మహా స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

14 మంది ఎమ్మెల్యేలకు బాంబే హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.

మహా స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

♦ 14 మంది ఉద్ధవ్‌ సేన ఎమ్మెల్యేలకూ..

 షిండే వర్గం దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌లో ఫిబ్రవరి 8న విచారణ

ముంబై: శివసేన (షిండే) చీఫ్‌ విప్‌ భరత్‌షెట్‌ గోగావాలే దాఖలు చేసిన పిటిషన్‌లో మహారాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌, శివసేన (ఉద్ధవ్‌)కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు బాంబే హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఠాక్రే గ్రూపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడాన్ని సవాలు చేస్తూ గోగావాలే జనవరి 12న ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రతివాదులందరూ తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించిన జస్టిస్‌ గిరీశ్‌ కులకర్ణి, ఫిర్దోష్‌ పూనివాలా ధర్మాసనం.. ఫిబ్రవరి 8న తదుపరి వాదనలు వింటామని పేర్కొన్నది. స్పీకర్‌ ఆదేశాలు చెల్లుబాటు కావని, వాటిని కొట్టివేయాలని, 14 మంది ఉద్ధవ్‌ వర్గ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని గోగావాలే తన పిటిషన్‌లో కోరారు. స్పీకర్‌ ఆదేశాలను సవాలు చేస్తూ మరోవైపు ఠాక్రే వర్గం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించారని, స్వచ్ఛందంగానే శివసేన సభ్యత్వాన్ని వదులుకున్నారని గోగావాలే పేర్కొన్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీనిని స్పీకర్‌ కేవలం ఆరోపణలుగా పేర్కొంటూ తన ఆదేశాల్లో పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. స్పీకర్‌ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని, చెల్లుబాటు కావని, రాజ్యాంగ వ్యతిరేకమని అందుకే తాము హైకోర్టును ఆశ్రయించామని షిండే వర్గం నేతలు చెబుతున్నారు.