Nalgonda: BN స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి: విగ్రహావిష్కరణ సభలో మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: తెలంగాణ విముక్తి పోరాటయోధుడు, మాజీ ఎంపీ బిఎన్ రెడ్డి స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ ఎస్ మండలం దాచారం గ్రామంలో బీమిరెడ్డి నర్సింహ రెడ్డి శతదినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా తుమ్మల పెన్ పహాడ్ ఎక్స్ రోడ్‌లో బీఎన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం దాచారం గ్రామంలో బీఎన్ స్మారక గ్రంథాలయాన్ని ప్రారంభించిన మంత్రి త‌ద‌నంత‌రం ఏర్పాటు చేసిన […]

Nalgonda: BN స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి: విగ్రహావిష్కరణ సభలో మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: తెలంగాణ విముక్తి పోరాటయోధుడు, మాజీ ఎంపీ బిఎన్ రెడ్డి స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ ఎస్ మండలం దాచారం గ్రామంలో బీమిరెడ్డి నర్సింహ రెడ్డి శతదినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా తుమ్మల పెన్ పహాడ్ ఎక్స్ రోడ్‌లో బీఎన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం దాచారం గ్రామంలో బీఎన్ స్మారక గ్రంథాలయాన్ని ప్రారంభించిన మంత్రి త‌ద‌నంత‌రం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

తెలంగాణ సమాజం స్వేచ్చ గా ఉందంటే దానికి కారణం బీఎన్ పోరాట ఫలితమేనని అన్నారు.
ప్రజలంతా అభిమానంతో బీఎన్‌గా పిలుచుకునే భీమిరెడ్డి నర్సింహారెడ్డికి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక పుట ఉందని గుర్తు చేశారు. విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రా రెడ్టికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మకు ద‌న్నుగా నిలిచి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా మలుపు తిప్పిన వ్యూహకర్త బీఎన్ రెడ్డి అన్నారు. బీఎన్ జీవితం నేటి తరానికి ఆదర్శం, స్ఫూర్తి వంతమన్నారు. వితంతువును వివాహమాడిన ఆదర్శమూర్తి భీమిరెడ్డి నర్సింహారెడ్డి అన్నారు.

రాజకీయంగా విభేదించినా, బీఎన్‌ను అభిమానించే లక్షలాది మందిలో నేను ఒకడిని అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీఎన్ స్ఫూర్తితోనే తాను రాజకీయాలలోకి వచ్చానన్నారు. తుంగతుర్తి , సూర్యాపేట ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకు రావాలనే బీఎన్ చిరకాల వాంఛను నెరవేర్చిన ఖ్యాతి, ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దే అన్నారు. ఆంధ్ర కమ్యూనిస్టు నాయకుల మోసానికి బలైన నాయకుడు బీఎన్ రెడ్డి అని అన్నారు. ఆయన ఇచ్చిన చైతన్యంతోనే దేశంలో అన్ని చోట్లా కుల, మత వివాదాలు ఉన్నా, తెలంగాణలో లేవన్నారు. బీఎన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయం అన్నారు.

బీఎన్ కన్న కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు. బీఎన్ స్ఫూర్తితో తెలంగాణలో కేసీఆర్ ఆకలి కేకలు మటుమాయం చేశారన్నారు. ప్రాజెక్టులకు బీఎన్ పేరు నామకరణం చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ‌తానని మంత్రి హామీనిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆత్మకూర్ ఎస్ మండల ఎంపిపి స్వర్ణలత చంద్రారెడ్డి, పీఏసిఎస్ చైర్మన్ కొనతం సత్యనారయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తూడి నర్సింహారావ్, ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, మాజీ ఎంపిపి బ్రహ్మం, శిల్పి శ్రీనివాస్ రెడ్డి, బీ .ఎన్ కుమారుడు ప్రభాకర్ రెడ్డి, మేనళ్లులు, మండల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.