీ పాటే ఆయన్ని విప్లవకారుడిగా మార్చింది. ఆ పాటను ప్రజారూపంగా ఆది నుండీ మలిచింది అస్పృశ్య జాతులే. ఆయన పాట అస్పృశ్యులది. ఆయన స్వీకరించిన రాగ, లయ, శృతి తదితర ఆలాపనా సామాగ్రి కూడా ఈ దేశ మూలవాసులది.
ఆయన ముఖం మీద ఆకృతి దాల్చిన అభినయమూ ఆయన చేతిలో ఓలలాడిన రుమాలూ ఆయన పాదాల గజ్జెలూ అన్నీ ఈ దేశ భూమి పుత్రులవి. ఒక ప్రపంచ స్థాయి వాగ్గేయకారుణికి జన్మనిచ్చిన పీడిత కులాలు ఆయణ్ణించి ఏమి కోరుకుంటున్నాయో ఆయనకు తెలిసేందుకు అనేక దశాబ్దాలు పట్టింది. అదింకా గద్దర్ గళాన్ని అస్పష్టంగానే ఆవహించుకొంది.
సంస్కృతి దానికది స్వతంత్రమైనదిగా కనిపడుతోంటుంది. నిర్మాణవాదం, వినిర్మాణవాదం రెండూ సంస్కృతినీ దానిలో అంతర్భాగమైన సకల కళలల్నీ స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థలుగా చూశాయి. కళా రంగానికే సొంతమైన చలన సూత్రాలు దానికే ఉంటాయనీ ఈ రెండు సిద్ధాంతాలు వాదించాయి. భాషా పరిశీలనలో వచ్చిన నవీన సిద్ధాంతాలు సాహిత్య సిద్ధాంతాలనూ కళా సిద్ధాంతాలనూ ప్రభావితం చేశాయి.
సజూర్ ప్రతిపాదించిన నిర్మాణవాద భాషాశాస్త్రం పునాదుల మీది నుండి ఆవిర్భవించిన రూపవాదం కళారంగానికి విశేషాధికారాలిచ్చింది. కానీ రూపవాదంలో సామాజిక నిర్మాణాలకు విలువ లేదు. అంటే ఒక రూపం ఆకృతి దాల్చడానికి మూలమైన సామాజిక నిర్మాణ సూత్రాలు, వాటి ఫలితంగా ఏర్పడిన అధికార వ్యవస్థలూ వాటిని నడిపించే భావజాలమూ విలువ లేనివిగా మారాయి. రూపవాదంలో వున్న పరిమితులను గుర్తించకుండానే దాని పట్ల విమర్శకులు సానుకూలతనూ వ్యతిరేకతనూ ప్రదర్శించారు.
మార్క్సిస్టు విమర్శకులు కూడా వారికి తెలియకుండానే రూపవాదంలో కూరుకుపోయారు. గద్దర్ ప్రస్థానాన్ని పయనాన్నీ ఆయన గానానికి సంబంధించిన విశేషంగానో లేదా ఆయన ఇంతగా ఎదగడానికి ఆయన ఎంచుకున్న సాయుధ పోరాటమో కారణమని చేసిన విమర్శ కూడా రూపవాదానికి సమీపంగా వుంది. నక్సల్బరీ ఉద్యమమే గద్దర్‌ను సృష్టించింది నిజమైతే కేవలం ఒకేఒక్క గద్దర్ మాత్రమే ఎందుకు తయారయ్యాడని మిత్రుడు పి.కేశవ్ కుమార్ లేవనెత్తిన ప్రశ్నకు ఆ ఉద్యమమే సమాధానం చెప్పాలి.
వర్గ పోరాట ఉద్యమాల పరిమితిని గుర్తించ నిరాకరించే వారు ‘వాస్తవాల’ను అంగీకరించరు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని ఇప్పటి వరకు వర్గ వాస్తవికత పేరుతో ప్రజాకళాకారుల పరిమితులను విస్మరిస్తూ వచ్చారు. భూస్వామ్య వ్యతిరేక పోరాటంతో తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమం మొదలైంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజా నాట్యమండలి విశేష పాత్ర పోషించింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అన్ని కులాలూ పాల్గొన్నాయి.
అది కుల వ్యతిరేక పోరాటమా లేదా వర్గ వ్యతిరేక పోరాటమా అన్న సంశయం నేటికీ వుంది. తెలంగాణ ప్రాంతంలో భూస్వాములుగా వున్న వెలమ, రెడ్డి కులాల దోపిడీకి వ్యతిరేకంగా పీడిత కులాలు చేసిన పోరాటమది. వెలమ, రెడ్డి భూస్వామ్య కులాల దోపిడీకి బ్రాహ్మణ భావజాలం తాత్విక పునాది. తెలంగాణ సాయుధ పోరాటం బ్రాహ్మణ భావజాలం మీద గానీ దాని అవశేషాల మీద గానీ యుద్ధం చేయకుండానే భూస్వామ్య వ్యవస్థను తుదముట్టించాలని ఆశపడ్డది.
