కర్ణాటకలో గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై నిషేధం.. ఎందుకంటే..?
ఎంతో ఇష్టంగా తినే గోబీ మంచూరియాపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

ఎంతో ఇష్టంగా తినే గోబీ మంచూరియాపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ కలర్‌తో చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయి(కాటన్ క్యాండీ) విక్రయాలపై కర్ణాటక సర్కార్ నిషేధం విధించింది. కలర్ కోసం ఉపయోగించే రోడమైన్-బీ అనే రసాయన ఏజెంట్ ఆరోగ్యానికి హానికరమని, దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నందున బ్యాన్ చేస్తున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండురావు మాట్లాడారు. కొన్ని ఆహార పదార్థాల తయారీకి హానికర రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఇటీవల ఆరోగ్యశాఖ అధికారులు కర్ణాటక వ్యాప్తంగా ఉన్న పలు ఫుడ్ సెంటర్ల నుంచి 171 నమూనాలను సేకరించి, పరీక్షించగా 107 పదార్థాల్లో హానికర కృత్రిమ రంగులను ఉపయోగించినట్లు తేలిందని తెలిపారు. వాటిల్లో రోడమైన్-బీ, టాట్రజైన్ వంటి రసాయనాలను వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. ఈ రసాయనాల వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని దినేశ్ గుండురావు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కలర్డ్ గోబీ మంచూరియా, కాటన్ క్యాండీని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఈ రెండింటిని తయారు చేసినా, విక్రయించినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఏడేండ్ల జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అయితే ఎలాంటి రంగులు వాడని తెల్లని పీచుమిఠాయిపై నిషేధం విధించలేదని పేర్కొన్నారు.
ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం కాటన్ క్యాండీపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గోవాలో కూడా గోబీ మంచూరియాపై నిషేధం విధించారు. రోడమైన్-బీని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. అంటే దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. ఇది అధిక మొత్తంలోని శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. క్యాన్సర్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది.