సీఎం రేవంత్ నివాసానికి కేకే.. కడియం నివాసానికి కాంగ్రెస్ బృందం

సీనీయర్ నేత, బీఆరెస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి ఆయన సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు

సీఎం రేవంత్ నివాసానికి కేకే.. కడియం నివాసానికి కాంగ్రెస్ బృందం
  • హస్తం గూటికి కేకే, కడియం, అల్లోల, గడ్డంలు
  • మరో 10మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు సైతం సిద్ధం


విధాత : సీనీయర్ నేత, బీఆరెస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి ఆయన సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ కాంగ్రెస్‌లో చేరాలంటూ కేకేను, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని వారి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు.


గురువారం బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ పిదప ఆయన కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. మరుసటి రోజునే కేకే సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కావడంతో ఆయన, తన కుమార్తె విజయలక్ష్మితో కలిసి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరడం ఇక లాంఛనమేనని తెలుస్తుంది. భేటీ అనంతరం కేకే మాట్లాడుతూ తాను, తన కూతురుతో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరబోతున్నామని ప్రకటించారు.


కడియం నివాసానికి కాంగ్రెస్ బృందం


మాజీ మంత్రి, బీఆరెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్యతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్‌మున్షీ ఆద్వర్యంలోని కాంగ్రెస్ బృందం భేటీ అయ్యింది. శ్రీహరిని, కావ్యను వారు కాంగ్రెస్‌లోకి చేరాలని ఆహ్వానించారు. మున్షీ, రోహిన్‌చౌదరి, మల్లు రవి, సంపత్‌కుమార్‌, మధుయాష్కిలు కడియంను కలిసిన వారిలో ఉన్నారు. వరంగల్ బీఆరెస్ ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా కడియం కావ్య బీఆరెస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. శ్రీహరి, కావ్యలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని, కావ్యను వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తారని సమాచారం.


కాగా భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ మాట్లాడుతు కడియం శ్రీహరి, కావ్యలను పార్టీలోకి ఆహ్వానించామని, వారు పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ తనను, కావ్యను కాంగ్రెస్‌లో చేరాలని, తెలంగాణలో పార్టీలో బలోపేతం చేసేందుకు కలిసి పనిచెద్దామని కోరడం జరిగిందని తెలిపారు. నేను నా శ్రేయోభిలాషులు, అభిమానులతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరికపై నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. బీఆరెస్ క్షేత్ర స్థాయిలో బలహీనమైందని, ప్రజలకు దూరమైందన్నారు. అన్ని విషయాలు కాంగ్రెస్‌లో చేరిన తర్వాతా మాట్లాడుతానన్నారు.


ఇంద్రకరణ్‌రెడ్డి, గడ్డంలు కూడా


కేకే, కడియం కుటుంబాలతో పాటు బీఆరెస్ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డిలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా సమాచారం. వారంతా ఒకేసారి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని తెలుస్తుంది.


మరో 10మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు కూడా సిద్ధం


కాంగ్రెస్‌లో చేరికలకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్‌రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో బీఆరెస్ నుంచి తొలి విడతగా 10మంది ఎమ్మెల్యేలను ఒకేసారి కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు మంతనాలు పూర్తయ్యినట్లుగా పొలిటికల్ సర్కిల్‌లో ప్రచారం జోరందుకుంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే బీఆరెస్ నుంచి 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని వారంతా ప్రత్యేకంగా ఢిల్లీలోగాని, లేదా ఏప్రిల్ 6ను తుక్కుగూడలో నిర్వహించే సభలోగాని కాంగ్రెస్‌లో చేరవచ్చని సమాచారం. ఇప్పటికే బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరిపోయారు.