కాంగ్రెస్‌ మేలుకోకుంటే.. తేరుకోవడం కష్టమే

విధాత: గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. 1995 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 149 స్థానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఆ రికార్డును బీజేపీ చెరపలేకపోయింది. గత ఇరవై ఏడు సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్న కమలం పార్టీ గత కాంగ్రెస్‌ రికార్డును బద్దలు కొట్టింది. ఇదంతా కాంగ్రెస్‌ స్వయంకృతం. గత ఎన్నికల్లోనే 77 స్థానాలు దక్కించుకున్న ఆ పార్టీ కొంత కష్టపడి ఉంటే గెలిచేది. ప్రధాని మోడీ అంతా తానై గుజరాత్‌ ఎన్నికల భారాన్ని మోస్తున్నారు. […]

  • By: krs    latest    Dec 09, 2022 1:26 PM IST
కాంగ్రెస్‌ మేలుకోకుంటే.. తేరుకోవడం కష్టమే

విధాత: గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. 1995 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 149 స్థానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఆ రికార్డును బీజేపీ చెరపలేకపోయింది. గత ఇరవై ఏడు సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్న కమలం పార్టీ గత కాంగ్రెస్‌ రికార్డును బద్దలు కొట్టింది. ఇదంతా కాంగ్రెస్‌ స్వయంకృతం. గత ఎన్నికల్లోనే 77 స్థానాలు దక్కించుకున్న ఆ పార్టీ కొంత కష్టపడి ఉంటే గెలిచేది. ప్రధాని మోడీ అంతా తానై గుజరాత్‌ ఎన్నికల భారాన్ని మోస్తున్నారు.

ఆయన కృషి వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాలు దక్కించుకున్నది. ఈసారి సుమారు 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్లు నిరాకరించి కొత్త వారికి అవకాశం కల్పించింది. వాళ్ల ఎన్నికల బరిలో నిలుచుంటే వారిపై వేటు వేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ ధిక్కార స్వరం వినిపించినా సహించలేదని కమలం పార్టీ పెద్దలు కరాఖండిగా చెప్పారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఆ పని చేయలేదు. అలాగే కీలక ఎన్నికల సమయంలో మోడీని ఢికొట్టగలిగే నాయకత్వం గుజరాత్‌ రాష్ట్ర నాయకత్వం గాని, జాతీయ నాయకులు సరితూగలేరని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది. కానీ ప్రజల ఓట్లను పార్టీవైపు మళ్లించుకునే వ్యూహాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎన్నడూ చేయలేదు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు కొంత వెసులుబాటు కల్పించి గుజరాత్‌లో పూర్తిస్థాయిలో ప్రచారం చేసి ఉంటే ఇవాళ గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు. గత ఎన్నికల్లో 77 స్థానాలు గెలిచిన ఆ పార్టీ ప్రస్తుతం 17 స్థానాలకే పరిమితమయ్యారు.

పంజాబ్‌లో విజయం తర్వాత ఆప్‌ ఇతర రాష్ట్రాల్లో విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నది. ఫలితంగా ఆపార్టీ వల్ల కాంగ్రెస్‌పార్టీనే నష్టపోతున్నది. ఈ ఈ విషయం తెలిసినా కాంగ్రెస్‌ నేతలు తేలిగ్గా తీసుకుంటున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో ఆప్‌ 5 స్థానాలు గెలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును ఆపార్టీ చీల్చింది. పట్టణ ప్రాంతంలోనూ ఓట్ల చీలిక వల్ల అంతిమంగా బీజేపీకి గణనీయంగా లాభాన్ని చూకూర్చింది.

కాంగ్రెస్‌ను బీజేపీ నేరుగా ఎదుర్కొనే రాష్ట్రాలు కాకుండా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట బీజేపీ కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచే వ్యూహాలు పన్నుతున్నది. ఫలితంగా 2017 లో గుజరాత్‌లో స్వల్ప తేడాతో అధికారానికి దూరమైంది. ఐదేళ్ల తర్వాత ఘోరంగా దెబ్బతిన్నది. గోవా, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలను చూసిన తర్వాత కాంగ్రెస్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలి.

కాంగ్రెస్‌ ముఖ్త్‌ భారత్‌ అన్న బీజేపీ నినాదాన్ని ప్రాంతీయ పార్టీల విస్తరణ వల్ల అది ఆచరణలోకి వస్తున్నది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. వాస్తవ పరిస్థితులను అంచచా వేసి కాంగ్రెస్‌ పార్టీ మేలుకోకపోతే భవిష్యత్తులకో కోలుకోవడం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.