Karnataka Elections । కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై బీఆర్‌ఎస్ దెబ్బ!
కాంగ్రెస్ గెలిచే చోట బీఆర్ఎస్-జేడీఎస్ పోటీతో బీజేపీకి చాన్స్ ఉమ్మడి శత్రువును గుర్తించాలంటున్న ప్రజాస్వామికవాదులు విధాత: Karnataka Elections | ఎలాగైనా కర్ణాటకను నిలుపుకోవాలని బీజేపీ చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తున్నది. మరోవైపు బీజేపీని కర్ణాటకలో నిలువరించడం అంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా సవాలు చేయడమేనని కాంగ్రెస్ నమ్ముతున్నది. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో మరోసారి అధికారం చేపట్టనీయకూడదనే కృతనిశ్చయంతో ఉన్న ఇతర ప్రతిపక్షాలదీ ఇదే మాట! కానీ.. ఆ స్ఫూర్తికి కర్ణాటకలో దెబ్బ తగులుతుందా? […]

- కాంగ్రెస్ గెలిచే చోట బీఆర్ఎస్-జేడీఎస్ పోటీతో బీజేపీకి చాన్స్
- ఉమ్మడి శత్రువును గుర్తించాలంటున్న ప్రజాస్వామికవాదులు
విధాత: Karnataka Elections | ఎలాగైనా కర్ణాటకను నిలుపుకోవాలని బీజేపీ చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తున్నది. మరోవైపు బీజేపీని కర్ణాటకలో నిలువరించడం అంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా సవాలు చేయడమేనని కాంగ్రెస్ నమ్ముతున్నది. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో మరోసారి అధికారం చేపట్టనీయకూడదనే కృతనిశ్చయంతో ఉన్న ఇతర ప్రతిపక్షాలదీ ఇదే మాట! కానీ.. ఆ స్ఫూర్తికి కర్ణాటకలో దెబ్బ తగులుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఎత్తులు వేస్తున్నది. అయితే.. ఉమ్మడి శత్రువును విస్మరించి.. కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ సమదూరం పాటిస్తామని ఈ సమయంలో చెప్పడం అంటే.. బీజేపీకి పరోక్షంగా లబ్ధి చేకూర్చడమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్, జేడీఎస్‌లు ఏం చేయబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
2018లో జరిగిన ఎన్నికల అనంతరం కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే.. పలువురు కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులను కొనుగోలు చేయడంతోనే ప్రభుత్వం పడిపోయింది. అనంతర పరిణామాల్లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. మరో విడత కూడా తానే అధికారంలో ఉండేందుకు తహతహలాడుతున్నది.
అందుకోసం కాంగ్రెస్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా పని చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పన్నాగంలో బీఆర్‌ఎస్, జేడీఎస్ పడతాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీని గెలిపించేందుకు ఏపీలోని అధికార పక్షంతో ఒప్పందం కుదిరిందన్న విమర్శలు పలువురు సీనియర్ నేతల నుంచి వస్తున్నాయి. కర్ణాటకలో తెలుగు వారి ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు గణనీయమై సంఖ్యలోనే ఉన్నాయి.
వీటిలో బీజేపీని బయటపడేసేందుకు వైసీపీ సహకారాన్ని బీజేపీ తీసుకుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న పలు నియోజకవర్గాలపై బీఆర్‌ఎస్ ప్రభావం గట్టిగానే ఉంటుందని అంటున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ తన అభ్యర్థులను నిలిపితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. బీజేపీకి మేలు కలుగుతుందని అంటున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ హవా ఉంటుందని ప్రాథమికంగా వెల్లడవుతున్న సర్వేలు పేర్కొంటున్నాయి. బీజేపీ సొంత సర్వేల్లోనూ ఆశాజనక ఫలితాలు రాలేదని చెబుతున్నారు. మొత్తంగా అక్కడ బీజేపీకి గడ్డు పరిస్థితి ఉన్నదనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం కర్ణాటకలో మోహరించింది.
ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందే ప్రధాని పలు పర్యటనలు చేపట్టి.. బెంగళూరు- మైసూర్ రహదారి తదితర ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇవి పెద్దగా ప్రయోజనం కలిగించే అవకాశం లేదని తేలడంతో ప్లాన్-బీ అమలు చేయాలని కాషాయ నేతలు భావిస్తున్నారని వినికిడి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీలో చీలికలను ప్రోత్సహిస్తారన్న చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే నేతలు బీజేపీలో కాకుండా బీఆర్‌ఎస్ వంటి పార్టీల్లో చేరితే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో బీఆర్‌ఎస్-జేడీఎస్ మధ్య పొత్తు తమకు అనుకోని వరంలా పరిణమిస్తుందని అంచనా వేస్తున్నారు.
తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని ఆశిస్తున్నారు. అదే జరిగితే సహజంగానే కాంగ్రెస్‌కు దెబ్బ తగులుతుంది. అది బీజేపీకి లాభిస్తుంది. కర్ణాటకలో ఈ పన్నాగం ఫలితాలనిస్తే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే ప్లాన్‌ను బీజేపీ అమలు చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.