సీఎంఆర్ఎఫ్ చెక్కుల గల్లంతుపై హరీశ్‌రావు మాజీ పీఏ అరెస్టు
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల వ్యవహారంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విధాత: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల వ్యవహారంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మాజీ మంత్రి హరీశ్ రావు మాజీ పీఏ జే.నరేశకుమార్తో పాటు కొర్లపాటి వంశీ, బాలగోని వెంకటేశ్ గౌడ్, ఓంకార్ ఉన్నారు. వీరితో పాటు ఇతరులను ఎఫ్ఐఆర్ లో నిందితులుగా చూపించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు దుర్వినియోగమయ్యాయంటూ మెదక్ జిల్లాకు చెందిన రవినాయక్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న పోలీసులు. నరేశ్ 19 సీఎంఆర్ఎఫ్ చెక్కుల వరకు విత్ డ్రా చేసినట్లు సమాచారం.
అతనిపై మేమే ఫిర్యాదు చేశాం : హరీశ్‌రావు కార్యాలయం
సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్వాహా వ్యవహారంపై మాజీ మంత్రి టి.హరీశ్‌రావు కార్యాలయం స్పందించింది. జే.నరేశ్‌కుమార్‌పై తమ కార్యాలయం గతంలోనే తాము ఫిర్యాదు చేసిందని, అతను పీఏ కాడని, కార్యాలయ డేటా ఆపరేటర్ మాత్రమేనని, ఆయనకు హరీశ్‌రావుకు ఎలాంటి సంబంధం లేదని హరీశ్‌రావు కార్యాలయం ప్రకటించింది.
మెదక్ జిల్లా పీర్లా తండాకు చెందిన రవి నాయక్ భార్య లలితా బాయికి పాము కరువడంతో చికిత్స చేయుంచగా 5 లక్షల వరకు ఖర్చు అయి ఆమె చనిపోయిందని, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా రూ. 50,000, రూ. 37,500 చొప్పున రెండు చెక్కులు వచ్చాయని తెలిపింది. వాటిని బాధితులకు ఇవ్వకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ జోగుల నరేష్, కార్ డ్రైవర్ కొర్లపాటి వంశీ, బాలగొని వెంకటేష్ గౌడ్ కలిసి డ్రా చేసుకున్నారని, అప్పటి ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత, ప్రభుత్వ ఆదేశాలు లేఖ నం. 2290 తేదీ 05-12-2023 ఆదేశాల ప్రకారం, మంత్రి ఆఫీసు మరుసటి రోజు 06-12-2023 రోజున మూసివేసి, సిబ్బందిని పంపియ్యడం జరిగిందని తెలిపింది.
ఆ రోజు నుంచి నరేష్ అనే వ్యక్తితో హరీశ్ రావు కార్యాలయంకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే ఆఫీసు మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను నరేశ్ తన వెంట తీసుకువెళ్లినట్లు హరీష్ రావు దృష్టికి వచ్చిందని, దీనిపై వెంటనే ఆయన కార్యాలయం స్పందించి, నరేష్ అనే వ్యక్తిపై 17-12-2023రోజున, నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని హరీశ్‌రావు కార్యాలయం వెల్లడించింది.
వరుస స్కామ్‌లతో బీఆరెస్ ఉక్కిరిబిక్కిరి
కాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో భారీగా గోల్ మాల్ జరిగిందని అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులకు నియోజకవర్గాల్లో ఎలాంటి మెడికల్ బిల్లులు లేకుండానే పెద్దఎత్తున చెక్కులు అందించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే బీఆరెస్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల స్కామ్, విద్యుత్తు ఫ్లాంట్ల నిర్మాణాల్లో, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో, బర్రెలు, గొర్రెల పంపిణీలో, ఫార్ములా ఈ రేసులో, ధరణిలో భూముల గోల్మాల్, ఫోన్ ట్యాపింగ్ వంటి స్కామ్‌లు వెలుగు చూశాయి. వాటికి తోడు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో అక్రమాల కేసు వెలుగుచూసిన నేపథ్యం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు అద్దం పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.