కేసీఆర్‌ను దించితేనే ఉద్యోగాలు: రేవంత్ రెడ్డి
ప్రపంచ చరిత్రలో తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ తుది దశ తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కండి విధాత: తెలంగాణలో దుర్మార్గపు రాజ్యం నడుస్తోందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. 60 ఏళ్ల ఆంధ్రా పాలనలో కూడా ఇంత దారుణం జరగలేదన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్‌కు సర్వం ఇచ్చిందని, ఇక ఇచ్చేదేం లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను దించితేనే యువతకు ఉద్యోగాలొస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి 13వ […]

- ప్రపంచ చరిత్రలో తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ
- తుది దశ తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కండి
విధాత: తెలంగాణలో దుర్మార్గపు రాజ్యం నడుస్తోందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. 60 ఏళ్ల ఆంధ్రా పాలనలో కూడా ఇంత దారుణం జరగలేదన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్‌కు సర్వం ఇచ్చిందని, ఇక ఇచ్చేదేం లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను దించితేనే యువతకు ఉద్యోగాలొస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సందర్భంగా శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఓయూలోకి పోలీసులు రావాలంటే భయపడేవారని, కానీ ఇపుడు పోలీసులు ఓయూలోకి వచ్చి అణచివేస్తున్నారంటే ఈ పాలన ఎలాంటిదో అర్థం చేసుకోవాలన్నారు. రాచరికపు మనస్తత్వంతోనే తెలంగాణలో అణచివేత సాగుతోందని తెలిపారు.
తుది దశ ఉద్యమానికి సిద్దం కావాలి
“తొలి దశ ఉద్యమంలో ఉస్మానిచా విధ్యార్ధులు ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించారని, మలిదశ ఉద్యమంలో అమరవీరులు, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని రేవంత్ అన్నారు. సాధించుకున్నరాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షలను నేరవేర్చుకోవడానికి తుది దశ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సందర్భం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.
చాలా ఏళ్ల తరువాత ఓయూలో చైతన్యం
చాలా ఏళ్ల తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో తిరిగి తెలంగాణ చైతన్యం కనిపిస్తోందని రేవంత్ అన్నారు. ప్రపంచ చరిత్రలో తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. ఉస్మానియా అంటే గుర్తుకు వచ్చేది విద్యార్ధి ఉద్యమకారులు, విద్యార్థి అమరులన్నారు. తెలంగాణ సమాజంపై ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేసినప్పుడల్లా నిటారుగా నిలబడి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని కితాబు ఇచ్చారు. అటువంటి ఖ్యాతి కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేయడం సంతోషాన్ని కలిగిచిందదన్నారు.
అధికారం పోయే ప్రమాదం ఉన్నా..
ఆంధ్రప్రదేశ్ అధికారం పోయే ప్రమాదం ఉన్నా అమరుల త్యాగాలు వృధా కాకూడదని, 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చాలనే సదుద్దేశంతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని రేవంత్ తెలిపారు.
వాగ్దానాల అమలేది..
ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు తదితరులతో కూడిన ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి తెలంగాణకు ఏదీ మంచిదో అదే చేస్తాం అని టీఆర్ఎస్ తన మ్యానిఫెస్టోలో వాగ్ధానం చేస్తే, మేము కూడా నమ్మామని రేవంత్ అన్నారు. తెలంగాణ శాసనసభ తొలి సమావేశంలో తెలంగాణ మలి దశ ఉద్యమంలో అమరులైన 1200 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షల ఆర్థిక సాయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, వ్యవసాయం కోసం 3 ఎకరాల భూమి ఇస్తాం అని ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడితే, పార్టీలకు అతీతంగా అందరం మద్దతు ఇచ్చామన్నారు. ఇది జరిగి 8 సంవత్సారాలు అవుతున్నా 550 కంటే ఎక్కువ మంది అమరులను ప్రభుత్వం గుర్తించలేదని తెలిపారు. గుర్తించిన కొంత మంది అమరులకు సంబంధించిన పత్రాల్లో అడ్రస్ తెలియదని రాశారు. ఇంతకంటే అవమానకరం మరొకటి ఉంటుందా? అని రేవంత్ ప్రశ్నించారు.
శ్రీకాంత్ చారి ప్రాణ త్యాగం ప్రభుత్వానికి గుర్తు రాలేదా?
