100 రోజుల పాటు పనిచేయనున్న చంద్రయాన్ – 4.. ప్రయోగం ఎప్పుడంటే..!
చంద్రయాన్-3 (Chandrayan-3) తో అపూర్వ విజయాన్ని అందుకున్న ఇస్రో (ISRO) చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమవుతోంది. జపాన్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించబోయే ఈ మిషన్‌ను లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ (లూపెక్స్) అని పిలుస్తున్నారు

విధాత: చంద్రయాన్-3 (Chandrayan-3) తో అపూర్వ విజయాన్ని అందుకున్న ఇస్రో (ISRO) చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమవుతోంది. జపాన్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించబోయే ఈ మిషన్‌ను లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ (లూపెక్స్) అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ప్రణాళిక దశలోనే ఉన్న ఈ మిషన్ గురించి తాజాగా ఇస్రో కొన్ని వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. లుపెక్స్ (LUPEX) మిషన్‌లో భాగంగా పంపించే ల్యాండర్, రోవర్‌లు 100 రోజుల పాటు చంద్రునిపై తమ పరిశోధనలు కొనసాగిస్తాయి. చంద్రయాన్‌ల-3లో ఈ సమయం కేవలం 14 రోజులేనన్న విషయం తెలిసిందే.
అదే విధంగా చంద్రయాన్-3 రోవర్ 26 కేజీలు మాత్రమే బరువుండగా.. లుపెక్స్‌లో పంపే రోవర్ ఏకంగా 350 కేజీల బరువు ఉండనుంది. ఈ మిషన్లో భాగంగా జపాన్‌కు చెందిన హెచ్3 రాకెట్ ల్యాండర్, రోవర్‌లను తీసుకెళుతుందని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు. ఈ మిషన్లో భాగంగా సరాసరి చంద్రుని దక్షిణ ధ్రువంపై మిషన్ ను ల్యాండ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడూ చీకటిగా ఉండే ఈ ప్రాంతంలో చిన్న స్థాయి తవ్వకాలు జరిపి లోతైన పరిశోధన చేయడమే లూపెక్స్ ఉద్దేశమని ఆయన అన్నారు.
లూపెక్స్‌లో ల్యాండర్‌ను ఇస్రో రూపొందిస్తుందని.. రోవర్‌ను జపాన్ శాస్త్రవేత్తలు తయారు చేస్తారని పేర్కొన్నారు. అంతే కాకుండా చంద్రయాన్-3 మిషన్ జాబిల్లి ఉపరితలంపై 500 మీ. పరిధిలోనే తిరిగి ప్రయోగాలు చేసిందని.. లూపెక్స్‌లో పంపే రోవర్ 1 కి.మీ. పరిధిలో పరిశోధనలు చేస్తుందని నీలేశ్ దేశాయ్ తెలిపారు. ప్రయోగంలో భాగంగా గ్రౌండ్ పినట్రేటింగ్ రాడార్, మిడ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రో మీటర్, పెర్మిటివిటీ అండ్ థర్మోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ ఫర్ మూన్ ఆక్వటిక్ స్కౌట్ (ప్రతిమ) పేలోడ్‌లను పంపనున్నారు. ఎన్నో కఠిన పరిస్థితులు, రెండు కి.మీ. ఎత్తైన కొండలు, లోతైన బిలాలతో ఉండే చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇంత భారీ ప్రాజెక్టును విజయవంతం చేయడం సవాళ్లతో కూడుకున్నదని నీలేశ్ దేశాయ్ తెలిపారు.
అయితే రెండు దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలు పాలు పంచుకుంటుండటంతో ప్రతి చిన్న అంశంలోనూ సంప్రదింపులు అవరసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చడానికి మరికొన్నేళ్లు పడుతుందని.. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు వెళతామని ఆయన అన్నారు. చంద్రయాన్-3 విజయం లుపెక్స్‌పై ఎన్నో అంచనాలను పెంచిందని.. దానికి అనుగుణంగా పనిచేస్తామని జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా వైస్ ప్రెసిడెంట్ ఇషీ యసూవో ఇటీవల ప్రకటించారు.