అందుకు నిజాం వ్యతిరేకతను కేంద్రంగా చేసుకున్నది. సాయుధ పోరుకు నాయకత్వం వహించిన వారికి కూడా ఆనాటికి బ్రాహ్మణ భావజాలంతో వున్న పేగు బంధం పూర్తిగా తెగిపో లేదు. ఆ మాటకొస్తే నేటికీ అది తెగిపోలేదు. ఆర్య సమాజ ప్రభావమే అధికంగా ఆనాటి సాయుధ పోరాట యోధులను ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. సుద్దాల హన్మంతు సాయుధ పోరాటానికి కళా రంగంలో నాయకుడు. ఆయన పాటలను అశోక్ తేజ ప్రచురించాడు. వాటి నిండా బ్రాహ్మణ భావజాలమే ఉంది.
అభ్యుదయ గీతాలు రాసిన హన్మంతు, అలాంటి సనాతన సంప్రదాయ గీతాలు రాసాడని నేను నమ్మ లేకపోయాను. హన్మంతు పాటలు ఆ విధంగా ఎందుకు వున్నాయని ఆలోచించాను. హన్మంతు మీదగానీ ఆనాటి అనేక మంది నాయకుల మీద కళాకారుల మీద కమ్యూనిస్టు పార్టీ ఏ మేరకు ప్రభావితం చేయ గలిగే వీలుందో కూడా ఆలోచించాను. నిరంతరం సాయుధ పోరులో నలిగే చోట సైద్ధాంతిక శిక్షణకు అవకాశాలు చాలా తక్కువే.
మరీ ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆ కాలంలో చేసే పోరాటాలకు పసిగట్ట లేని ఎన్నో అవరోధాలు తప్పకుండా ఉంటాయి. కానీ ఇది ‘వీలు’కు సంబంధించిన సమస్యేనా? ప్రజల ఆవేశాన్ని సాయుధం వైపు మళ్లించడం చాలా తేలిక. కానీ ఆవేశాన్ని ఆలోచన దిశగా మళ్లించటంలో ఆనాటి నాయకత్వం విఫలమైందనే చెప్పొచ్చు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి బ్రాహ్మణిజం పట్ల విమర్శనాత్మక వైఖరి లేకపోవటం అందుకు కారణం. బ్రాహ్మణులే ఆనాటి నుండి నేటి వరకూ కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించటం కూడా మరో ముఖ్యమైన కారణం.
సుద్దాల హన్మంతు కాలం ముగిసింది. ఇది గద్దర్ యుగం. హన్మంతుకు వున్న పరిమితులు గద్దరుకు లేవు. హన్మంతు పుట్టిన కులం కూడా అందుకు కారణం కావచ్చు. పద్మశాలీ కులం చాలా తెలివైనది. నైపుణ్యం కలిగింది. అదే కులం బ్రాహ్మణవాదానికి అతి సన్నిహితంగా కూడా వుంది. బ్రాహ్మణ భావజాల తాకిడికి అధిక స్థాయిలోనూ ఎక్కువ తీవ్రతతోనూ గురైన కులం అది. చారిత్రకంగా బ్రాహ్మణుల ఆధిక్యతను అంగీకరించిన శూద్ర సమూహంలో ఒక బృందం. అందుకే ఇతర భావజాలాల కన్న ఎక్కువ బ్రాహ్మణ భావజాలానికి సమీప దూరంలో ఉంటుంది.
కానీ గద్దర్ పుట్టి పెరిగిన కులం అలాంటి వీలు లేనిది. అస్పృశ్యులు పూర్వం బౌద్ధులు. బ్రాహ్మణ భావజాలాన్ని అంగీకరించని కారణంగానే వెలివేతకు గురయ్యారు. బ్రాహ్మణిజం మీద వేల సంవత్సరాలుగా పోరాడుతున్న అస్పృశ్య జాతుల్లో మాలలు కూడా ఒకరు. అందువల్ల బ్రాహ్మణిజానికి చాలా దూరంలో ఉంటారు.
మాల మాదిగల జీవితాల్లో బ్రాహ్మణ విలువలు ఈ మధ్యే ప్రవేశించాయి. అందుకు విద్యా సంస్థలు కారణం. కమ్యూనిస్టు పార్టీలు కారణం. అస్పృశ్యులను గుళ్లలోకి తీసుకెళ్లే పోరాటాలు కమ్యూనిస్టులు చేయటం వల్లే బ్రాహ్మణిజం పట్ల సానుకూలత మాల మాదిగల్లో ఏర్పడుతుంది. బ్రాహ్మణ విద్యా విధానం వల్ల తయారైన వారికి కూడా ఆ విలువలు ఎక్కువగా అబ్బుతాయి.