“చిన్న అగ్గిపుల్ల తాకితేనే అమ్మ అని అంటాం. కానీ శ్రీకాంతాచారి ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ప్రాణాలు పోతున్న కూడా జైతెలంగాణ అని నినదించాడు. బతికితే తెలంగాణ కోసం మళ్లీ చావడానికైనా సిద్ధం అన్నాడు. ఒకవేళ నేను చచ్చినా తెలంగాణ రాకపోతే మళ్లీ జన్మించి ప్రాణత్యాగం చేస్తా అన్న శ్రీకాంత్ చారి ప్రభుత్వానికి గుర్తు రాలేదా? అని రేవంత్ ప్రశ్నించారు.
ఆవేదనగా ఆ నాటి జ్ఞాపకాలు…
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీ వేదిక గా అమరుడు శ్రీకాంత చారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది.
నాటి ఉద్యమ దృశ్యాలు.. ఆత్మబలిదానాలు యాదికొచ్చి గుండె కళుక్కుమంది!#SrikanthaChary #Martyr pic.twitter.com/tEZsHMzWRB— Revanth Reddy (@revanth_anumula) December 3, 2022
సునీల్ చేతకాక చావలేదు
“మొన్నటి మొన్న కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ సునీల్ నాయక్ ‘‘నేను చేతకాక చావడం లేదు. ఉద్యోగాల అనే ముసుగుతో అధికారమెక్కిన ఈ పాలకులకు కనువిప్పు కలగాలి ‘‘ అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనాటి శ్రీకాంత్ చారి నుంచి ఈనాటి సునీల్ నాయక్ వరకు జరిగిన త్యాగాలు ఎన్నో. ప్రపంచ చరిత్ర పుటల్లో ఎక్కాల్సిన ఇటువంటి త్యాగాలకు దక్కాల్సిన గౌరవం రానీయకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను విద్యార్థులందరూ గమనించాలి.” అని రేవంత్ తెలిపారు.
అడ్డుకోవాలని చూసినా..
గతంలో ఓయూకు రాకుండా నన్ను అడ్డుక్కోవాలని చూసినా వచ్చి విద్యార్థులకు అండగా ఉన్నా అని రేవంత్ అన్నారు. మీకడుపు నిండితే, మీ ఇల్లు పండితే చాలా? తెలంగాణలో నిరుద్యోగులు, యువత గురించి పట్టించుకోరా అని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మీరు నియమించిన బిశ్వాల్ కమిటీ తెలంగాణలో 1.92 లక్షల ఖాళీలు ఉన్నాయని పేర్కొందని, 9 ఏళ్లు అయిన ఆ ఖాళీల భర్తీ ఎందుకు ప్రారంభించ లేదని ప్రశ్నించారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ (సీఎంఐఈ) ప్రకారం..దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ 5లో ఉందని తెలిపారన్నారు.
నిరుద్యోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో తెలంగాణ
దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మొదటి స్థానంలో ఉందని రేవంత్ తెలిపారు. దేశ యావరేజ్ తో చూసినా రాష్ట్రంలో 2 శాతం నిరుద్యోగం అధికంగా ఉంది. రాష్ట్రంలో 8.8 శాతం నిరుద్యోగ రేటు ఉంటే.. దేశంలో 6.8 శాతంగా ఉన్నట్లు సీఎంఐఈ డేటాలో తేలిందన్నారు. సమస్య ఇంత త్రీవంగా ఉంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేసిన పాపాన పోలేదన్నారు.
సింగిల్ స్కూల్ టీచర్ల స్కూళ్లను మూసివేసిన సర్కారు
గిరిజన ప్రాంతాల్లో ఉన్న 5,648 సింగిల్ టీచర్ స్కూళ్లను ప్రభుత్వం మూసివేయించిందని రేవంత్ అన్నారు. ఇది దళితులు, గిరిజనులను చదువుకు దూరం చేయడం కాదా? అని నిలదీశారు. కిలోమీటరుకో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్లకు ఒక హైస్కూల్, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కు ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి పేదవాడి విద్యను అందించాలని గత ప్రభుత్వాలు భావిస్తే ఆ ఆశయం నుంచి తెలంగాణ ప్రభుత్వం దూరం జరుగుతోందన్నారు.
కుట్రపూరితంగా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్న సర్కారు
ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు లాంటి యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల వందల సంఖ్యలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో ఆ యూనివర్సిటీలు వెలవెలబోతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడం వెనక ప్రభుత్వ కుట్రను గమనించాల్సిన అవసరం ఉందన్నారు.
ఉద్యమ ఆశయాలు నెరవేరాయా?
