హిమాచల్ సీఎం ఎంపిక.. ఆయా రాష్ట్రాల నేతలకు సంకేతం
ఫలితం ఆశించకుండా కార్య సాధన.. వరించిన ఫలం.. కష్టపడే వారికే పదవులు.. రుజువైన వైనం విధాత: కష్టకాలంలో పార్టీని పట్టుకొని ఉండటం, నేతల మధ్య ఐక్యత కోసం కృషి చేయడం, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించడం ఇవన్నీ హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగాయి. ప్రియాంక గాంధీ ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి అన్నివర్గాల వారికి దగ్గరయ్యేందుకు యత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించాయి అయితే హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారు? సీఎం పదవికి తీవ్ర పోటీ ఉన్నది. రాజ […]

- ఫలితం ఆశించకుండా కార్య సాధన..
- వరించిన ఫలం..
- కష్టపడే వారికే పదవులు.. రుజువైన వైనం
విధాత: కష్టకాలంలో పార్టీని పట్టుకొని ఉండటం, నేతల మధ్య ఐక్యత కోసం కృషి చేయడం, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించడం ఇవన్నీ హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగాయి. ప్రియాంక గాంధీ ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి అన్నివర్గాల వారికి దగ్గరయ్యేందుకు యత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించాయి
అయితే హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారు? సీఎం పదవికి తీవ్ర పోటీ ఉన్నది. రాజ వంశీకులైన వీరభద్రసింగ్ సతీమణి ప్రతిభాసింగ్, బ్రాహ్మణ వర్గానికి చెందిన ముకేశ్ అగ్నిహోత్రి పోటీ పడ్డారు. అయితే తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది సుఖ్వీందర్ సింగ్ వైపే మొగ్గు చూపారు.
దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం మాజీ సీఎం వీరభద్రసింగ్ వారసులను పక్కన పెట్టి సుఖ్వీందర్‌సింగ్‌ను ఎంపిక చేసింది. అలాగే రాహుల్‌గాంధీకి ఆయన సన్నిహితుడు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి తన కెరీర్‌ను ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013-2019 వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
పార్టీకి ప్రస్తుతం ఇలాంటి నాయకులే కావాలి అనే సంకేతాన్ని సుఖ్వీందర్ సింగ్ ఎంపిక ద్వారా ఆ పార్టీ అధిష్ఠానం ఇచ్చింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సొంత జిల్లా హమీర్‌పుర్ పరిధిలో ఆ పార్టీ 5 స్థానాల్లో ఓడిపోయింది. అక్కడ కాంగ్రెస్ 4 సీట్లు గెలువగా.. ఐదో స్థానంలో ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి విజయం సాధించారు.
హమీర్‌పుర్ సిఖ్విందర్‌సింగ్ సొంతం కావడం గమనార్హం. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రంలో కమలం పార్టీని మట్టికరిపించి కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో నాయకులంతా కలిసికట్టుగా పనిచేశారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు తొలిగించి అందరూ ఏక తాటి పైకి రావడం వెనుక సుఖ్వీందర్ కృషి ఉన్నదని అంటారు.
పార్టీలో ఆయకు అగ్గి బరాటా అనే పేరు కూడా ఉన్నది. అన్నిటి కంటే ముఖ్యమైనది విధేయత. పార్టీ గెలుపు కోసం పని చేయడం, సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా అభ్యంతరం లేదని ఆ నిర్ణయాన్ని అధిష్ఠానికి వదిలివేశారు. ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చాయి.
హిమాచల్‌లో కాంగ్రెస్ విజయం వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని యువ నాయకత్వానికి, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండేవారికి ఊరట కలిగించే విషయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కర్ణాటకలో గెలిస్తే డీకే శివకుమార్, రాజస్థాన్‌లో తిరిగి అధికారంలోకి వస్తే సచిన్ పైలట్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ విధేయులకు పార్టీ అధిష్ఠానం సముచిత స్థానం ఇస్తుందనే భరోసా తాజాగా హిమాచల్ ప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంల ఎంపిక ద్వారా స్పష్టం చేసింది.
అంతేకాదు వైరివర్గ నేతలుగా ముద్రపడిన అశోక్‌గెహ్లాట్, సచిన్ పైలట్ హిమాచల్‌ప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారానికి ఒకే ఫ్లైట్‌లో సిమ్లాకు చేరుకున్నారు. ఈ సంఘటన చూసిన వారికి ఆశ్చర్యం కలిగింది. అయితే దీనిపై స్పందించిన పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఇది ఫొటోల కోసం కాదు, వాస్తవంగానే తమ నేతలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఉన్నకోమటిరెడ్డి తన స్థాయిని మరిచిపోయి మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. పార్టీకి అనుకూల వాతావరణం ఉన్నప్పుడు నేతలంతా కలిసి పనిచేయాల్సిన సందర్భంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, టీపీసీసీ అధ్యక్షుడిపై కోపంతో పార్టీని బలహీనపరిచే చర్యలకు పాల్పడడం వంటివి వెంకట్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీశాయంటున్నారు.
అన్నదమ్ములు ఇద్దరు భిన్న అభిప్రాయాలతో ఉండవచ్చు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీలో వారు చేరవచ్చు. కానీ పార్టీలో ఉంటూ తన సోదరుడి గెలుపు కోసం ప్రత్యర్థి పార్టీ కోసం పని చేయమని కార్యకర్తలను కోరడం వంటివి ఆయన ప్రభను తగ్గించాయంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోనూ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. సీఎం పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు.
కానీ ఎన్నికల్లో మాత్రం పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేశారు. వారి కృషిని కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించింది. వారిందరికీ కీలక బాధ్యతలు అప్పగించింది. రేపు తెలంగాణలోనూ పార్టీ పటిష్టత కోసం, గెలుపు కోసం పనిచేసే వారికే అధిష్ఠానం అండదండలు ఉంటాయన్నది హిమాచల్‌ప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయాలే తెలియజేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.