Telangana | అక్రమాధికారుల జాబితాలో రజత్‌కుమార్‌?

గత కొంతకాలంగా తెలంగాణలో పనిచేసిన ప‌లువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు, అధికారులు భారీగా అక్రమాస్తులు, భూములు కొనుగోలు చేసిన వైనం ఒక్కొక్కటిగా బయపడుతుండుతున్నాయి.

  • By: Somu    latest    Feb 09, 2024 11:50 AM IST
Telangana | అక్రమాధికారుల జాబితాలో రజత్‌కుమార్‌?
  • ఇప్పటికే సోమేశ్‌, మహేందర్‌రెడ్డి
  • భారీగా భూముల కొనుగోళ్లు
  • గుట్టు విప్పుతున్న శివబాలకృష్ణ
  • భూమి అమ్మకానికి రజత్‌ ఏర్పాట్లు
  • అందుకోసం ధరణిలో స్లాట్‌ బుకింగ్‌
  • విచా­రణ భయంతో ఆస్తుల మార్పి­డి!
  • తెలం­గాణ సమాజం మేల్కొనాలి
  • ప్రభుత్వం త్వరగా విచా­రణ చేప­ట్టాలి
  • కాంగ్రెస్‌ నేత మన్నె నర­సిం­హా­రెడ్డి



Telangana | విధాత, హైదరాబాద్‌ : గత కొంతకాలంగా తెలంగాణలో పనిచేసిన ప‌లువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు, అధికారులు భారీగా అక్రమాస్తులు, భూములు కొనుగోలు చేసిన వైనం ఒక్కొక్కటిగా బయపడుతుండుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు తమ ఆస్తులను బినామీ పేర్లపై మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌, అరవింద్‌కుమార్‌, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి వంటి మ‌రికొంత మంది అధికారులు భారీగా అక్రమాస్తులు, భూములు సంపాదించినట్లుగా ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి.

ఈ క్రమంలో జాబితాలో తదుపరి పేరు రిటైర్డ్‌ ఐఏఎస్‌ రజత్‌కుమార్‌ పేరు కూడా ఉన్నదని తెలుస్తున్నది. రజత్‌ కుమార్‌ గత బీఆరెస్‌ సర్కార్‌ హయాలో ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా పనిచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా, బాలానగర్ మండలం, హేమాజీపూర్ అనే గ్రామంలో సర్వే నంబర్ 83, 84, 85లలో తన పేరు మీద, తన భార్య పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీద మొత్తం 52 ఎకరాలు కొనుగోలు చేసినట్టు ధరణిలో కనిపిస్తున్నది. యాదాద్రి జిల్లాలో మరో 15 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ భూమలు అత్యంత విలువైనవి. ఈ భూములు కొన్న విషయం ఆయన డీవోపీటీకి తెలిపారో లేదో స‌మాచారం లేదు.


ఆ భూముల కొనుగోలుకు వారికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశంలో అనేక సందేహాలు వెలువడుతున్నాయి. మరోవైపు.. రజత్‌కుమార్‌ తన పేరు మీద భూములు ఉంటే ప్రమాదం అనుకున్నారో ఏమోగానీ ఆ భూములలో 15ఎకరాలను ఇతరుల పేరు మీదికి మార్చి అమ్ముకోవడానికి ప్రస్తుతం స్లాట్ బుక్ చేసినట్టుగా ధరణి ద్వారా తెలుస్తున్నది. అంతా అనుకున్నట్టు జరిగితే.. రేపోమాపో ఈ భూములు ఇతరుల పేరు మీదకి మారిపోనున్నాయి. ఇదే రీతిలో మిగతా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, బడా అధికారులు తమ అక్రమాస్తులను ఇతరుల పేర్ల మీదకు మార్చితే వారి అక్రమాలను గుర్తించడం కష్టమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


రాష్ట్రంలో బీఆరెస్‌ స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటం, గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తుండటంతో ఎక్కడ తమ అక్రమాస్తులు భయటపడుతాయోనన్న భయంతో ఐఏఎస్‌లు తమ అక్రమాస్తులను ఇతరుల పేరుల మీదకు మళ్లిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై తక్షణమే విచారణ జరిపించి అక్రమాస్తులు చేజారిపోకుండా చూడాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నది.