60 ఏళ్ల ఉద్యమం ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో అనుకున్న ఆశయాలు నేరవేరాయా లేదా అని విశ్లేషించుకోవాల్సిన సందర్భం వచ్చిందని రేవంత్ అన్నారు. తీవ్రమైన సమస్య వచ్చినపుడు రాజకీయ నాయకులమంతా ఓయూ వైపు చూస్తామని, ఇన్నాళ్లుగా ఓయూ ఎందుకు కార్యక్రమాలు నిర్వహించడం లేదని అనుకున్నానన్నారు. కానీ ఈ కార్యక్రమంతో తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూ దాల్సిన సందర్భం వచ్చిందన్నారు.
తొలి దశ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించారని, మలిదశ ఉద్యమంలో అమర వీరులు, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, తెలంగాణ ఆకాంక్షలను నేరవేర్చుకోవడానికి తుది దశ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సందర్భం వచ్చిందని విద్యార్ధులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కుటుంబానికే పదవులు ఇవ్వాలని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉంది?
“తెలంగాణ వస్తే రక్తం చిందదన్నారు.. కానీ ఎన్ కౌంటర్లు జరిగాయి. కేసీఆర్ నక్సలైట్ల ఎజెండా ఎక్కడపోయింది. కుటుంబానికి పదవులు ఇవ్వాలని ఏ ఏ నక్సలైట్ల ఎజెండాలో రాసి ఉంది? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలని, అమరు కుటుంబ సభ్యులకు ప్రజా ప్రతినిధులుగా అవకాశం ఇవ్వకూడదని, ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ఏ ఎజెండాలో ఉంది.” అని రేవంత్ ప్రశ్నించారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం తెలంగాణ రాష్ట్రం తెచుకున్నామన్నారు..
నిజాం నవాబులు కూడా అభివృద్ధి చేశారని, అభివృద్ధి నమూనా అయితే నిజాంకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం జరిగిందని రేవంత్ అడిగారు. ఆధిపత్యం, అణచివేతల వల్లే పోరాటాలు ఉద్భవించాయన్నారు. సామాజిక న్యాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. సామాజిక న్యాయం లేని రాష్ట్రం రాష్ట్రమే కాదన్నారు. మళ్లీ అలజడి రేగితే అందులో కేసీఆర్ కాలి బూడిద అవుతావు అని రేవంత్ అన్నారు. తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనా వేయకు, బూట్లు చేతపట్టుకుని పరుగెత్తేలా చేస్తారు జాగ్రత్త అనికేసీఆర్ అను రేవంత్ హెచ్చరించారు.
శ్రీకాంత్ చారిపై ఎందుకు చర్చించలేదు
మొన్ననే నవంబర్ 29న దీక్షా దివస్ అంటూ ఒక్క బక్క పలుచటోడు ఒక్కడై కదిలి తెలంగాణను సాధించాడు అని టీఆర్ఎస్ నాయకులు జోరుగా సంబరాలు చేసుకున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ ఆదే రోజున శ్రీకాంతా చారి ఆత్మబలిదానం చేసుకున్నారని, ఆ రోజు చర్చ జరిగితే శ్రీకాంతాచారి బలిదానం గురించి జరగాలన్నారు.
అమరుల స్థూపం కాంట్రాక్ట్ ఆంధ్రులకా!
తెలంగాణ అమరవీరుల స్థూపం కాంట్రాక్టు కూడా కేసీఆర్ చివరకు ఆంధ్రా వాళ్లకు అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు అమరుల స్థూపం కాంట్రాక్ట్ రూ. 62కోట్లతో మొదలు పెడితే రూ. 200 కోట్లకు చేరిందన్నారు. 15 నెలల్లో పూర్చి కావల్సిన అమరుల స్థూపం నిర్మాణం 6 ఏళ్లు అయినా కాలేదన్నారు. ఇది పూర్తయ్యే నాటికి రూ.200 కోట్లు రూ.300 కోట్లు అయ్యే పరిస్థితి వచ్చేలా ఉందన్నారు. యాదాద్రి పునర్ నిర్మాణం కూడా ఆంధ్రావాళ్ల కనుసన్నుల్లోనే జరిగిందని రేవంత్ అన్నారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పెద్దలు భవిష్యత్ ప్రణాళిక రూపొందించాలని రేవంత్ కోరారు. మేము ఏది చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుందో చెప్పండి… దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. ఇతరుల్లా చెప్పేదొకటి చేసేదొక మనస్తత్వం నాది కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కృషి చేయాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. మీరు ఇచ్చిన సూచన పత్రాన్ని మా మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తామని రేవంత్ తెలిపారు.