జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సొరేన్‌ భార్య! కానీ మెలికేంటంటే..

మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ (Enforcement Directorate) విచారణను ఎదుర్కొంటున్న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌(Hemant Soren)ను అరెస్టు చేసిన పక్షంలో

జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సొరేన్‌ భార్య! కానీ మెలికేంటంటే..

Kalpana Soren । మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ (Enforcement Directorate) విచారణను ఎదుర్కొంటున్న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌(Hemant Soren)ను అరెస్టు చేసిన పక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను ఆయన భార్య కల్పనా సొరేన్‌ (Hemant Soren’s wife Kalpana Soren) చేపడుతారని తెలుస్తున్నది. అయితే.. ఇక్కడ ఒక మెలిక కూడా ఉన్నది. సొరేన్‌న ఈడీ ప్రస్తుతం విచారిస్తున్నది. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన అనంతరం అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. అదే జరిగిన పక్షంలో ముఖ్యమంత్రి బాధ్యతలను కల్పన చేపడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో సొరేన్‌ ప్రకటించారని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కీలకమైన అంశం కాబట్టి అందుకు ఎమ్మెల్యేలందరూ అంగీకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి.


‘ముఖ్యమంత్రికి పూర్తి మద్దతుతో తమ పార్టీ ఉన్నదని కాంగ్రెస్‌ నేత, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా మంగళవారం స్పష్టం చేశారు. అయితే.. కల్పనాసొరేన్‌ ముఖ్యమంత్రి కావడానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ గడువు ఏడాది వ్యవధిలో ముగియనున్నట్టయితే ఉప ఎన్నిక నిర్వహించేందుకు చట్టం అనుమతించడం లేదు. దీనితో కల్పన ఎమ్మెల్యే అవడం కష్టంగా మారుతుంది. జార్ఖండ్‌ అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. కల్పన బాధ్యతలు స్వీకరించే విషయంలోన్యాయ సలహా తీసుకుంటామని, కుదరని పక్షంలో వేరొకరి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 600 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని బిల్డర్లకు అప్పగించడంలో భారీ స్కాం జరిగిందని ఈడీ ఆరోపిస్తున్నది. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకూ 14 మందిని అరెస్టు చేసింది. అరెస్టయినవారిలో 2011 ఐఏఎస్‌ అధికారి చావి రంజన్‌ కూడా ఉన్నారు. అయితే.. భారీ కుట్రలో భాగంగానే తనను ఈ కేసులో ఇరికించారని ముఖ్యమంత్రి సొరేన్‌ చెబుతున్నారు.