CM KCR | మోసకారుల మాటలు నమ్మితే మళ్లీ గోసనే: సీఎం కేసీఆర్‌

CM KCR | కాంగ్రెస్ ఎన్నికల హమీలన్ని ఆపద మొక్కులే మన ధరణి..రైతు పథకాలను పొరుగు రాష్ట్రాలు అడుగుతున్నాయ్‌ ఎన్నికలప్పుడు ఆగం కావదు…నిజమైన ప్రజాసేవకులకే పట్టం కట్టాలి వరంగల్‌ సభలో అన్ని విషయాలు ప్రకటిస్తా మెదక్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ విధాత, మెదక్ ప్రతినిధి, ఎన్నికల వేళ ఆగమై మోస‌కారుల మాట‌లు న‌మ్మితే మళ్లీ తెలంగాణకు ముందు మాదిరిగా గోసపడుతామని, అప్ర‌మ‌త్తంగా ఉండి ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించాల‌ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ ప్రజలకు […]

  • By: krs    latest    Aug 23, 2023 3:36 PM IST
CM KCR | మోసకారుల మాటలు నమ్మితే మళ్లీ గోసనే: సీఎం కేసీఆర్‌

CM KCR |

  • కాంగ్రెస్ ఎన్నికల హమీలన్ని ఆపద మొక్కులే
  • మన ధరణి..రైతు పథకాలను పొరుగు రాష్ట్రాలు అడుగుతున్నాయ్‌
  • ఎన్నికలప్పుడు ఆగం కావదు…నిజమైన ప్రజాసేవకులకే పట్టం కట్టాలి
  • వరంగల్‌ సభలో అన్ని విషయాలు ప్రకటిస్తా
  • మెదక్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌

విధాత, మెదక్ ప్రతినిధి, ఎన్నికల వేళ ఆగమై మోస‌కారుల మాట‌లు న‌మ్మితే మళ్లీ తెలంగాణకు ముందు మాదిరిగా గోసపడుతామని, అప్ర‌మ‌త్తంగా ఉండి ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించాల‌ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలన్ని ఆపద మొక్కులని, బీజేపీ, కాంగ్రెస్‌లు మనకు కొత్త కాదని, ఈ మధ్యన ఏమన్నా ఆకుపసరు తాగి వచ్చారా ఒక్క చాన్స్ అంటూ అడుగుతున్నారంటు ఎద్దేవా చేశారు. బుధవారం మెదక జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయం, బీఆరెస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ ఎన్నిక‌లు రాగానే వ‌డ్ల క‌ల్ల‌ల వ‌ద్ద‌కు అడుక్కుతినే వారు వ‌చ్చిన‌ట్లు చాలా మంది బ‌య‌ల్దేరుతారని, ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లు త‌మ ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించి నిజ‌మేంది.. వాస్త‌వ‌మేంది.. ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారో గుర్తించి నిజ‌మైన ప్ర‌జా సేవ‌కులను ఎన్నుకుంటే అభివృద్ధి బాగా జరుగుతుందని, బ్రహ్మండమైన ఫలితాలొస్తాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఒక్క చాన్స్ ఇవ్వండిని అడుగుతున్నారు. ఒక్క ఛాన్స్ కాదు.. 50 ఏండ్లు కాంగ్రెస్ పాలించిందని, అప్పుడేందుకు రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు తేలేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అధికార‌మిస్తే ధ‌ర‌ణి తీసేస్తామంటుందని, ఎందుకు తీసేస్తారు.. ఏం త‌ప్పు చేసిందని, గ‌తంలో మీ భూముల మీద పెత్త‌నం వీఆర్‌వో, గిర్దావ‌ర్, త‌హ‌సీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్ట‌ర్, క‌లెక్ట‌ర్, రెవెన్యూ సెక్ర‌ట‌రి, సీసీఎల్ఏ, రెవెన్యూ మినిస్ట‌ర్‌కు కూడా అవ‌కాశం ఉండేదన్నారు.

