Gold ETF| భారతీయులా మజాకా..! జనవరిలో ఏడురెట్లు పెరిగిన బంగారం ఈటీఎఫ్‌లో పెట్టుబడులు..!

భారతీయులకు బంగారం అంటే ఎంతో ముక్కువ. బంగారంతో మనోళ్లకు విడదీయలేని అనుబంధం ఉన్నది. ముఖ్యంగా మగువలకు పసిడి అంటే ఎనలేని మమకారం

Gold ETF| భారతీయులా మజాకా..! జనవరిలో ఏడురెట్లు పెరిగిన బంగారం ఈటీఎఫ్‌లో పెట్టుబడులు..!

Gold ETF| భారతీయులకు బంగారం అంటే ఎంతో ముక్కువ. బంగారంతో మనోళ్లకు విడదీయలేని అనుబంధం ఉన్నది. ముఖ్యంగా మగువలకు పసిడి అంటే ఎనలేని మమకారం. చాలా మంది బంగారాన్ని స్టేట్‌ సింబల్‌గా తీసుకుంటారు. మరికొందరు పెట్టుబడిగానూ చూస్తుంటారు. చాలా మంది తమ వేతనంలో కొంత డబ్బును పోగు చేసి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. భవిష్యత్‌లో కుటుంబ అవసరాలకు పని వస్తుందంని భావిస్తుంటారు. అదే సమయంలో పెళ్లిళ్లు, శుభాకార్యాల సమయంలో బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు.


ఈ క్రమంలో జనవరి బంగారం కొనుగోళ్లు భారీగా జరిగాయి. డిసెంబర్‌తో పోలిస్తే భారతీయులు ఏడురెట్లు అధికంగా బంగారాన్ని కొనుగోలు చేశారు. జనవరిలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) రూ.657 కోట్లను ఆకర్షించాయి. ఇది అంతకుముందు నెల అంటే డిసెంబర్‌తో పోలిస్తే ఏడు రెట్లు పెరిగింది అని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) డేటా పేర్కొంది. యూఎస్‌లో కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం మధ్య బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నట్లు తెలిపింది.


డిసెంబర్‌ చివరినాటికి రూ.27,336 కోట్లతో పోలిస్తే జనవరి చివరి నాటికి గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తులు (AMU) 1.6 శాతం పెరిగి రూ. 27,778 కోట్లకు చేరుకుందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) డేటా తెలిపింది. జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు రూ.88.3 కోట్ల నుంచి రూ.657.4 కోట్లకు చేరాయని గణాంకాలు పేర్కొంటున్నాయి. టాటా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ ప్రారంభించడం ద్వారా రూ.6 కోట్లు రాబట్టడం కూడా వృద్ధికి తోడ్పడింది.


కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ద్రవ్యోల్బణం ఆశించిన సంఖ్య కంటే ఇంకా ఎక్కువగా ఉండడంతో సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా విశ్లేషకుడు మెల్విన్ శాంటారిటా పేర్కొన్నారు. వడ్డీ రేట్లు తగ్గుముఖంపడితే బంగారం జోరుగా పెరుగుతుందనే అంచనాలతో పలువురు పెట్టుబడిదారులు ఈటీఎఫ్‌లలో పెట్టుబడికి మొగ్గుచూపుతున్నట్లు వివరించారు. 2023లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.2,920 కోట్ల నిధులు పెట్టుబడిగా తరలిరాగా.. అంతకుముందు ఏడాది అంటే 2022లో వచ్చిన పెట్టుబడులకంటే రూ.459 కోట్లు అధికంగా ఆకర్షించాయని తెలిపారు.


గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో యూనిట్ల రూపంలో పెట్టుబడిదారులు మదుపు చేసే నిధుల్ని ఆ ఈటీఎఫ్‌లు తిరిగి బులియన్‌ మార్కెట్‌లో బంగారం కొనుగోలు చేసి వాల్ట్‌లో నిల్వ చేస్తాయి. ఈ యూనిట్లను డిజిటల్‌ రూపంలో పెట్టుబడిదారుల డీమ్యాట్‌ ఖాతాల్లో జమ చేస్తుంటారు. కోరుకున్న వారికి పత్రాలు సైతం అందజేస్తారు. ఒక యూనిట్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఒక గ్రాము వందశాతం స్వచ్ఛతగల బంగారానికి సమానంగా ఉంటుంది. దేశంలో భౌతిక బంగారం ధర ఆధారంగా గోల్డ్‌ ఈటీఎఫ్‌ సైతం ట్రేడవుతుంది. పెట్టుబడిగా పెట్టిన వారు ఈటీఎఫ్‌లను అవసరం ఉన్న సమయంలో ఎప్పుడైనా విక్రయించుకునే సౌలభ్యం ఉంటుంది.