శివబాలకృష్ణ విచారణలో సోమేశ్‌కుమార్‌, రజత్‌కుమార్ ఆస్తుల పేపర్లు


అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణ విచారణ సందర్భంగా అతడి అక్రమాస్తుల పరిశీలనలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఐఏఎస్‌లు సోమేశ్‌కుమార్‌, రజత్‌కుమార్ ఆస్తులు, భూముల పేపర్ల వివరాలు ఆయన నుంచి కూపీ లాగితేనే బయటకు వచ్చినట్టు తెలుస్తున్నది. అరవింద్‌కుమార్ తమకు కావాల్సిన బిల్డింగ్‌లకు శివబాలకృష్ణ ద్వారా అనుమతులు జారీ చేయించినట్లుగా ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణ ద్వారా తమకు కావలసిన బిల్డింగ్‌లకు అరవింద్ కుమార్‌ అనుమతులు జారీ చేయించుకున్నారని చెబుతున్నారు.


ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలకు విరుద్ధంగా మల్టీ స్టోరీడ్‌ భవనాలకు ఐఏఎస్ అరవింద్‌ కుమార్ అనుమతులు మంజూరీ చేయించారని సమాచారం. ప్రతి ఫైల్‌కు బాలకృష్ణ ద్వారా అరవింద్‌కుమార్ ముడుపులు తీసుకున్నారని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ బదిలీ కాకుండా ఆయనే కాపాడేవారని ఏసీబీ బాలకృష్ణ కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ రిపోర్టులో పేర్కొంది. అరవింద్‌కుమార్ ఆదేశాలతో నార్సింగిలోని ఎస్‌ఎస్‌వి ప్రాజెక్టు కోసం 12 ఎకరాల భూమిని బాలకృష్ణ క్లియర్ చేశారని సమాచారం.


ఈ వ్యవహారంలో అరవింద్‌కుమార్ 10 కోట్లు డిమాండ్ చేసినట్లుగా బాలకృష్ణ తెలిపారని సమాచారం. 10 కోట్లలో షేక్ సైదా అనే వ్యక్తి కోటి ఇచ్చినట్లుగా వెల్లడించాడని చెబుతున్నారు. డిసెంబర్‌లో బాలకృష్ణ ద్వారా అరవింద్‌ కుమార్‌కు కోటి రూపాయలు అందాయి. మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం మరో కోటి డిమాండ్ చేశారని, మంకల్ వద్ద వెట్రిక్స్ హోమ్స్‌కు అనుకూలంగా అనుమతి ఇచ్చినందు ఒక ఫ్లాట్‌ను అరవింద్ కుమార్‌కు బహుమతిగా ఇచ్చారని శివబాలకృష్ణ పేర్కొన్నట్టు తెలిసింది.


పలు రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి కమీషన్లు తీసుకున్నారని, కొన్ని సందర్భాల్లో తన మీడియేటర్ల ద్వారా డబ్బులు తీసుకున్నాడని, కొంత మంది ఐఏఎస్‌లకు అరవింద్‌కుమార్ భూములు కూడా ఇప్పించాడని కూడా శివబాలకృష్ణ ఏసీబీకి వెల్లడించినట్టు తెలుస్తోంది. 250 కోట్ల శివబాలకృష్ణ అక్రమాస్తుల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వాటిలో 114 ఎకరాలు జనగామ పరిధిలోనే ఉండటం గమనార్హం. అరవింద్‌కుమార్ సూచనలతోనే వరంగల్ వైపు ఎక్కువగా ఆయన, తాను భూములు కొన్నట్లుగా బాలకృష్ణ ఏసీబీకి వివరించాడని తెలుస్తున్నది.


సోమేశ్‌కుమార్ వద్ద భారీగా అక్రమాస్తులు


ఇప్పటికే మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్ కొత్తపల్లి గ్రామంలో 25ఎకరాల 19గుంటలు తన భార్య పేరిట కొనుగోలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. వాటిని కూడా డీవోపీటీకి తెలుపకుండానే అక్రమంగా కొనుగోలు చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ భూములకు 14లక్షల రైతుబంధు కూడా తీసుకున్న విషయం కూడా బయటపడింది. అయితే సోమేశ్‌కుమార్ 5వేల ఎకరాల వరకు భూములు కొల్లగొట్టాడని తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సోమేశ్‌కుమార్ అక్రమాస్తులపై కూడా విచారణ చేపడితే కచ్చితంగా శివబాలకృష్ణ కంటే ఎక్కువే ఆస్తులు లభ్యమవుతాయని బలంగా నమ్ముతున్నారు.