ఈ రోజు ధ‌ర‌ణి వ‌చ్చిన త‌ర్వాత గ‌వ‌ర్న‌మెంట్‌లో ఆఫీస‌ర్లు, మంత్రుల వ‌ద్ద ఉండే అధికారాన్ని తీసేసి మీకే అధికారం ఇవ్వ‌డం జ‌రిగిందన్నారు. మీ భూమిని మార్చాలంటే.. ఎవ‌డు కూడా మార్చ‌లేడు.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కూడా మార్చ‌లేడన్నారు. స్టేట్ ఛీప్ సెక్ర‌ట‌రీ కూడా మార్చ‌లేరని, మీ భూమి యాజ‌మాన్యం.. మీ బొట‌న‌వేలితోనే మారుత‌ది త‌ప్ప ఇంకెవ‌డు కూడా మార్చే ప‌రిస్థితి లేదన్నారు.

ఈ అధికారం రైతుల వ‌ద్ద‌నే ఉండాల్నా.. మ‌ళ్లీ అధికారుల‌కు అప్ప‌జెప్పాల్నా ఆలోచించాలన్నారు. ధ‌ర‌ణి పోతే.. పెద్ద పాము మింగిన‌ట్టే.. కైలాసం ఆట‌లో జ‌రిగిన‌ట్టే అవుతుందన్నారు. ధరణి ఉండాల్నా వద్దా అని మీరే చెప్పాలనగా సభికులంతా ఉండాలంటూ చేతులెత్తారు. ధ‌ర‌ణి తీసేస్తామ‌న్న వాళ్ల‌ను బంగాళా ఖాతంలో విసిరేయాలన్నారు.

ఇవాళ రిజిస్ట్రేష‌న్లు 15 నిమిషాల్లో అయిపోతున్నాయన్నారు. ధ‌ర‌ణి మూలంగా వ‌డ్లు అమ్మిన పైస‌లు నేరుగా రైతుల ఖాతాల్లో జ‌మ అవుతున్నాయని, ఇప్ప‌టి వ‌ర‌కు 37 వేల కోట్ల రుణ‌మాఫీ చేశామని, ధ‌ర‌ణి రికార్డుల ద్వారా ఈ రుణ‌మాఫీ డ‌బ్బులు మీ బ్యాంకుల ద్వారా జమ అవుతున్నాయన్నారు.

మన పథకాలను పొరుగు రాష్ట్రాలు అడుగుతున్నాయ్‌

తెలంగాణ‌లో వీఆర్‌వో వ్య‌వ‌స్థ‌ను తీసేసిన‌ట్టు.. మా ద‌గ్గ‌ర కూడా ఆ వ్య‌వ‌స్థ‌ను తీసేయాల‌ని మ‌హారాష్ట్ర రైతులు అడుగుతున్నారని, తెలంగాణ రైతులు ఎట్ల‌యితే బీఆర్ఎస్ పార్టీని గెలిపించారో, మ‌హారాష్ట్ర‌లో కూడా బీఆర్ఎస్‌ను గెలిపిస్తాం అని అక్క‌డి రైతులు అంటున్నారన్నారు. తెలంగాణ రైతుల‌కు అందే స‌దుపాయాలు మాకు అందాలని చెప్పి మ‌హారాష్ట్ర రైతాంగం అడుగుతున్న‌దని, నేను పోతే బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారన్నారు.

కానీ ఇక్క‌డేమో కాంగ్రెస్ పార్టీ మూడు గంట‌ల క‌రెంట్ చాల‌ని అంటుందని, బీజేపీనేమో మీట‌ర్లు పెట్టాల‌ని అంటోందన్నారు. మూడు గంట‌ల క‌రెంట్ స‌రిపోత‌దా..? 24 గంట‌ల క‌రెంట్ ఉండ‌టంతో.. ఎవ‌రికి ఇష్ట‌మున్న స‌మ‌యంలో వాళ్లు నీళ్లు పెట్టుకుంటున్నారని, మునుపు ఈ టైం నుంచి గీ టైం వ‌ర‌కు క‌రెంట్ వ‌స్త‌దంటే.. ఒక్క‌టే సారి లోడ్ ఎక్కువై ట్రాన్స్‌ఫార్మ‌ర్లు కాలిపోయేవని, ఇవాళ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మ‌ర్లు కాలిపోవ‌డం లేదన్నారు.

