వార్నీ.. ‘కంటి వెలుగు’ వెనుక ఇంత పథకమా?

గ్రామాల్లో కంటిచూపు మందగించినవారి సంఖ్య సహజంగానే ఎక్కువ ఉంటుంది. అటువంటివారికి ప్రభుత్వం కంటివెలుగు పథకం పేరుతో పెద్ద ఎత్తున కంటి అద్దాలు పంపిణీ చేసింది.

  • By: Somu    latest    Nov 23, 2023 12:30 PM IST
వార్నీ.. ‘కంటి వెలుగు’ వెనుక ఇంత పథకమా?

విధాత ప్రతి­నిధి ఉమ్మడి ఆది­లా­బాద్: గ్రామాల్లో కంటిచూపు మందగించినవారి సంఖ్య సహజంగానే ఎక్కువ ఉంటుంది. అటువంటివారికి ప్రభుత్వం కంటివెలుగు పథకం పేరుతో పెద్ద ఎత్తున కంటి అద్దాలు పంపిణీ చేసింది. అవసరం ఉన్నకొందరికి కంటి ఆపరేషన్లు చేయించింది. అయితే.. ఎంత మందికి ఆపరేషన్లు జరిగాయన్న విషయంలో తగిన లెక్కలు లేవు.


అయితే.. ఈ కంటి వెలుగు పథకం వెనుక పెద్ద కథే ఉన్నదని గ్రామాల్లో చర్చలు, సంభాషణల సందర్భంగా పలువురు పేర్కొనడం ఆసక్తి రేపుతున్నది. అదే.. ఎన్నికల గుర్తును సరిగ్గా గుర్తించగలగడం. చపాతీ రోలర్‌, రోడ్డు రోలర్‌, కెమెరా, ఇస్త్రీపెట్టె, ట్రక్కు తదితర గుర్తులు బీఆరెస్‌ కారు గుర్తును పోలి ఉంటాయి. కొన్నిచోట్ల బీఆరెస్‌ మెజార్టీకి దీటుగా సదరు గుర్తులకు ఓట్లు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి.


దీంతో బీఆరెస్‌ కొట్లాడి మరీ వీటిని తొలగింపచేసింది. అయితే వృద్ధుల్లో ఈ గుర్తుల విషయంలో ఇబ్బంది లేకుండా, అవి స్పష్టంగా కనిపించేలా చూసేందుకే యుద్ధ ప్రాతిపదికన కంటివెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చారని పలువురు వ్యాఖ్యానించడం విశేషం.


పింఛన్ల కారణంగా వృద్ధుల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని నమ్మకంతో ఉన్న ప్రభుత్వం.. గుర్తుల విషయంలో వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకోవాలని భావించే కళ్లద్దాలు పంపిణీ చేసినట్టు ఉన్నదని చర్చించుకుంటున్నారు. అంటే వృద్ధుల ఓట్లపై అధికార పార్టీ ఎంత గట్టినమ్మకంతో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.