మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన ఇస్రో..! నేడు ఎల్-1 పాయింట్‌లోకి ఆదిత్య..!
చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన చరిత్ర సృష్టించిన భారత్.. మరో రికార్డుకు చేరువైంది.

ISRO Aditya L-1 | చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన చరిత్ర సృష్టించిన భారత్.. మరో రికార్డుకు చేరువైంది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థల తొలిసారిగా చేపట్టిన సోలార్ మిషన్ నేడు గమ్యస్థానానికి చేరుకోబోతున్నది. సాయంత్రం 4 గంటలకు లాంగ్రాంజ్ పాయింట్‌లోకి ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ఇస్రో ప్రవేశపెట్టనున్నది. ఇక్కడ నుంచి సూర్యుడిపై అధ్యయనం చేయనున్నది.
భారత్ తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ఇస్రో గతేడాది సెప్టెంబర్ 2న చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వాహక నౌక సుదీర్ఘంగా ప్రయాణించి ఎల్-1 పాయింట్‌కు చేరబోతున్నది. ఇది భూమికి దాదాపు 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఎల్-1 పాయింట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని హాలో ఆర్బిట్‌గా పిలుస్తుంటారు. ఇది సూర్యుడి-భూమి మధ్యలో ఉండే గురుత్వాకర్షణ శక్తి సమతుల్యంగా ఉంటుంది.
థ్రస్టర్‌లను మండించి..
ఆదిత్య ఎల్-1 శాటిలైట్ ఫైనల్ దశకు చేరుకుంటుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం తెలిపారు. కక్ష్యలోకి ప్రవేశపెట్టడం చాలా సవాల్‌తో కూడుకున్నదని, ఇస్రో ఇలాంటి ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి అని తెలిపారు. అంతరిక్ష నౌక వేగం, మార్గం మార్చడానికి థ్రస్టర్‌లను మండించడం చాలా ముఖ్యమైందని ఆదిత్య ఎల్-1 మిషన్ స్వేస్ వెదర్, మానిటరింగ్ కమిటీ చైర్మన్ దిబ్యేందు నంది పేర్కొన్నారు.
మొదటి ప్రయత్నంలో అనుకున్న కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోతే.. మళ్లీ థ్రస్టర్‌ను మండించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఆదిత్య ఎల్ మిషన్-1లోని ఏడు పేలోడ్ సౌర దృగ్విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేయనున్నాయి. సూర్యుడి రేడియేషన్, అయస్కాంత క్షేత్రాలను అర్థం చేసుకునేందుకు డేటాను అందించనున్నది. అంతరిక్ష నౌక కరోనాగ్రాఫ్ ఉంటుంది. ఇది శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలానికి చాలా దగ్గరగా పరిశీలించనున్నది.
సెప్టెంబర్ 18 నుంచే పని ప్రారంభించిన ఆదిత్య..
శుక్రవారంతో ఆదిత్య ఎల్-1 అంతరిక్షంలో 126 రోజుల ప్రయాణం పూర్తి చేసింది. ఆదిత్య తన ప్రయాణాన్ని ప్రారంభించిన 16 రోజుల తర్వాత సెప్టెంబర్ 18 నుంచి సూర్యుడిపై అధ్యయనం ప్రారంభించింది. మొదట సూర్యుడి చిత్రాలను విడుదల చేసింది. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు L-1 నుంచి సోలార్ ఫ్లేర్స్, ఎక్స్ రే, సోలార్ డిస్క్ ఫొటోలను తీసి పంపింది.
ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (PAPA) , ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పైర్‌మెంట్ ( ASPEX), సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్‌తో సహా నాలుగు పరికరాలు బాగా పని చేస్తున్నాయి. హాలో కక్ష్యకు చేరుకున్న తర్వాత సూట్ పేలోడ్ తొలుత యాక్టివేట్ చేయనున్నారు. ఆదిత్య ఎల్-1లో ఏడు సైంటిఫిక్ పేలోడ్‌లను ఏర్పాటు చేశారు.
సూర్యుడిని నేరుగా ట్రాక్ చేసే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (VELC), సోలార్ అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUITE), సోలార్ లో-ఎనర్జీ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (Solexus), హై-ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (HEL1OS) ఉన్నాయి. చేయి. అమెరికా, యూరప్‌ల సోలార్ స్టడీ మిషన్‌ల కంటే భారత్‌కు చెందిన ఆదిత్య ఎల్1 మెరుగైనదని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ ఆర్ రమేశ్ తెలిపారు.
ముఖ్యంగా సూర్యుడి కరోనా అధ్యయనానికి ఇది చాలా అధునాతనమైన మిషన్ అని పేర్కొన్నారు. కరోనా నుంచి విడుదలయ్యే కాంతిని అమెరికా, యూరోపియన్ యూనియన్ మిషన్‌లు అధ్యయనం చేయలేకపోయాయని.. ఆదిత్య ఎల్-1లో ప్రత్యేక బ్లాక్ డిస్క్ ఉందని.. దాంతో కాంతిపై సమగ్రంగా అధ్యయనం చేస్తారన్నారు.