క‌రెంట్ మోటార్ల‌కు మీట‌ర్లు పెట్ట‌క‌పోవ‌డంతో దాదాపు ఇవాళ మ‌నకు 25 వేల కోట్ల న‌ష్టం కేంద్రం కల్గించిందని, కానీ ఆ బాధ‌ను అనుభ‌వించుకుంటూ ప్రాణం పోయినా మీట‌ర్లు పెట్ట‌మ‌ని చెప్పామన్నారు. మ‌రో పార్టీ.. నిన్న మొన్న క‌ర్ణాట‌క‌లో గెలిచిందని, ఇష్ట‌మొచ్చిన వాగ్దానాలు చేసి, గెలిచిన తెల్లారే అక్క‌డ 7 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నారన్నారు. మ‌ళ్లీ ఇక్కడ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారని, ఎందుకు నాయ‌నా 24 గంట‌లు క‌రెంట్ ఇచ్చుకుంటున్నామన్నారు.

ఆప‌ద్భాందు ప‌థ‌కం కింద కాంగ్రెస్ హాయంలో రైతులకు రూ. 50 వేలు ఇచ్చేవారని,నెల‌ల పాటు తిరిగితే 20 వేలు, 30 వేలు చేతిలో పెట్టి పంపించేవారన్నారు. ఒక్క గుంట భూమి ఉన్న రైతు చ‌నిపోతే రూ. 5 ల‌క్ష‌లు రైతుబీమా వ‌చ్చి రైతు బ్యాంకు ఖాతాలో ప‌డుతున్నాయన్నారు. ఈ సౌక‌ర్యం అమెరికాలో , ఇంగ్లండ్‌లో కూడా లేదని, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదని, కేవ‌లం తెలంగాణలోనే ఉందన్నారు.

గ‌త కాంగ్రెస్ నాయ‌కులు సింగూరు ప్రాజెక్టుకు హైద‌రాబాద్‌కు ద‌త్త‌త ఇచ్చి ఇక్క‌డ మ‌న పొలాలు ఎండ‌బెట్టారన్నారు. కానీ ఈ రోజు సింగూర్‌ను మెద‌క్‌కే డెడికేట్ చేసుకోవ‌డం కార‌ణంగా బ్ర‌హ్మాండంగా జోగిపేట ప్రాంతంలో నీళ్లు పారుతున్నాయని, ఘ‌న‌పురం ఆయ‌క‌ట్టు కింద ఒక గుంట ఎండిపోకుండా పంట‌లు పండించుకుంటున్నామన్నారు.

మోసపూరిత హామీలివ్వం..పింఛన్‌ పెంచుతాం

ఇవాళ కాంగ్రెసోళ్లు ఆప‌ద మొక్కులు మొక్కుతున్నారని, ఆనాడు 200 పెన్ష‌న్ ఇచ్చినోడు.. ఇవాళ కొండ మీద కోతిని తెచ్చిస్తా.. ఏడు చంద‌మామ‌లు తెచ్చిస్తా.. ఆరు సూర్యులు తెచ్చిస్తా.. 4 వేల పెన్ష‌న్ ఇస్తా అంట‌డు. 200 ఇచ్చినోడు.. 4 వేలు ఇస్త‌మంటే న‌మ్మొచ్చునా..? న‌మ్మే ముచ్చ‌టేనా..? ఇదేమ‌న్న ఆరాజ్ పాట‌నా? మోసం చేయాలంటే మాకు ప్ర‌క‌టించ‌రాదా..? అట్ల మేం మోసం చేయమన్నారు. కానీ మ‌నం కూడా పెన్ష‌న్ పెంచుకుందాం. ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో పెన్ష‌న్లు పెంచుకుంటూ పోదామన్నారు. అక్టోబ‌ర్ 16న వరంగల్‌ మ‌హాస‌భ ఉందని, అక్క‌డ అన్ని కూడా మ‌నం ప్ర‌క‌టించుకుందామన్నారు.

