Pawan Kalyan
• 23 కులాలను తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగిస్తే కనీసం మాట్లాడరు
• తూర్పు కాపుల జనాభా పైన వైసీపీ వింత లెక్కలు
• ఉత్పత్తి కులాలకు రాజ్యాధికారం రావాలి
• తూర్పు కాపుల సమస్యలను జనసేన ప్రభుత్వంలో పరిష్కరిస్తాం
• భీమవరంలో తూర్పు కాపుల సమావేశంలో పవన్ కళ్యాణ్
• జనసేనలో చేరిన అఖిల భారత తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలు
(భీమవరం నుంచి విధాత ప్రతినిధి)
‘జగన్ రెడ్డి తెలంగాణలోని తన రూ.300 కోట్ల ఆస్తిని కాపాడుకోవడానికి.. తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తులను మొత్తం ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాక, తెలంగాణకే వదిలేసి వచ్చేశాడు. విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందాల్సిన రూ.వేల కోట్ల ఆస్తులు అవి. తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశాడు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని 23 కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించింది. దాని గురించి మాట్లాడని ఈ వైసీపీ పాలకులు తమ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రజల ఆస్తులను వదిలేశారు.. కానీ బీసీలను జాబితా నుంచి తొలగిస్తే కనీసం నోరెత్తలేదు. ఇలాంటి ద్వంద్వ నీతి కలిగిన వైసీపీ నాయకులు అంటే నాకు కోపం. అందుకే నా గొంతు బలంగా మారుతుంద’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం భీమవరంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, సంఘం నేతలు పల్లా వెంకట్రావు, గడి ఝాన్సీ, ధనుకొండ లక్ష్మణ నాయుడు, మామిడి విష్ణు, భూపతి జయలక్ష్మి, లోగేషి బాలకృష్ణ తదితరులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు.
తన రూ.300 కోట్ల ఆస్తి కోసం
ఏపీ ఆస్తి తెలంగాణకు వదిలేసిన జగన్ రెడ్డి#VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP pic.twitter.com/XEsMjZ9pC6— JanaSena Party (@JanaSenaParty) June 27, 2023
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘బీసీ కుల గణన అనేది అవసరం అని జనసేన పార్టీ భావిస్తోంది. జనాభా ప్రతిపాదిక లెక్కల వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. దామాషా పద్ధతి ప్రకారం ఎవరు ఎంతమంది ఉన్నారో తెలిస్తే, వారికి అన్ని విషయాల్లోనూ తగిన న్యాయం జరుగుతుంది.
జనసేన పార్టీ బీసీ కుల గణన జరగాలని ఆకాంక్షిస్తుంది. గణన కోసం అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది. నేను కులాల గురించి మాట్లాడుతున్నాను అంటే అది అన్ని కులాలు సమాన అభివృద్ధికి ఎందుకు నోచుకోలేకపోతున్నాయి.. అనే ఆవేదన, ఆలోచన నుంచి వస్తున్న మాటలే అని గుర్తించాలి” అని అన్నారు.
“ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఆవేశంతో మాట్లాడతాడు.. ఊగిపోతాడు అని అందరూ అంటారు. నా వేదన వెనుక పేదోడి ఆవేదన దాగుంది. నా ఆవేశం వెనుక బలహీన వర్గాల అన్యాయం దాగుంది.. నా ఆక్రోశం వెనుక దళిత వర్గాలను దగా చేసిన ప్రభుత్వ అన్యాయం దాగుంది. నేను ప్రజల్ని నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను.
వారికి అన్యాయం జరిగితే నాకు జరిగినట్లే అనుకుంటాను కాబట్టే నాకు వారి వెతలు విన్నపుడు రక్తం మరిగిపోతుంది. ఎన్నాళ్లు ఇంకా రాజకీయ నాయకులు పాలకుల్ని దోచుకుంటారు..? ఎంత భూమిని లాక్కుంటారు..? అన్న కోపం వస్తుంది. ఎంత సంపాదించినా చివరి భూమాత వారిని తనలో కలిపేసుకుంటుందన్న కనీస స్పృహ లేని వారిని చూస్తేనే బాధేస్తుంది” అని భావోద్వేగం అయ్యారు.
JanaSena Chief Sri #PawanKalyan Speech
జనసేన పార్టీలోకి తూర్పు కాపులు చేరిక, భీమవరం#VarahiVijayaYatra pic.twitter.com/OKDhbvNnJf
— JanaSena Party (@JanaSenaParty) June 27, 2023
“ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు దాటితే తూర్పుకాపులకు బీసీ ధ్రువీకరణ పత్రం ఇవ్వరు. కేవలం ఆ మూడు జిల్లాల్లోనే వారికి బీసీ కార్డు పనికొస్తుంది. తెలంగాణ వెళితే అసలు వారిని బీసీలుగా గుర్తించరు. యాదవ సమాజానికి ఎక్కడికి వెళ్లినా బీసీ ధ్రువీకరణ పత్రం ఇచ్చినపుడు, తూర్పు కాపులకు ఎందుకు ఇవ్వరు..? ఒకరికి ఒక న్యాయం… మరొకరికి మరో న్యాయమా?” అని పవన్ ప్రశ్నించారు.