డ్రగ్స్ ముఠాలు ప్యాకప్ చేసుకోవాలి: హైద్రాబాద్ సీపీ
హైద్రాబాద్ సిటీలో డ్రగ్స్ సరఫరా, వినియోగ వ్యవహారాలు ఇక మీదట నడవవని, నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు

- హైద్రాబాద్ సీపీ కొత్తకోట హెచ్చరిక
విధాత: హైద్రాబాద్ సిటీలో డ్రగ్స్ సరఫరా, వినియోగ వ్యవహారాలు ఇక మీదట నడవవని, డ్రగ్స్ ముఠాలన్ని ప్యాక్‌ప్ చేసుకుని వెళ్లిపోవాలని నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ నూతన కమిషనర్‌గా ఆయన బుధవారం తన బాధ్యతలు స్వీకరించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఇంచార్జీ సీపీ సందీప్ శాండిల్యా నుండి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణతో పాటు హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. నాపై నమ్మకంతో సీపీగా నియమించి సిటీలో డ్రగ్స్ నిర్మూలన బాధ్యతలను నాకు అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలన్నారు. పార్టీల పేరుతో డ్రగ్స్ సరఫరా చేస్తే వదిలే ప్రసక్తే లేదని ఖరాకండిగా చెప్పారు.
డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తామన్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో సమన్వయం చేసుకుని ముందుకుపోతామన్నారు. నగరంలోని పబ్స్, రెస్టారెంట్లపై 24/7 నిఘా ఉంటుందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అవహేళనకు గురైందని, అందరితో ఫ్రెండ్లీగా ఉండటమే నష్టమేనన్నారు.
చట్టం గౌరవించే వారితో ఫ్రెండ్లీగానే ఉంటామని..చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ డిమాండ్ చాలా ఉందని, ఇండస్ట్రీకి చెందిన పలువురు డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన అంశంపై సినీ ఇండస్ట్రీ వారితో సమావేశం పెడతామని, అయిన వారు మారకపోతే సినీ ఇండస్ట్రీ అని కూడా చూడకుండా ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.