ఈసారి భారత్‌లో ప్రపంచ సుందరి పోటీలు.. కిరీటం దక్కేనా..?
ప్రపంచ సుందరి పోటీలకు వేదిక ఖరారైంది. 28 ఏండ్ల తర్వాత భారత్ ప్రపంచ సుందరి పోటీలకు ఆథిత్యం ఇవ్వనుంది

ప్రపంచ సుందరి పోటీలకు వేదిక ఖరారైంది. 28 ఏండ్ల తర్వాత భారత్ ప్రపంచ సుందరి పోటీలకు ఆథిత్యం ఇవ్వనుంది. త్వరలో జరగబోయే 71వ ప్రపంచ సుందరి పోటీలు ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా టెలికాస్ట్ చేయనున్నారు. ఫైనల్స్ మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా రాత్రి 7:30 నుంచి 10:30 వరకు కొనసాగనున్నాయి.
ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్, సీఈవో జులియా మోర్లే ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. మిస్ వరల్డ్ ఆతిథ్య దేశంగా భారత్‌ను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అందం, వైవిధ్యం, సాధికారత కలగలిపిన ఈ అద్భుత వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధం కావాలని మోర్లే పిలుపునిచ్చారు.
భారత్‌లో చివరిసారిగా 1996లో బెంగళూరు వేదికగా ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించారు. 1996లో భారత్‌కు చెందిన రీటా ఫారియా పోవెల్ తొలిసారిగా ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హెడేన్, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మనూషి చిల్లర్ మిస్ వరల్డ్‌గా నిలిచారు.
2022లో చివరిసారిగా నిర్వహించిన పోటీల్లో పోలెండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు. ఈ ఏడాది గెలుపొందిన వారికి ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని బహుకరించనున్నారు. ఈ ఈవెంట్‌లో 130కి పైగా దేశాల నుంచి పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు.