Kolhapur | జూపల్లికి వర్గ పోరు షురూ!
Kolhapur కొల్లాపూర్ కాంగ్రెస్‌లో వేడెక్కిన రాజకీయం పార్టీలో చేరకముందే వర్గపోరు సెగ జూపల్లికి వ్యతిరేకంగా చింతపల్లి వర్గం భేటీ కాంగ్రెస్ టికెట్‌కు నేనే అర్హుడినంటున్న చింతలపల్లి జగదీష్ రావు నాగర్ కర్నూల్‌లోనూ అదే సీన్ విధాత ప్రతినిధి, మహబూబ్ నగర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముందే కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయల సెగ రాజుకుంది. జూపల్లి రాక టీపీపీసీ సభ్యుడు, కొల్లాపూర్ కాంగ్రెస్ సీనియర్ నేత చింతలపల్లి జగదీశ్వర్ […]

Kolhapur
- కొల్లాపూర్ కాంగ్రెస్‌లో వేడెక్కిన రాజకీయం
పార్టీలో చేరకముందే వర్గపోరు సెగ - జూపల్లికి వ్యతిరేకంగా చింతపల్లి వర్గం భేటీ
- కాంగ్రెస్ టికెట్‌కు నేనే అర్హుడినంటున్న చింతలపల్లి జగదీష్ రావు
- నాగర్ కర్నూల్‌లోనూ అదే సీన్
విధాత ప్రతినిధి, మహబూబ్ నగర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముందే కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయల సెగ రాజుకుంది. జూపల్లి రాక టీపీపీసీ సభ్యుడు, కొల్లాపూర్ కాంగ్రెస్ సీనియర్ నేత చింతలపల్లి జగదీశ్వర్ రావుకు మింగుడుపడడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ను నమ్ముకొని కార్యకర్తలకు అండగా ఉంటున్న చింతలపల్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశలో ఉన్నారు.
ప్రస్తుతం జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో చింతలపల్లి వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. జూపల్లి పార్టీలోకి వచ్చినా అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ఇటీవల పలు సందర్భాల్లో చింతలపల్లి ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే కొల్లాపూర్‌లో సభలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు ఆయా పార్టీల కార్యకర్తలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. గత ఆదివారం కొల్లాపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని, తనను కాదని పార్టీలో చేరుతున్న జూపల్లికి టికెట్ ఇస్తే తాను కూడా ఎన్నికల బరిలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని చింతలపల్లి ప్రకటిస్తున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు తన వెంటే ఉన్నారని అయన ధీమాగా ఉన్నారు. ఇంకా జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరకముందే పార్టీలో వర్గపోరు రేగడం జూపల్లి వర్గానికి తలనొప్పిగా తయారైంది. జూపల్లి మాత్రం కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందనే ధీమాతో అడుగులు ముందుకు వేస్తున్నారు. చింతలపల్లి వ్యవహారం పార్టీ అదిష్టానం పరిష్కరిస్తుందని చెబుతున్నారు.
నాగర్ కర్నూల్‌లో అదే సీన్!
నాగర్ కర్నూల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో కూడా వర్గ పోరు మొదలైంది. బీఆరెస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, అయన కుమారుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వీరి రాక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి కి ఇష్టం లేదు. కాంగ్రెస్ లో చేరి కుమారునికి నాగర్ కర్నూల్ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని కూచుకుళ్ళ ప్రయత్నిస్తున్నారు.
ఇది మింగుడుపడని నాగం జనార్దన్ రెడ్డి ఓ సందర్బంగా మాట్లాడుతూ కూచుకుళ్ళ కు కొడుకు ఉన్నాడనే విషయం తెలియదని వెటకారంగా అన్నారు. తనకు టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎన్నికల్లో మట్టి కరిపిస్తానని అంటున్నారు. వారిద్ధరూ కూడా సీనియర్ నేతలు కావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందో వేచిచూడాలి.