Warangal: KCRపై విమర్శలు చేస్తున్న సంజయ్, రేవంత్‌పై ఎన్నికేసులు పెట్టాలి?: ఎర్ర‌బెల్లి

బిజెపి మీద మాట్లాడటానికి భయపడుతున్న రేవంత్ బిఆర్ఎస్ పై బురద చల్లే కుయుక్తులకు పాల్పడుతున్నాడని ఆరోప‌ణ‌ బ్లాక్ మెయిలింగ్, సెటిల్ మెంట్లలో రేవంత్ బిజీబిజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పార్టీలకు అతీతంగా మేమంతా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాహుల్ కోసం కొట్లాడుతుంటే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం బ్లాక్ మెయిలింగ్, సెటిల్ మెంట్లలో బిజీబిజీగా ఉండి, బిజెపి మీద మాట్లాడటానికే భయపడుతున్నాడని, […]

Warangal: KCRపై విమర్శలు చేస్తున్న సంజయ్, రేవంత్‌పై ఎన్నికేసులు పెట్టాలి?: ఎర్ర‌బెల్లి
  • బిజెపి మీద మాట్లాడటానికి భయపడుతున్న రేవంత్
  • బిఆర్ఎస్ పై బురద చల్లే కుయుక్తులకు పాల్పడుతున్నాడని ఆరోప‌ణ‌
  • బ్లాక్ మెయిలింగ్, సెటిల్ మెంట్లలో రేవంత్ బిజీబిజీ
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పార్టీలకు అతీతంగా మేమంతా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాహుల్ కోసం కొట్లాడుతుంటే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం బ్లాక్ మెయిలింగ్, సెటిల్ మెంట్లలో బిజీబిజీగా ఉండి, బిజెపి మీద మాట్లాడటానికే భయపడుతున్నాడని, పైగా బిఆర్ఎస్ పై బురద చల్లే కుయుక్తులకు పాల్పడుతున్నాడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. హన్మకొండలోని మంత్రి తన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు.

రాజకీయ ఆరోపణలకే నిరూపించాలని పట్టుపట్టి, కేసులు పెట్టి, పార్లమెంటు నుండి మెడపట్టి గెంటేస్తే, బిఆర్ఎస్ పై, తెలంగాణ ప్రభుత్వంపై, మా అధినేత చంద్రశేఖర్ రావు పై నిరాధార నిందారోపణలు చేస్తున్న బండి సంజయ్, రేవంత్ రెడ్డిలపై ఎన్ని కేసులు పెట్టాలి? ఎన్ని సార్లు వెలేయాలని ఆయన ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనం. ప్రశ్నించే గొంతులపై బీజేపీ ఉక్కుపాదం మోపుతుందనడానికి నిలువటద్దం. బిజెపి పాలన దేశంలో ఎమర్జెన్సీ ని తలపిస్తున్నది. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని మంత్రి ఎర్రబెల్లి ధ్వజమెత్తారు.

ప్రజాస్వామిక పార్లమెంట్ వ్యవస్థలో రాహుల్ గాంధీని బహిష్కరించడం చీకటి రోజు అని మంత్రి అభివర్ణించారు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పు కాదు. దాని తీవ్రతలో తేడాలుంటే నిరూపించమని కూడా అడగవచ్చు. కానీ, ఏకంగా పార్లమెంట్ సభ్యత్వాన్నే రద్దు చేయడం సిగ్గు చేటని అన్నారు. పరువునష్టం కేసులో వేసిన శిక్షకే అనర్హత వేటు వేస్తే క్రిమినల్ కేసులలో శిక్షలు పడ్డ బీజేపీ ఎంపీలు వున్నారు మరి వాళ్ళ సంగతేంటి? వారిపై ఇప్పటిదాకా ఎందుకు అనర్హత వేటు వేయలేదు?! ఇప్పుడు అలాంటి బిజెపి ఎంపీలను కూడా బహిష్కరిస్తారా? అని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు.

కెసిఆర్ పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే, లేనిపోని అపోహలతో, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న బండి సంజయ్ ని కూడా పార్లమెంట్ నుండి బహిష్కరిస్తారా? అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.