యూఎన్ఓకు నిధులను నిలిపివేస్తున్న దేశాలు..
పాలస్తీనాలో సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్ఆర్‌డబ్ల్యూఏపై దేశాలు వరుసగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

- ఇజ్రాయెల్‌పై దాడిలో సిబ్బంది పాల్గొనడమే కారణం!
విధాత: పాలస్తీనాలో సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించే ఐక్యరాజ్య సమితి (UNO) అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యుజీస్ ఇన్ నార్త్ ఈస్ట్ (యూఎన్ఆర్‌డబ్ల్యూఏ)పై దేశాలు వరుసగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ (Israel) పై దాడికి పాల్పడిన హమాస్ దళాలకు ఆ సంస్థకు చెందిన వాలంటీర్లు సాయం చేశారని.. కొంత మంది నేరుగా పాల్గొన్నారని ఇజ్రాయెల్ తన దగ్గరున్న సాక్ష్యాధారాలను బయటపెట్టింది. దీంతో వివిధ దేశాలు ఆ సంస్థకు ఇస్తున్న నిధులను నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి.
తాజాగా జపాన్ ఈ జాబితాలో చేరింది. బయటకు వస్తున్న వార్తలను చూసి తమ గుండె తరుక్కుపోతోందని.. సాయం చేయాల్సిన వలంటీర్లు ఇలాంటి హత్యాకాండలో పాల్గొనడం దురదృష్టకరమని పేర్కొంది. పరిస్థితిలో మార్పు వచ్చిందని భావించే వరకు యూఎన్‌కు ఇస్తున్న నిధులను నిలిపివేస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. అయితే దౌత్యమార్గాల్లో గాజాలో మానవ హక్కులను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని తెలిపింది. అక్కడ పనిచేస్తున్న ఇతర అంతర్జాతీయ సంస్థలకు తమ సాయం కొనసాగుతుందని పేర్కొంది.
మరోవైపు ఈ ఆరోపణలపై యూఎన్ స్పందించింది. కొంతమంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించామని… విచారణ కొనసాగుతోందని పేర్కొంది. అయితే ఎంత మందిని తొలగించిందనే దానిపై సమాచారం ఇవ్వలేదు. ఇజ్రాయెల్ యూఎన్ సంస్థ సహాయాన్ని నిలిపివేయాలని కోరుతుండగా.. తమకు సాయాన్ని కొనసాగించాలని.. పొరపాట్లను సరిదిద్దుతామని యూఎన్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ విజ్ఞప్తి చేశారు. యూకే, జర్మనీ, ఇటలీ తదితర తొమ్మిది దేశాలు ఇప్పటికి యూఎన్‌కు నిధులు నిలిపివేశాయి.