జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు.. రహదారిపై భారీగా బురద, బండరాళ్లు
జమ్మకశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా కొండ చరియల నుంచి భారీగా బురద, పెద్ద ఎత్తున బండరాళ్లు రహదారిపై చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి

- జమ్ము-శ్రీనగర్ హైవేపై రాకపోకలు బంద్
విధాత: జమ్మకశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా కొండ చరియల నుంచి భారీగా బురద, పెద్ద ఎత్తున బండరాళ్లు రహదారిపై చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాంబన్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏర్పడిన బురద సోమవారం శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున చేరింది.
దాంతో ఆ రహదారిపై వాహనాల రాకపోకలను మూసివేసినట్టు అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించే వరకు జాతీయరహదారిపై వాహనదారులు ప్రయాణించకుండా ఉండాలని ప్రజలను కోరారు.
“రాంబన్‌లోని మెహద్-కాఫ్టేరియా, బనిహాల్ ప్రాంతంలోని తబేలా చమల్వాస్ వద్ద బురద కారణంగా శ్రీనగర్-జమ్మూ హైవేపై ట్రాఫిక్ మూసివేయబడింది” అని ట్రాఫిక్ విభాగం అధికారి ఒకరు తెలిపారు. ఆర్టీరియల్ రోడ్డులోని ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు చిక్కుకుపోకుండా ఉండేందుకు అధికారులు హైవే వెంబడి వివిధ చోట్ల ట్రాఫిక్‌ను నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు మెరుగు పడ్డాక, హైవేపై మళ్లీ వాహనాల రాకపోకలను పునరుద్దరిస్తామని అధికారులు వెల్లడించారు.