Hydrabad | తెలంగాణ అమరులు 1563.. అమరుల స్మృతి చిహ్నంలో వారి పేర్లేవి?: రేవంత్‌రెడ్డి
Hydrabad కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమరుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖిస్తాం వారందరి కుటుంబాలను ఆదుకుంటాం అధికారానికి ముందు అమరుల లెక్కలు చెప్పి.. ఇప్పుడు లెక్కలు లేంటున్న కేసీఆర్ అమరుల స్థూపం పేరుతో భారీ అవినీతి రూ.63.75 వేల కోట్లకు టెండరు ప్రకటన చివరకు 179 కోట్లకు చేరిన నిర్మాణ వ్యయం మీడియాతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విధాత, హైదరాబాద్ ప్రతినిధి: అధికారంలోకి రాకముందు అమరుల లెక్కలు చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ల లెక్కలు […]

Hydrabad
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే
- అమరుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖిస్తాం
- వారందరి కుటుంబాలను ఆదుకుంటాం
- అధికారానికి ముందు అమరుల లెక్కలు
- చెప్పి.. ఇప్పుడు లెక్కలు లేంటున్న కేసీఆర్
- అమరుల స్థూపం పేరుతో భారీ అవినీతి
- రూ.63.75 వేల కోట్లకు టెండరు ప్రకటన
- చివరకు 179 కోట్లకు చేరిన నిర్మాణ వ్యయం
- మీడియాతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: అధికారంలోకి రాకముందు అమరుల లెక్కలు చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ల లెక్కలు లేవన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 1,563 మంది అమరుల పేర్లను సువర్ణాక్షరలతో లిఖిస్తామని, అమరుల కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలను మళ్లీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ దశాబ్ధి ఉత్సవాలను పావుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను నమ్మి మరోమారు మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అమరుల చిహ్నం పేరుతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
తెలంగాణ అమరుల స్థూపం నిర్మాణానికి జూన్ 17, 2017న నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారని, డిజైన్, అంచనాల కోసం, పనులను పరిశీలించడానికి 6శాతం ఫీజు చెల్లించాలని పేర్కొన్నారన్నారు. జూన్ 28, 2018న నిర్మాణం కోసం 63 కోట్ల 75 లక్షల 35 వేల 381 కు టెండరు ప్రకటన ఇచ్చారని తెలిపారు. ఈ టెండర్‌ను కేసీ పుల్లయ్య కంపెనీ దక్కించుకోగా, కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్‌తో కలిశాక కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌గా మారిందని ఆరోపించారు.
ఈ కంపెనీ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన వాళ్లదని, కేటీఆర్ స్నేహితుడైన తేలకుంట్ల శ్రీధర్‌రెడ్డి.. అనిల్ కుమార్ కామిశెట్టితో వ్యూహాత్మకంగా ఈ నిర్మాణంలో కేటీఆర్‌కు మేలు జరిగేలా చేశారని ఆరోపించారు. రూ.80 కోట్ల అగ్రిమెంట్ కాస్తా రూ.127.50 కోట్లకు పెంచారని, అయినా సరిపోదని అంచనాను రూ.158.85 కోట్లకు పెంచారన్నారు. ఆ తరువాత రూ.179 కోట్ల 5 లక్షలకు అంచనా పెంచారన్నారు. కేటీఆర్‌ను బాటా చెప్పుతో కొట్టినా ఆయన పాపాలు తొలగవన్నారు.
అమరవీరుల పేర్లేవి?
ఇంత ఖర్చు చేసి కట్టిన స్మారకంలో కేవలం అమరవీరులకు జోహార్లు అని రాసి సరిపెట్టడంపై రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు రాష్ట్రంలో శిలాఫలకాలపై సీఎం కేసీఆర్ పేరు ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. చరిత్రను మలినం చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గ్రహించాలని కోరారు.
రూ.63కోట్లతో మొదలైన అమరుల స్మారకం అంచనా వ్యయం 179 కోట్ల 5లక్షలకు చేరడంపై నిలదీయాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. అమరుల స్మారకం అంటే తెలంగాణ అమరుల చరిత్ర కళ్లముందు మెదిలేలా ఉండాలని రేవంత్ అన్నారు. ఒక శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య… ఇలా వందలమంది అమరులు గుర్తొచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు.
అమరు స్మారక నిర్మాణం ఆంధ్రోళ్లకా?
పవిత్రమైన అమరుల స్మారక నిర్మాణం బాధ్యతను ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారని రేవంత్ మండిపడ్డారు. హజ్ యాత్రికులను పంపడానికి వెళుతున్న షబ్బీర్ అలీని గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమన్నారు. అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం కూడా పుల్లయ్య కంపెనీకే ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మారకం, సచివాలయ నిర్మాణాలపై విజిలెన్స్ తో విచారణ చేయిస్తామన్నారు.
అమరులను అవమానించారు…
తొలి తెలంగాణ ఉద్యమంలో 369, మలి దశ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ అమరుల స్మారకం చూడగానే వారి పోరాటాలు, త్యాగాలు గుర్తు రావాలన్నారు. అమరుల త్యాగాలను రాజకీయ స్వార్థానికి కేసీఆర్ ఉపయోగించుకున్నారని, కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తొలి, మలి ఉద్యమాల్లో 1,569 మంది అమరులయ్యారని కేసీఆర్ నిండు సభలో చెప్పారని గుర్తు చేసిన రేవంత్.. తొమ్మిదేళ్లయినా ప్రభుత్వానికి అమరుల వివరాలు దొరకలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1,569 మంది అమరుల పేర్లు శిలాశాసనంలో పొందుపరుస్తామన్నారు.
కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన అమరుల కుటుంబాలను గుర్తించి రూ.25 వేలు నెలకు పెన్షన్ అందుస్తామని, డిసెంబర్ 9న 1,569 మంది కుటుంబాలను పిలిచి సోనియా గాంధీ కుటుంబ సభ్యులతో సహపంక్తి భోజనాలు చేయిస్తామన్నారు. తెలంగాణ సాధన సమరయోధులుగా వారికి గుర్తింపు అందిస్తామని తెలిపారు.
దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ ప్రచారం
దశాబ్ధి ఉత్సవాల పేరుతో ప్రజల సొమ్మును కేసీఆర్ ప్రభుత్వం దుబారా చేస్తున్నదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా 10 హామీలను విస్మరించిందన్నారు. ఇందులో కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఫీజ్ రీయిబర్స్‌మెంట్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, రైతు రుణ మాఫీ, 12శాతం ముస్లిం రిజర్వేషన్లు, 12 శాతం గిరిజన రిజర్వేషన్ల వంటి హామీల అమలుతో పాటు అనేక అంశాలలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ తన పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తన్నారని మండిపడ్డారు.