Inequality | ఒక్క శాతం కుబేరుల దగ్గర 40 శాతం సంపద.. దేశంలో అంతకంతకే పెరుగుతున్న ఆర్థిక అసమానత..!

Inequality : దేశంలో ఆర్థిక అసమానతలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. దాంతో ధనవంతుడు మరింత ధనవంతుడిగా.. పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతున్నాడు. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో దేశంలో ఆర్థిక అసమానత మరింత వేగంగా పెరుగుతోంది. దేశ సంపదలో 40.1 శాతం, ఆదాయంలో 22.6 శాతం.. దేశ జనాభాలో ఒక్క శాతం మాత్రమే అగ్రశ్రేణి కుబేరుల దగ్గరే ఉందని ‘వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్’ నివేదిక వెల్లడించింది.
2022-23 గణాంకాల ప్రకారం.. అతి తక్కువ మంది కుబేరుల దగ్గర ఇంత భారీ సంపద పోగుపడటం అనేది దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా దేశాల కంటే కూడా భారత్‌లోనే ఎక్కువగా ఉన్నదని ‘వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్’ నివేదిక పేర్కొన్నది. భారతదేశ గత చరిత్రను చూసినా.. ఇంత భారీగా సంపద అతి కొద్ది మంది దగ్గర ఉండటం ఇప్పుడేనని తెలిపింది. 2000 సంవత్సరం నుంచే భారత్‌లో ఆదాయ అసమానతలు పెరుగుతున్నా.. 2014-15 నుంచి 2022-23 మధ్య ఇది మరింత అధికమైందని నివేదిక తెలియజేసింది.
హార్వర్డ్, న్యూయార్క్, పారిస్ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తలు నితిన్ కుమార్ భారతి, లుకాస్ ఛాన్సెల్ థామస్ పికెట్టీ, అన్‌మోల్ సోమాంచి ‘ఇన్‌కమ్ అండ్ వెల్త్ ఇన్‌ఈక్వాలిటీ ఇన్ ఇండియా 1922-2023: ది రైజ్ ఆఫ్ ద బిలియనీర్ రాజ్’ పేరుతో రాసిన పత్రంలో ఈ వివరాలను వెల్లడించారు. బ్రిటిష్ రాజ్‌తో పోల్చినా ప్రస్తుతం దేశంలో ఆదాయం, సంపద అసమానతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. స్వాతంత్య్రం తర్వాత 1980 వరకు ఆదాయం, సంపదలో ప్రజల మధ్య అసమానతలు తగ్గుతూ వచ్చినట్లు తెలిపారు.
2000 సంవత్సరం నుంచి సంపద తక్కువ మంది దగ్గర కేంద్రీకృతమవడం అధికమైందని వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక పేర్కొన్నది. 1922లో టాప్ 1% ప్రజల ఆదాయం 13 శాతంగా ఉండగా, అంతర్యుద్ధ సమయంలో అది 20 శాతానికిపైగా పెరిగింది. 1982 నాటికి 6.1 శాతానికి దిగొచ్చింది. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత ఆదాయ కేంద్రీకరణ అధికమవుతూ.. 2022 నాటికి 22.6 శాతానికి చేరింది. ఈ అసమానత తగ్గాలంటే ప్రభుత్వాలు ఆదాయం, సంపదపై పన్ను స్మృతిని సరిదిద్ది, అదనంగా వచ్చి్న సొమ్మును సామాన్యులకు ఆరోగ్యం, విద్య, బలవర్థక ఆహారం కోసం వెచ్చించాలని నివేదిక సూచించింది. కేవలం సంపన్న వర్గాలే కాకుండా సగటు భారతీయుడు కూడా గ్లోబలైజేషన్ ప్రయోజనాలను పొందేలా చూడాల్సిన అవసరం ఉందని తెలిపింది.
2022-23లో 167 మంది అత్యంత కుబేరుల కుటుంబాల సంపదపై 2 శాతం సూపర్‌ట్యాక్స్ విధిస్తే.. దేశ ఆదాయంలో 0.5 శాతం మేర సంపద సమకూరేదని, సామాన్య ప్రజలకు ఉపయోగపడే పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థికంగా వెసులుబాటు లభించేదని నివేదిక వివరించింది.