ఆ ఐఏఎస్‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు


హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణ విచారణలో భాగంగా ఏసీబీ 250 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించడం.. భారీగా మనీలాండరింగ్ జరుగడంతో ఈ కేసులో పీఎంఎల్‌ఏ కింద విచరణ చేపట్టేందుకు ఈడీతో పాటు అక్రమాస్తుల వ్యవహారంపై ఐటీ కూడా విచారణకు రంగం సిద్ధమవుతున్నది. శివబాలకృష్ణ కేసులో సోదరుడు శివనవీన్‌కుమార్ కీలకంగా ఉన్నారని తెలుస్తున్నది. అతడు అక్రమార్జన నిధులు దారి మళ్లించేందుకు రెండు డొల్ల కంపనీలు కూడా ఏర్పాటు చేసుకోవడంతో ఈడీ, ఐటీ శాఖల విచారణ అనివార్యమవుతున్నది.


కాగా శివబాలకృష్ణ ద్వారా భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్న అరవింద్‌కుమార్‌, రజత్‌కుమార్‌ వ్యవహారంపై కూడా ప్రభుత్వం ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికే ఆ ఇద్దరు ఐఏఎస్‌లతోపాటు రియల్ ఎస్టేట్ సంస్థలతో, ఇతర అధికారులతో శివబాలకృష్ణ నెరపిన లావాదేవీలపైన దృష్టి పెట్టిన ఏసీబీ.. బాలకృష్ణ ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్‌డాటా ద్వారా వారితో అతను జరిపిన సంభాషణల నిగ్గు తేల్చడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.


త్వరగా విచారణ చేపట్టాలి : మన్నెం నరసింహారెడ్డి


తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో బీహార్ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కూడబెట్టిన అక్రమాస్తులు, కొనుగోలు చేసిన భూములు పేరు మార్పిడి జరగకముందే రాష్ట్ర ప్రభుత్వం వేగంగా వారిపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత మన్నె నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము సోమేశ్‌కుమార్ ఆస్తుల వివరాలు కొన్నింటిని బహిర్గతం చేశామని, హెచ్‌ఎండీ మాజీ డైరక్టర్‌ శివబాలకృష్ణ విచారణతో ఐఏఎస్‌లు అరవిందకుమార్‌, రజత్‌కుమార్ అక్రమాస్తులు, భూముల బాగోతం వెల్లడైందని పేర్కొన్నారు. ఆ వ్యవహారంపై ప్రభుత్వం వేగంగా విచారణ జరపకపోతే రజత్‌కుమార్ తరహాలో ఐఏఎస్‌లు, అధికారులు తమ అక్రమాస్తులను దారి మళ్లించి విచారణలో తప్పించుకునే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డికి అక్రమాస్తుల సెగ


ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి నూతనంగా చైర్మన్‌గా నియమించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి కూడా అవినీతి, అక్రమాస్తుల సెగ తగిలింది. మహేందర్​రెడ్డిపై హైకోర్టు అడ్వకేట్ ​రాపోలు భాస్కర్​ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనో అవినీతి తిమింగలమని, పోలీసు శాఖలో డీజీపీ పోస్ట్​ సహా వివిధ హోదాల్లో పనిచేసిన సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని లెక్కలేనని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మహేందర్​రెడ్డి చేసిన అక్రమాల్లో 40 వాటికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని తెలిపారు. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని, సమగ్ర విచారణ జరిపించాలంటూ గవర్నర్​ తమిళిసై సౌందర్​రాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌లకు రాపోలు భాస్కర్ ఫిర్యాదులు చేశారు.


గ్యాంగ్‌స్టర్ ​నయీంతో పాటు పలువురు అసాంఘిక శక్తులతో సంబంధాలు ఉన్న మహేందర్​రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్, నల్గొండ, మెదక్​ తదితర జిల్లాల్లో కొంత మంది పోలీసు అధికారులను ఉపయోగించుకుని పెద్ద సంఖ్యలో భూములను తన పేర, తన బినామీల పేర మార్చుకుని రియల్టర్లకు డెవెలప్‌మెంట్‌కు ఇవ్వడం ద్వారా రూ.వందల కోట్లు సంపాదించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.