ఎర్రబెల్లి.. ఓనమాలు, ఏబీసీడీలు సొంతంగా రాస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: రేవంత్ రెడ్డి

CM KCR కాస్త జాగ్రత్త.. నమ్మకద్రోహానికి కేరాఫ్ ఎర్రబెల్లి భూ అక్రమాలపై విజిలెన్స్ విచారణ పోరుగడ్డ మీద దళారికి అవకాశం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నమ్మకద్రోహానికి కేరాఫ్ అడ్రస్ ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. దళారీ దందాలకు, దగుల్బాజీ విధానాలకు, కోవర్టు పద్ధతికి మారుపేరు మంత్రి ఎర్రబెల్లి అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తున్నామని అధికారంలోకి […]

ఎర్రబెల్లి.. ఓనమాలు, ఏబీసీడీలు సొంతంగా రాస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: రేవంత్ రెడ్డి
  • CM KCR కాస్త జాగ్రత్త.. నమ్మకద్రోహానికి కేరాఫ్ ఎర్రబెల్లి
  • భూ అక్రమాలపై విజిలెన్స్ విచారణ
  • పోరుగడ్డ మీద దళారికి అవకాశం
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నమ్మకద్రోహానికి కేరాఫ్ అడ్రస్ ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. దళారీ దందాలకు, దగుల్బాజీ విధానాలకు, కోవర్టు పద్ధతికి మారుపేరు మంత్రి ఎర్రబెల్లి అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తున్నామని అధికారంలోకి రాగానే దయాకర్ రావు అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపి బొక్కలోకి దోస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర పాలకుర్తి నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన సందర్భంగా పాలకుర్తి సెంటర్‌లో సాయంత్రం జరిగిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆ పార్టీకి ద్రోహం చేసి, కులం కోసం, అధికారం కోసం అన్యాయం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి భూములు ఆక్రమించి, ధరణి పేరుతో దందాలు చేస్తూ అక్రమార్జనకు అలవాటు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బమ్మెర పోతన జన్మించిన గడ్డ, కవిత్వానికి, చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ప్రాంతం, వీరనారి చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ, భూ పోరాటాలు నిర్వహించిన ఎర్రం రెడ్డి సోదరులు ఈ ప్రాంతం నుంచే ఉండగా దగుల్బాజీ, దళారి, అక్షరం ముక్కరాని ఎర్రబెల్లిని ఎమ్మెల్యేగా గెలిపించడం బాధ కలిగిస్తుందని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎర్రబెల్లికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

తప్పులేకుండా రాస్తే తప్పుకుంటా..

ఓనమాలైనా, ఏబీసీడీలు అయినా పూర్తిగా రాస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి సవాలు చేశారు. రిజర్వాయర్ నిర్మాణంలో కమీషన్, రోడ్ల నిర్మాణంలో అక్రమం, గుట్టల ఆక్రమణ, కంటాయపాలెం, కొలంపల్లిలో భూ అక్రమ‌ణలు చేపట్టారని ఈ ఆరోపణలు, అక్రమాలన్నింటిని వెలికి తీస్తామని హెచ్చరించారు. నమ్మకద్రోహానికి రూపంగా నిలిచిన దయాకర్ రావుతో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని పడుకుంటే కిడ్నీలు మాయం చేస్తాడని సెటైర్ వేశారు.

ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

అధికారంలోకి రాగానే విద్య, ఉద్యోగ, వ్యవసాయ, ఉపాధి రంగాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తామని, ప్రతి పేదవారికి ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రజలు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.

రేవంత్ చెప్పిన పులి కథ

కేసీఆర్, దయాకర్ రావు ఇద్దరు కలిసి మేడారం అటవీ ప్రాంతానికి వెళ్లారట. అక్కడ సేద తీరుతుండగా పులి తిరుగుతుందని ఎవరో చెప్పారట. అప్పుడు దయాకర్ రావు కొత్త నైక్ షూను తొడుక్కుంటున్నాడట. ఈ దృశ్యాన్ని చూసిన కేసీఆర్, దయాకర్ ఆ షూలతో ఎంత పరిగెత్తినా పులి నుంచి తప్పించుకోలేవని అన్నాడట. పులి నుంచి తప్పించుకోలేను గానీ.. నీకంటే ముందు పరిగెత్తితే పులికి నువ్వు ఆహారం అయితావు.. నేను జీవిస్తానని ఎర్రబెల్లి అన్నాడట. అది ఎర్రబెల్లి దయాకర్ రావు నైజం అంటూ చెప్పి కేసీఆర్ జాగ్రత్త అని హెచ్చరించారు.

కార్నర్ మీటింగ్‌లో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన జిల్లా నాయకులంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించ‌డం కొస‌మెరుపు.