మరీ ఉద్యోగాల్లో చేరిన దళితులకు దాని ప్రభావం ఎక్కువ వుంటుంది. అణగారిన కులాలను బ్రాహ్మణీకరించే స్వామీజీలు, సంస్థలు చురుకుగా పని చేయటం కూడా మరో కారణం. అంబేద్కరిజాన్ని ఒక విలువల వ్యవస్థగా వ్యవస్థీకృతం చేయ లేకపోయిన సంఘాల వైఫల్యం కూడా మరొక కారణం. గద్దరు జన్మించింది దళిత కులంలో.
ఎదిగింది వర్గ పోరాటంలో. బాబాసాహేబ్ ఉద్యమంలో ఎదగాల్సిన విఠల్ రావు ‘గద్దర్’గా మావోయిస్టు ఉద్యమంలో నిలువుగా ఎదిగాడు. వర్గ వ్యతిరేక కసి ఆయన పాటల్లో ఎక్కువ కనిపించేది. కారంచేడు, చుండూరు సంఘటనల తర్వాత కుల వ్యతిరేక కసి ఆయన గళంలో కనిపించింది. దళిత పులులమ్మా అనే పాట అందుకు మూలమైంది.
దళిత పులులమ్మా అని ఆరంభమైన చోటే గద్దర్ విస్తరించాల్సి ఉండే. అక్కడి నుండి మళ్లీ వర్గం వైపు వెళ్లిపోయాడు. దళితులను సాయుధ పోరాటం వైపు నడిపించే సైనిక దృష్టి ఆయనది. మావోయిజం ఆ దృష్టికి హేతువు. మార్క్సిజం, మావోయిజం ఆయనకు బాగా తెలుసు. వాటిలోని అనేక భావనలను అత్యంత తేలిక భాషలోనూ ప్రజల భాషలోనూ జన సమూహాలకు చేరవేశాడు. అంబేద్కరిజం పట్ల ఆయనది విమర్శనాత్మక దృష్టి.
మార్క్సిస్టు కళ్ల నుండి అంబేద్కర్‌ను చూసే పద్ధతిని సైన్యంలోనూ రాజకీయరంగంలోనూ ఆ పార్టీ నేర్పుతుంది. అందుకే అంబేద్కరిజం ఆయన మనసును ఆకర్షించ లేకపోయింది. అంబేద్కర్ పట్ల ఆయనకు గౌరవం. కానీ అంబేద్కరిజమే ఈ దేశానికి విముక్తి కల్పిస్తుందనే దాని మీద ఆయనకు విశ్వాసం లేదు. ఆయుధం మీద మాత్రమే నమ్మకం వున్న చోట అంబేద్కరిజం అనే జ్ఞాన ఖడ్గం కంటికి కనిపించదు.
గద్దర్ కుల వ్యతిరేక పోరాటంలో విస్తరించాల్సిన మేరకు అందుకే విస్తరించ లేకపోయాడు. అణగారిన కులాల బాధలకు వర్గ దోపిడే కారణమనీ ఆ వర్గ దోపిడిని కొనసాగిస్తున్న పెట్టుబడిదారులకూ సామ్రాజ్యవాదులకూ వ్యతిరేకంగా పోరాడాలనీ అందుకు సాయుధం కావాలనీ చేసే కురుచ వాదనలన్నీ సాంస్కృతిక రంగంలోనూ ప్రతిఫలిస్తుంటాయి.
గద్దరుకు కూడా ఈ పరిమితి ఎదురైంది. ఈ పరిమితిని అధిగమించే సంఘర్షణ ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన విశ్వసించే పార్టీ సూత్రాలకు భిన్నంగా అంబేద్కర్‌ను మోయాలని ప్రయత్నించాడు. మార్క్సూ కావాలి. అంబేద్కరూ కావాలని ఆయన అనేక వేదికల మీద బాహాటంగానే ప్రకటించాడు. ఆయన చుట్టూ వున్న అభిమానులూ సానుభూతిపరులూ ఈ విషయాన్ని అంగీకరించారు.
కానీ గద్దరు సంపూర్ణ అంబేద్కరైటు అయితే ఏం జరిగేది? సాంఘిక విప్లవం సాధ్యమయ్యేది. అందుకు అవసరమైన సాంస్కృతిక వాతావరణం నిర్మాణమయ్యేది. కుల వ్యవస్థను కూల్చేసే ఉద్యమాలు బలపేడేవి. అంబేద్కరిజం ప్రజలకు చేరువయ్యేది. ఒక సిద్ధాంతంగా భావజాలంగా ప్రాపంచిక దృక్పథంగా అంబేద్కరిజం సామాన్య శ్రోతకూ ప్రేక్షకుడికీ బోధపడేది.
