వారసత్వ రాజకీయాలపై మోదీ మాట్లాడటమా?

ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో జరిగిన విజయ సంకల్ప సభలో వారసత్వ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు

వారసత్వ రాజకీయాలపై మోదీ మాట్లాడటమా?

విధాత ప్రత్యేకం: ప్రధాని నరేంద్రమోదీ సంగారెడ్డి జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విజయ సంకల్ప సభలో వారసత్వ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సంగారెడ్డి సభలో ఆయన మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాలను తాను వ్యతిరేకిస్తున్నట్టు, కుటుంబ పార్టీల వల్ల ప్రతిభ ఉన్న వాళ్లకు అన్యాయం జరుగుతున్నదని వాపోయారు. ‘వారసత్వ నేతలకు భయం పట్టుకున్నది. ఆ పార్టీ నేతలు సొంత ఖాజానా నింపుతున్నారు. దోచుకున్న నల్లధనం దాచుకోవాడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారు. నేను కుటుంబ పాలకుల అవినీతి ధనాన్ని వెలికితీస్తున్నాను’ అన్నారు.

జేడీఎస్‌తో పొత్తెందుకు పెట్టుకున్నారు?

నిజంగానే మోదీ ఆ మాటకు కట్టుబడి ఉండి ఉంటే కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో సమాధానం చెప్పాలి. మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాషాయ పార్టీతో చేతులు కలిపిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ను ఎందుకు కలుపుకొన్నారు? యూపీలో తమకు ఎదురుగాలి తప్పదని తెలిసి చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించి ఆయన మనుమడు జయంత్‌ ఛౌదరీ నేతృత్వంలోని ఆర్‌ఎల్‌డీని ఎన్డీఏలో ఎందుకు చేర్చుకున్నారు? అంతెందుకు నిన్నగాక మొన్న ఆ పార్టీ ప్రకటించిన మొదటి విడుత లోక్‌సభ అభ్యర్థుల్లో ఎంతమంది వారసులు ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. కర్ణాటకలో యడ్యూరప్పను కాదంటే తమకు మనుగడ లేదని తెలిసి ఆయన కొడుకు బీఎస్‌ విజయేంద్రకు ఆ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది ఎవరు? తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ ఎవరినైనా కలుపుకొంటుందనే వాదనలు ఉన్నాయి. ఏ పార్టీనైనా చీలుస్తుందనేది పదేళ్లుగా దేశ ప్రజల అనుభవంలోనే ఉన్నది.

వారసత్వ రాజకీయాలపై మోదీ మాట్లాడటంపై ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ వ్యంగ్యంగా స్పందించారు. ఆయనకు కుటుంబం లేదు కాబట్టి కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కూల్చిన జ్యోతిరాదిత్య సింధియా ఎవరు? అంతెందుకు మొన్నటికి రాజ్యసభ ఎన్నికల్లో మొన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో సంఖ్యా బలం లేకున్నా బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టి ఆ రాష్ట్ర మాజీ సీఎం వీరభద్రసింగ్‌ కుమారుడు కుమారుడు కాంగ్రెస్‌ ప్రభుత్వ మంత్రి విక్రమాదిత్య ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర చేసింది ఎవరు? అందుకే మోదీ చెప్పే మాటలకు ఆయన చేతలకు పొంతన ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘తమతో ఉన్నంత కాలం వాళ్లకు వారసత్వ రాజకీయాలు గుర్తుకురావు. తమతో విభేదించి, తమను ప్రశ్నిస్తేనే కుటుంబ రాజకీయాల గురించి ప్రస్తావిస్తుంటారు. తమ రాజకీయాల కోసం వారసులును, వారసత్వ రాజకీయాలను వాడుకోవడం ఆపార్టీకి మొదటి నుంచి అలవాటే. మత, సానుభూతి రాజకీయాలు చేయడంలో కాషాయపార్టీ ముందు వరుసలో ఉంటుంది. దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి వాళ్ల వాట్సప్‌ యూనివర్సిటీ ఉంటుంది’ అని వారు గుర్తు చేస్తున్నారు.

అవినీతి గురించి కూడా ప్రధాని మాట్లాడటంపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. 2014లో యూపీఏ ప్రభుత్వంపై కుంభకోణాలు, అవనీతి ఆరోపణలు చేసి అధికారంలోకి రాగానే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చి దేశ ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షల వేస్తామన్న హామీ పదేళ్లు దాటింది. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాకే అవినీతి ఆరోపణలు, బ్యాంకులను ముంచిన నీరవ్‌ మోడీ, లలిత్‌ మోడీ లాంటి వాళ్లు విదేశాలకు పారిపోయింది వాస్తవం కాదా? అందుకే వారసత్వ రాజకీయాలపై, అవినీతి గురించి మోడీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.