War | పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు..
పశ్చిమాసియా (West Asia) లో తాజా పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతికాముకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి

- ఇరాన్, అమెరికా నేరుగా పోరాటానికి దిగే ప్రమాదం
War | విధాత: పశ్చిమాసియా (West Asia) లో తాజా పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతికాముకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక్కడ యుద్ధ మేఘాలు (War) కమ్ముకుంటున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య నేరుగా యుద్ధం తలెత్తే ప్రమాదం కచ్చితంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్ పౌరులపై ఊచకోతకు దిగడంతోనే పరిస్థితులు దిగజారినా.. తాజాగా జోర్డాన్‌లో ఉన్న అమెరికా (America) సైనిక బేస్‌లో డ్రోన్ దాడి జరిగి ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.
ఈ దాడి వెనుక ఉన్న శక్తి ఇరాన్ (Iran) అని అమెరికా నమ్ముతోంది. ఈ పరిణామం తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై సొంత పార్టీ నుంచే అసమ్మతి వ్యక్తమయింది. దీంతో ఆయన ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇరాన్ కూడా ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా ఇరాన్ అండదండలున్న ఇరాక్‌లోని సాయుధ దళం కతాయిబ్ హెజ్‌బుల్లా.. తమ సైనిక కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించింది.
‘మా భూభాగాలను ఆక్రమించుకున్న శక్తులపై యుద్ధానికి కొన్ని రోజులు విరామం ప్రకటిస్తున్నాం. గాజాలోని మా సోదరులను కాపాడుకోవడానికి ఇతర మార్గాల్లో చేయూతనందిస్తాం’ అని కతాయిబ్ హెజ్‌బుల్లా సెక్రటరీ జనరల్ అబు హుసేనీ అల్ హమిదావీ ప్రకటించారు. జోర్డాన్‌లోని తమ సైనిక స్థావరంపై దాడికి పాల్పడింది కతాయిబ్ హెజ్‌బుల్లా ముఠాయేనని అమెరికా సైనిక ప్రధాన కార్యాలయం పెంటగాన్ తన రిపోర్టులో పేర్కొంది. దీంతో అమెరికా ప్రతీకార దాడులకు దిగుతుందని ఆందోళన చెందుతున్న హెజ్‌బుల్లా.. సురక్షిత స్థావరాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఇరాక్‌లో ఉన్న అమెరికా దళాలను తరిమేసి.. ఇరాన్ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కితాయిబ్ హెజ్‌బుల్లా ప్రధాన లక్ష్యం. మరోవైపు జోర్డాన్ ఘటనను సాకుగా చూపి తమపై దాడికి దిగితే ప్రతీకార దాడులకు వెనుకాడబోమని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. మధ్య ఆసియాలోని అమెరికా ఆస్తులను సర్వనాశనం చేస్తామని ఇరాన్‌లోని ఒక అధికారి చెప్పినట్లు ద గార్డియన్ కథనం పేర్కొంది. జోర్డాన్ ఘటనకు తాము కారకులం కాదని.. వారు స్వతంత్ర తిరుగుబాటుదారులని ఇరాన్ ప్రకటించింది. ఏదేమైనప్పటికీ ప్రతీకారం తీర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే నిర్ణయించగా.. అది ఏమార్గంలో జరుగుతందనే దానిపై పశ్చిమాసియా భవితవ్యం ఆధారపడి ఉంది.