High Court | తెలంగాణ హైకోర్టులో తొలి తెలుగు తీర్పు..
High Court స్థానిక భాషల్లో కేరళ తర్వాత తెలంగాణ హైకోర్టలోనే.. వీలునామా వ్యాజ్యంలో జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం చొరవ తెలుగులో 45 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిన ధర్మాసనం హైదరాబాద్, విధాత: తెలుగులో తొలి తీర్పును వెలువరించడంతో తెలంగాణ హైకోర్టు చరిత్ర సృష్టించింది. ఉమ్మడి హైకోర్టులో ప్రాంతీయ భాషలో ఉత్తర్వులు రావడం చరిత్రలో ఇదే మొదటిది కావడం విశేషం. సికింద్రాబాద్‌లోని మచ్చ బొల్లారం గ్రామంలోని తల్లి, అన్నదమ్ముల భూ వివాదానికి సంబంధించి దాఖలైన […]

High Court
- స్థానిక భాషల్లో కేరళ తర్వాత తెలంగాణ హైకోర్టలోనే..
- వీలునామా వ్యాజ్యంలో జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం చొరవ
- తెలుగులో 45 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిన ధర్మాసనం
హైదరాబాద్, విధాత: తెలుగులో తొలి తీర్పును వెలువరించడంతో తెలంగాణ హైకోర్టు చరిత్ర సృష్టించింది. ఉమ్మడి హైకోర్టులో ప్రాంతీయ భాషలో ఉత్తర్వులు రావడం చరిత్రలో ఇదే మొదటిది కావడం విశేషం. సికింద్రాబాద్‌లోని మచ్చ బొల్లారం గ్రామంలోని తల్లి, అన్నదమ్ముల భూ వివాదానికి సంబంధించి దాఖలైన అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ఇటీవల 45 పేజీల జడ్జిమెంట్‌ను తెలుగులో ఇచ్చింది.
ఈ కేసులో విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు అధికారిక కార్యకలాపాల కోసం ఆంగ్లంలో కూడా ప్రతిని వెలువరించింది. కొన్ని ఆంగ్ల పదాలకు సందర్భానుసారం తెలుగు పదాలు అందుబాటులో లేకపోవడంతో, మరికొన్ని ఆంగ్ల పదాలు జన బహుళ్యంలో ఎక్కువగా వినియోగంలో ఉండటంతో వాటిని తీర్పు కాపీలో ఆంగ్లంలోనే పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ప్రాంతీయ భాషలో హైకోర్టు తీర్పు వెలువరించడం ఇది రెండోసారి. కేరళ హైకోర్టు గతంలో అక్కడి భాషలో తీర్పునిచ్చింది. 2023, జనవరి 26 నుంచి సుప్రీంకోర్టు తీర్పులను వివిధ భారతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంచే సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
కేసుకు సంబంధించిన వివరాలు..
మచ్చబొల్లారం సర్వే 162, 163లో కె.వీరారెడ్డికి 13.01 గుంటల భూమి ఉండేది. తండ్రి మరణానంతరం అందులో 4.08 ఎకరాలు తల్లి సాలమ్మకు ఇచ్చి మిగిలినది కొడుకులిద్దరు పంచుకున్నారు. సాలమ్మ జీవించి ఉండగానే ఆమె భూమిని వాదప్రతివాదులు మౌఖిక అగ్రిమెంట్ ప్రకారం చెరిసగం తీసుకున్నారు.
2005లో సాలమ్మ చనిపోవడంతో తనకు ఆమె ద్వారా సంక్రమించిన ఆస్తిని మ్యూటేషన్ చేయాలని కుమారుడు చంద్రారెడ్డి మండల రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. సాలమ్మ రాసిన వీలునామాపై వీరారెడ్డి మరో కుమారుడు కె.ముత్యంరెడ్డి, ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
హిందూ వారసత్వ చట్టం-1956 ప్రకారం హిందూ స్త్రీ తన భర్త నుంచి వారసత్వంగా పొందిన ఆస్తిని (4.08 ఎకరాలు) భర్త వారసులకు బదలాయించాలని, భారత వారసత్వ చట్టం 1925కు అనుగుణంగా వీలునామా లేదని, సాలమ్మకు 80 ఏళ్ల వయసులో భయపెట్టి వీలునామా రాయించారని, కాబట్టి ఆమె ఆస్తిని వారసులందరికీ సమంగా పంచాలన్నారు.
వీరి వాదనలను కిందికోర్టు ఆమోదించింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ చంద్రారెడ్డి హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ నగేశ్ ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది.