కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ మూకుమ్మడి దాడి: గుత్తా
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలంతా కేసీఆర్ పై మూకుమ్మడి దాడి చేయడం విచారకరమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు

- మోడీ మత రాజకీయాలు సిగ్గుచేటు
- రెండు పార్టీలపై ప్రజలకు ప్రేమ లేదు
- తాను కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు తప్పుడు ప్రచారం
- శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలంతా కేసీఆర్ పై మూకుమ్మడి దాడి చేయడం విచారకరమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలన అవసరమని, మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఆదివారం నల్గొండ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వేళ తెలంగాణపై రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేతో పాటు మోడీ, అమిత్ షా, నడ్డా ముకుమ్మడి దాడి చేయడం దుర్మార్గమన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణపై విషం చిమ్ముతోందని, మోడీ అక్కసు వెళ్లగకుతున్నారని మండిపడ్డారు. ప్రధాని జాతీయ దృక్పథంతో ఉండాలి కానీ, కులాలు, మతాల కుమ్ములాటలు ప్రోత్సహించడం సరికాదన్న ఆయన, అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని కాంగ్రెస్ కుటిల ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, దీని వెనుకాల కాంగ్రెస్ కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు ఎవరిపైన కుట్రలు చేయలేదని స్పష్టం చేశారు.
నల్గొండ జిల్లాలో 12కి 12 స్థానాలు బీఆరెస్ గెలవాలనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఓటు అడిగే హక్కు ఒక్క కేసీఆర్ కి మాత్రమే ఉందని, పని చేసి ఓట్లు అడుగుతున్నామే తప్ప.. పదవుల కోసం కాదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని.. ఊహా లోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణ ఆగం అవుతుందని, విజన్ లేని ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆరోపణలు చేస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనన్నారు.