తన తండ్రి ఆశించిన సాంఘిక విప్లవ క్రమం ఎప్పుడో ఆరంభమయ్యేది. కాన్షిరాంకు గద్దరు తోడైతే కింది కులాలు దోపిడీ లేని సమాజాన్ని నిర్మించుకొనేవి. గద్దరు మీద కాల్పులు జరిగినప్పుడు కాన్షిరాం పడిన ఆవేదన, ఆవేశమూ అందరికీ తెలిసిందే. గాయపడ్డ పులి తిరిగి తన బోనును తానే వెదుక్కుంటూ వెళ్లిపోయింది. పులి రాజు మాత్రం ఉత్తర భారతాన్ని ఏలుకున్నాడు.
గద్దరులో ఒక సుగుణం వుంది. అది సమాజ చలనశీలతను గమనించే గుణం. ప్రజా పోరాటాలలో వస్తున్న మార్పులను గమనిస్తూ, పాలకుల వ్యూహాలను పసిగట్టే గుణం అతనిలో వుంది. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకోవడానికి గద్దర్ రాసి పాడిన పాటలు, ఆయన చేసిన ప్రసంగాలు కూడా ముఖ్యమైన కారణం. వర్గ పోరాటాలకు గల ప్రాంతీయ స్వభావాన్ని, ప్రాంతీయ పోరాటాలకు గల వర్గ, కుల స్వభావాన్ని ఆయన నిర్దిష్టంగానే గుర్తించాడు. జ్ఞాన అన్వేషణ ఆయన గుణం.
పాల్ రాబ్సన్, బాబ్ మార్లే, మైఖేల్ జాక్సన్‌లు ప్రపంచ కళా చరిత్రలో ఎటు తిరిగినా ఎదరుపడే బాలెడీర్లు.ఈ ముగ్గురికన్నా గద్దరుది గొప్పస్థానం. ప్రపంచ యవనిక మీద గద్దరు ఒక మైలు రాయి. యాభైయేళ్లకు పైగా ప్రజల విముక్తి కోసం, సమానత్వ ప్రపంచం కోసం పాటలల్లి ప్రదర్శనలిచ్చిన వాగ్గేయకారుడు ఆయన ఒక్కడే. ఇలా చెప్పటం అతిశయోక్తి అనిపిస్తుందేమో గానీ, నా అధ్యయనం మేరకు గద్దరుతో సాటి రాగల కళాకారుడు ఎవరూ తారసపడలేదు.
అయితే నల్లజాతి ప్రజల దోపిడీకి వ్యతిరేకంగా పాటలాడిన పాల్ రాబ్సన్‌లో వర్గ చైతన్యం ఉంది. ఆయనది అమెరికన్ మార్క్సిజం. అమెరికాలో కమ్యూనిస్టులు ఎలా బాల్యదశలోనే విఫలమయ్యారో, పాల్ రాబ్సన్ కూడా వాళ్లతోపాటే విఫలమయ్యాడు. యిక మైకేల్ జాక్సన్‌ది వ్యాపార ధోరణి. అతనికి దోపిడీ వ్యతిరేక చైతన్యం వుండి, ప్రజా పోరాటాలలో అంతర్భాగమైతే అతడు గద్దరులా ఉండే వాడు. కానీ అతన్ని మార్కెట్ మింగేసింది. వ్యాపార సంస్కృతికి పరిమితం చేసింది.
ఆధిపత్య వ్యవస్థలో చోటు కోసం ప్రయత్నించిన ఎవరైనా ‘వారెంతటి ప్రతిభా సామర్థ్యం కలిగి వున్నా’ విఫలమైతీరుతారు. బాబ్ మార్లే గొప్ప వాగ్గేయకారుడు. కానీ అతడికి రాజకీయ క్రమశిక్షణగానీ లేదా సైనిక క్రమశిక్షణగానీ లేవు. అరాచక, అవ్యవస్థిత దినచర్య తనది. కేవలం అద్భుతమైన గానకళా నైపుణ్యం వున్నంత మాత్రాన్నే గొప్ప వాగ్గేయకారులు కాలేరు.
సైద్ధాంతిక అవగాహన, వ్యక్తిగత జీవితంలో నైతికత, రాజకీయ ప్రవర్తనలో పారదర్శకత గలవాళ్లే ప్రపంచాన్ని ప్రభావితం చేయగల వాగ్గేయకారులవుతారు. ముఖ్యంగా అసమానతను, ఆధిపత్య వ్యవస్థను కూల్చే వాళ్లు మాత్రమే దేదీప్యమానంగా వెలుగుతారు. గద్దర్ అలాంటి ఒక తార.
– డాక్టర్ జిలుకర శ్రీనివాస్