Gyanvapi Case | జ్ఞానవాపి మసీదులో పూజలపై అంజుమన్‌ కమిటీ పిటిషన్‌.. కీలక తీర్పును వెలువరించిన అలహాబాద్‌ హైకోర్టు

వారణాసి జ్ఞానవాపి మసీదులోని బేస్‌మెంట్‌లో పూజలు చేసేందుకు అనుమతి ఇస్తూ వారణిసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించింది.

Gyanvapi Case | జ్ఞానవాపి మసీదులో పూజలపై అంజుమన్‌ కమిటీ పిటిషన్‌.. కీలక తీర్పును వెలువరించిన అలహాబాద్‌ హైకోర్టు
  • ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం
  • బేస్‌మెంట్‌లో కొనసాగనున్న పూజలు


Gyanvapi Case | వారణాసి జ్ఞానవాపి మసీదులోని బేస్‌మెంట్‌లో పూజలు చేసేందుకు అనుమతి ఇస్తూ వారణిసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించింది. అంజుమన్‌ అరేంమెంట్‌ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రోహిత రంజన్‌ అగర్వాల్‌ తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇప్పటికే ఇరువర్గాలు వాదనలు వినిపించగా.. కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. వారణాసి జిల్లా కోర్టు జనవరిలో పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.


ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అయితే, జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని వ్యాస్‌ బేస్‌మెంట్‌లో హిందువులు పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ కోర్టు తోసిపుచ్చింది. అంజుమన్ అప్పీల్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించిందని హిందూ వర్గం తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. వారణాసి జిల్లా కోర్టు జనవరి 17, 31 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులను అలహాబాద్ హైకోర్టులో అంజుమన్‌ కమిటీ సవాల్‌ చేసిందని పేర్కొన్నారు. జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని వ్యాస్ బేస్‌మెంట్‌లో కొనసాగుతున్న పూజలు కొనసాగుతాయని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.


ఇదిలా ఉండగా.. శైలేంద్ర కుమార్‌ పాఠక్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ ఆధారంగా వారణాసి జిల్లా కోర్టు తీర్పును వెలువరించింది. తన తాత సోమనాథ్‌ వ్యాస్‌ 1993 డిసెంబర్‌ వరకు బేస్‌మెంట్‌లో పూజలు చేశారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. వార‌స‌త్వం మేరకు బేస్‌మెంట్‌లో పూజలు చేసేందుకు అవకాశం కల్పించాలని కోర్టును కోరారు. కాశీ విశ్వనాథుడి ఆలయ పరిసరాల్లో ఉన్న జ్ఞానవాపి మసీద్‌లో మొత్తం నాలుగు సెల్లార్లు ఉంటాయి. ఇందులో ఒక సెల్లార్‌ వ్యాస్‌ ఫామిలీ వద్దనే ఉన్నట్లు తెలుస్తున్నది.


శైలేంద్ర చేసిన వాదనలను మసీద్‌ కమిటీ తోసిపుచ్చింది. సెల్లార్‌లో ఎలాంటి దేవతామూర్తులు లేవని.. 1993 వరకు ఎలాంటి పూజలు జరుగలేదని పేర్కొంది. వారణాసి కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ మసీద్‌ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ క్రమంలో హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఇరువర్గాల వాదనలు ఈ నెల 15న పూర్తి చేసి.. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా అంజుమన్‌ కమిటీ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పును వెలువరించింది.