మళ్లీ మాస్కులు, శానిటైజర్లూ వాడాల్సిందేనా? ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల్లో పెరుగుదల
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ (Covid) వేరియంట్ ఉనికి విస్తృతమవుతోంది. వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉన్న కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది

విధాత: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ (Covid) వేరియంట్ ఉనికి విస్తృతమవుతోంది. వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉన్న కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీనిని బట్టి మరికొన్ని రోజులు అందరూ మాస్కులు, శానిటైజర్లు పెట్టుకునే ఉండాలని ఆయా దేశాల్లో మార్గదర్శకాలు వెలువడుతున్నాయి. పరిస్థితి ఏమైనా సీరియస్ అయితే గతంలోలాగే వాటిని నిర్బంధంగా అమలు చేసే అవకాశాలూ ఉన్నాయి.
ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ అయిన పిరోలా వేరియంట్ నుంచి కొవిడ్ జేఎన్ 1 (JN 1 Varient) వైరస్ అభివృద్ది చెందిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని మొదట లగ్జెంబర్గ్‌లో గుర్తించారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. అయిదు దేశాల్లో కొవిడ్ కేసులు నమోదు కాగా.. కొన్ని మరణాలూ సంభవించడం గమనార్హం.
ఈ అయిదే దేశాలనూ పరిశీలిస్తే.. సింగపూర్‌లో ఈ నెల 4 నుంచి 10 తేదీల మధ్య 56 వేల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 60 ఏళ్లు పైబడిన వారు ఈ వేరియంట్ వల్ల ఆసుపత్రి పాలవుతున్నారని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. ఇండోనేసియాలో కొవిడ్ కేసుల పెరుగుదల 13 శాతానికి చేరుకుంది. రాజధాని జకార్తాలో రోజుకు సగటున 200 కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 90 శాతం కేసుల్లో లక్షణాలు బయటపడటం లేదని.. చాలా తక్కువ అనారోగ్యమే కలుగుతోందని వైద్యులు పేర్కొన్నారు.
మలేసియాలో కేసుల నమోదు విపరీతంగా ఉంది. నవంబరులో 6,796 మంది కొవిడ్ బారిన పడగా.. డిసెంబరు 10న 13 వేల మందికి కొవిడ్ సోకింది. అయితే లాక్‌డౌన్ ఆలోచనను అక్కడి అధికారులు కొట్టిపడేశారు. టెస్ట్, రిపోర్ట్, ఐసోలేట్, ఇన్‌ఫాం, సీక్ అనే విధానల్లోనే దీనిని ఎదుర్కొంటామని వారు పేర్కొన్నారు. చైనాలో కేసుల సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ.. జేఎన్1 వైరస్ వ్యాప్తి సాధారణ స్థాయిలో ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఫిలిప్పీన్స్‌లో ఈ నెల మొదట్లో 1340 కొవిడ్ కేసులు నమోదు కాగా.. అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.
భారత్‌లో కేరళ రాష్ట్రంలో మొదటి జేఎన్1 వైరస్ ఉనికిని గుర్తించగా.. సింగపూర్ నుంచి తమిళనాడు తిరుచినాపల్లి వచ్చిన వ్యక్తిలోనూ దీనిని గుర్తించినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 15 నమూనాల్లో జేఎన్1 ఉనికి ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలోనూ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ల్యాబ్‌లకు వచ్చే నమూనాల సంఖ్య 20 శాతానికి పైగా పెరిగినట్లు అక్కడి లెక్కలు చెబుతున్నాయి.