ఓడిపోయిన మిజోరం ముఖ్యమంత్రి.. జడ్‌పీఎందే అధికారం..!
మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరమతంగ ఓటమి చవిచూశారు

ఐజ్వాల్ : మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరమతంగ ఓటమి చవిచూశారు. మీజో నేషనల్ ఫ్రంట్(MNF)కు చెందిన జోరమతంగ 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఐజ్వాల్ ఈస్ట్-1 నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జోరం పీపుల్స్ మూమెంట్(ZPM) అభ్యర్థి లాల్‌తన్ సంగ.. జోరమతంగపై విజయం సాధించారు.
లాల్‌తన్ మంగకు 10727 ఓట్లు పోలవ్వగా, జోరమతంగకు 8626 ఓట్లు పోలయ్యాయి. 40 స్థానాలు ఉన్న మిజోరంలో 27 స్థానాల్లో జోరం పార్టీ ఆధిక్యంలో ఉన్నది. ఇప్పటికే 22 స్థానాల్లో జెడ్‌పీఎం గెలుపొందింది. మీజో నేషనల్ ఫ్రంట్ పార్టీ 10 స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా జెడ్‌పీఎం నాయకుడు లాల్‌తన్ మంగ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ గెలుపు కోసం శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజార్టీ వస్తుందన్నారు. మరికాసేపట్లో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయని లాల్‌తన్ మంగ పేర్కొన్నారు.