సర్కార్‌ను న‌డిపించ‌డ‌మంటే.. సంసారం చేసిన‌ట్టే ఉంట‌దని, క‌ల్యాణ‌ల‌క్ష్మి మొద‌ట్లో 51 వేలు ఇచ్చుకున్నామని, ఆ త‌ర్వాత ల‌క్షా 16 వేలు పెంచుకున్నామన్నారు. పెన్ష‌న్లు కూడా వెయ్యి నుంచి 2 వేలు పెంచుకున్నామని, ఇదే మాదిరిగా పెన్ష‌న్లు కూడా పెంచుకుందామన్నారు. ఇవాళ తెలంగాణలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు లేవని, రైతుల ముఖాలు ఇప్పుడిప్పుడే తెల్ల‌ప‌డుతున్నాయని, గ్రామాలు ప‌చ్చ‌బ‌డుతున్నాయని, మంచి మంచి ఇండ్లు క‌డుతున్నారన్నారు.

గ్రామంలో కార్లు పెరిగాయని, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నామని, ఆరేండ్ల‌లో రైతులు బ్ర‌హ్మాండంగా త‌యార‌వుతారన్నారు. అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధిస్తున్నామని, వ‌రి ధాన్యం పండించ‌డంలో నంబ‌ర్ వ‌న్ స్థాయికి ఎదిగామని, అధునాత‌న రైస్‌మిల్స్ ఏర్పాటు చేస్తున్నామని, బ్ర‌హ్మాండ‌మైన పంట‌లు పండిస్తున్నారన్నారు.

మా పాలనలోనే మెదక్‌ అభివృద్ధి

కాళేశ్వరంతో నీళ్లు ఇచ్చుకుంటున్నామని, మెద‌క్‌లో పారే హ‌ల్దీ వాగు, మంజీరా చెక్ డ్యాంపై దాదాపు 30, 40 చెక్‌డ్యాంలు క‌ట్టుకుని ఆ న‌దులు స‌జీవంగా ఉండేలా 365 రోజులు ఉండేలా చేసుకుంటున్నామని, కాళేశ్వ‌రంలో భాగంగా మ‌ల్ల‌న్న సాగ‌ర్ ద్వారా అక్క‌డ్నుంచి అవ‌స‌ర‌మున్న‌ప్పుడ‌ల్లా వాగుల్లో నీళ్లు విడుద‌ల చేస్తున్నామని, చెక్ డ్యాంలు మ‌త్త‌ళ్లు దుంకుతున్నాయన్నారు. ద‌య‌చేసి మీ అంద‌ర్నీ కోరేది.. దేశానికే త‌ల‌మానికంగా ఉన్న ఈ రాష్ట్రం.. మ‌నం ఎక్క‌డ పోయినా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారని, ఈ స్థితిని కాపాడుకోవాలని, ఇంకా ధ‌నిక రాష్ట్రంగా ఎద‌గాలని, పేద‌లంద‌రిని ఆదుకోవాలని అందుకు ప్రజలు బీఆరెస్‌ను, ఇక్కడ ప‌ద్మ‌ను రెట్టింపు మెజార్టీతో గెలిపించాలన్నారు.

50 ఏండ్ల ప‌రిపాలించిన కాంగ్రెస్ పార్టీ మంచినీళ్ల క‌ష్టాల గురించి ఆలోచించ‌లేదని, ఇదే మెద‌క్ ప‌ట్ట‌ణంలో మూడు, నాలుగు రోజుల కు ఒక‌సారి నీళ్లు ఇచ్చేవని, కానీ మిష‌న్ భ‌గీర‌థతో ప్ర‌తి గ్రామానికి ప్ర‌తి ప‌ట్ట‌ణానికి ప్ర‌తి రోజు నీళ్లు అందిస్తున్నామన్నారు. ఇండియా మొత్తంలో ఒక కోటి 3 ల‌క్ష‌ల కుటుంబాలకు న‌ల్లా క‌నెక్ష‌న్ ద్వారా నీళ్లు ఇచ్చే ఒక్క‌టే రాష్ట్రం తెలంగాణ‌, రైతాంగానికి, ప‌రిశ్ర‌మ‌ల‌కు 24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్న‌ది మ‌న‌మే.

