నెల రోజుల తర్వాత కన్నతల్లి ఒడికి చిన్నారి
కలెక్టర్ చేతుల మీదుగా తల్లి చెంతకు… విధాత, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: దత్తత నిబంధనలు పాటించకుండా అక్రమంగా దత్తతకు ఇచ్చిన చిన్నారి నెలరోజుల తర్వాత అమ్మ ఒడికి చేరింది. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి చేతుల మీదుగా బుధవారం చిన్నారిని తల్లిదండ్రులకు అందజేశారు. ఈ దత్తత సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అక్రమ దత్తత…కేసు నమోదు నెక్కొండ మండలంలోని పిట్టకాయలబోడు తండాకు చెందిన బానోతు చిన్ని, భీమన్న దంపతులకు రెండో సంతానంగా ఆడపిల్ల […]

- కలెక్టర్ చేతుల మీదుగా తల్లి చెంతకు…
విధాత, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: దత్తత నిబంధనలు పాటించకుండా అక్రమంగా దత్తతకు ఇచ్చిన చిన్నారి నెలరోజుల తర్వాత అమ్మ ఒడికి చేరింది. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి చేతుల మీదుగా బుధవారం చిన్నారిని తల్లిదండ్రులకు అందజేశారు. ఈ దత్తత సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అక్రమ దత్తత…కేసు నమోదు
నెక్కొండ మండలంలోని పిట్టకాయలబోడు తండాకు చెందిన బానోతు చిన్ని, భీమన్న దంపతులకు రెండో సంతానంగా ఆడపిల్ల జన్మించింది. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ పరశురాం దంపతులకు అక్రమంగా ఈ చిన్నారిని దత్తత ఇచ్చారు.
బాలల న్యాయ చట్టం 2015 ప్రకారంగా ఎవరు దత్తత తీసుకున్న CARA నిబంధనల మేరకు మాత్రమే దత్తత తీసుకోవాలి. నిబంధనల ప్రకారంగా కాకుండా ఎవరు దత్తత తీసుకున్నా లేదా ఇచ్చినా ఇద్దరూ అక్రమ దత్తత కింద శిక్షార్హులు అవుతారు. అయితే పిట్టకాయలబోడు తండాకు చెందిన దంపతులు అక్రమంగా దత్తత ఇచ్చిన విషయం స్థానిక న్యూస్ పేపర్లో రాగా నెక్కొండ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కేసు కూడా నమోదయింది.
దత్తత పై అధికారుల విచారణ
బాలల పరిరక్షణ జిల్లా అధికారులు మరియు జిల్లా బాలల సంక్షేమ సమితి ఈ విషయాన్ని తెలుసుకుని అక్రమంగా దత్తత తీసుకున్న లక్ష్మీ పరశురాములను హైదరాబాదు నుండి పిలిపించి హనుమకొండ లోని శిశు గృహలో పాపను ఉంచారు.
తల్లిదండ్రుల వినతికి సానుకూలత
కన్న తల్లిదండ్రులైన చిన్ని, భీమన్నమా పాప మాకు కావాలని, మరొకసారి ఇలాంటి తప్పు చేయమని తెలియజేసే ప్రయత్నం చేశారు. కానీ బాలల సంక్షేమ సమితి ఈ కేసు విషయమై కూలంకశంగా పరిశోధించి, పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ప్రత్యక్షంగా ఆ తండాను సందర్శించి ఆ గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకొని ఎలాంటి అమ్మకాలు జరగలేదని ఎంక్వయిరీ లో తేలిన తర్వాత తిరిగి ఆ పాపను వారి కన్న తల్లిదండ్రులకే అప్పజెప్పాలని నిర్ణయించారు.
ఈ మేరకు వరంగల్ కలెక్టరేట్‌లోని కలెక్టర్ డాక్టర్ బి గోపి గారి సమక్షంలో పాపను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. దాదాపు నెల రోజుల నుండి సాగుతున్న ఈ విచారణలో ఎట్టకేలకు పాప అమ్మ ఒడిలోకి చేరింది.
కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ వసుధ, సభ్యులు డాక్టర్ ఆకులపల్లి మధు, సంపత్ సుజాత, షాహెదా బేగం, బండ రామలీల, DCPU సోషల్ వర్కర్ పద్మలత, చైల్డ్ లైన్ కౌన్సిలర్ ప్రభ, గ్రామ మాజీ సర్పంచ్ అన్నమనేని సంతోష్ కుమార్ పాల్గొన్నారు.