ఈ స‌దుపాయాలు వ‌దులుకోవాల్నా.. మెదక్‌లో బీఆరెస్‌ గెలుపుతో ఆద‌ర్శ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. నేను సిద్దిపేట‌లో ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ఒక జూనియ‌ర్ కాలేజీ కోసం ఆఫీసుల చుట్టూ 15 ఏండ్లు తిరిగానని, ఇవాళ 1000 పసైచిలుకు జూనియ‌ర్ కాలేజీలు వ‌చ్చాయని, అందులో పాస‌వుతున్న పిల్ల‌లు.. ఇంగ్లీష్ మాట్లాడుతుంటే.. అద్భుతం. ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో తీసుకువ‌స్తున్న సీట్లు రాష్ట్రానికే త‌ల‌మానికంగా ఉన్నాయన్నారు.

నా బిడ్డ పద్మ అడిగిందంటూ.. కేసీఆర్‌ నిధుల జల్లు

పోయిన ఎన్నిక‌ల‌ప్పుడు నేను ఒక మాట చెప్పానని, మీ అంద‌రికి ప‌ద్మ నా బిడ్డ‌.. ఆమె అడిగిందంటే ఏది కాద‌నే ప‌రిస్థితి ఉండదని, గౌర‌వించి, దీవించి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించారని, దాని ఫ‌లిత‌మే.. క‌లెక్ట‌రేట్, ఎస్‌పీ ఆఫీసు వచ్చాయన్నారు.మంచి నాయ‌కురాలని, మంచి ప‌నులు జ‌రుగుతున్నాయన్నారు. నాతో ఉద్య‌మంలో మొద‌టి రోజు నుంచి ఉండి, ఆనాడు తెలంగాణ వ‌స్త‌దో రాదో తెల్వ‌దని, ఉద్య‌మ‌కార్య‌క‌ర్త నుంచి జడ్పీటీసీ, ఈ రోజు అనేక‌మైన ప‌నులు చేస్తూ మీ మ‌ధ్య ఉన్న‌టువంటి బిడ్డ అన్నారు.

మెద‌క్ ప‌ట్ట‌ణంలో రోడ్లు చింద‌ర‌వంద‌ర‌గా ఉన్నాయి.. అవి బాగు కావాల‌ని అడిగారని, గ్రామ పంచాయ‌తీల‌కు డ‌బ్బులు కావాల‌ని అడిగారని, రామాయంపేట రెవెన్యూ డివిజ‌న్ కావాల‌ని అడిగారని, ఎల్లుండి సాయంత్రం లోగా జీవో పంపిస్తానన్నారు. ఆ విధంగానే రామాయంపేట‌లో కూడా డిగ్రీ కాలేజీ అత్య‌వ‌స‌రం మంజూరు చేస్తామన్నారు. మెద‌క్ రింగ్‌రోడ్డు కావాల‌ని అడిగారని, మంజూరు చేస్తున్నామన్నారు.

అదే విధంగా ఏడు పాయ‌ల టెంపుల్ గ‌తంలో ప్ర‌క‌టించిన టూరిజం ప్యాకేజీలో భాగంగా 100 కోట్లను అభివృద్ధి కోసం మంజూరు చేస్తున్నామన్నారు. ప‌నులు కూడా మొద‌లు పెడుతామన్నారు. కౌడిప‌ల్లిలో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామని, మెద‌క్ జిల్లా 469 జీపీలు ఉన్నాయని, 15 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తున్నామన్నారు. అదే విధంగా 4 మున్సిపాలిటీలు మెద‌క్, న‌ర్సాపూర్, రామాయంపేట‌, తూఫ్రాన్ 25 కోట్లు, మెద‌క్ మున్సిపాలిటీకి 50 కోట్ల మంజూరు చేస్తున్నామన్నారు.

అట్టహాసంగా కార్యాలయాల ప్రారంభం

మెదక్ జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ సముదాయం, ఎస్పీ కార్యాలయం, బీఆరెస్‌ పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ మంత్రులు టి. హరీశ్‌ రావు, మహమూద్ ఆలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపి అంజనీకుమార్లతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలెక్టర్ ఛాంబర్ లో తన కుర్చీలో కూర్చో బెట్టారు.

ఎస్పీ రోహిణి ప్రియదర్శినినీ తన ఛాంబర్ లో కుర్చీలో కూర్చోబెట్టి వారిని అభినందించారు. సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబి. పాటిల్ ,జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌ పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..