Karnataka Elections | కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా నేనా..

Karnataka Elections పోలింగ్‌కు ఇంకో వారం రోజులే ఉండటంతో ప్రధాన పార్టీల ప్రచారం ఉధృతం ప్రధాన పార్టీల జాతీయ నేతలంతా కర్ణాటకలోనే వారం రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో గెలుపు కోసం తీవ్రంగా కష్ట పడుతున్నాయి. ఈ క్రమంలో తమకు అనుకూలంగా ఉన్న సామాజికవర్గాలను తమవైపు […]

  • By: krs    latest    May 04, 2023 1:44 AM IST
Karnataka Elections | కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా నేనా..

Karnataka Elections

  • పోలింగ్‌కు ఇంకో వారం రోజులే ఉండటంతో ప్రధాన పార్టీల ప్రచారం ఉధృతం
  • ప్రధాన పార్టీల జాతీయ నేతలంతా కర్ణాటకలోనే

వారం రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో గెలుపు కోసం తీవ్రంగా కష్ట పడుతున్నాయి. ఈ క్రమంలో తమకు అనుకూలంగా ఉన్న సామాజికవర్గాలను తమవైపు తిప్పుకోవడానికి ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ మ్యానిఫెస్టోలు ప్రకటించాయి. ప్రచారంలో ఈ చివరి వారం రోజులు కీలకంగా మారాయి.

రోజురోజుకూ మారుతున్న సమీకరణాలు

రోజురోజుకూ సమీకరణాలు మారుతుండటంతో పార్టీలు గెలుపు కోసం తీవ్ర కృషి చేస్తున్నాయి. ఈసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? ఏ సామాజికవర్గాల ప్రభావం ఎంత ఉన్నది? అన్నిపార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇస్తున్న ఉచితాలు ఓట్లు రాలుస్తాయా? ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ ఏం చేస్తున్నది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఏ ఎన్నిక జరిగినా తముకు ఎదురులేదని హస్తినలో నిశ్చింతంగా ఉన్న బీజేపీ అధిష్ఠానానికి కర్ణాటక ఎన్నికలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో దాన్ని అధిగమించడానికి ప్రధాని సహా కేంద్ర మంత్రులు, ఆ పార్టీ కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ నాయకత్వమంతా కర్ణాటకలోనే విస్తృత ప్రచారం చేస్తున్నారు.

అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌

దక్షిణ భారత దేశంలో కీలక రాష్ట్రమైన కర్ణాటకలో మరోసారి గెలిచి తన సత్తా చాటాలని బీజేపీ చూస్తున్నది. కేంద్రంలో భారీ మెజారిటీలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఈ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. మరోసారి గెలిచి డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ తీసుకొస్తామంటున్న కాషాయ నేతలకు ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.

ఈ ఏడాది జరగనున్న మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు, 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దూకుడు అడ్డుకట్ట వేయాలంటే కాంగ్రెస్‌ ఈ రాష్ట్రంలో గెలుపు అనివార్యంగా మారింది. 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీ లో బీజేపీకి 119, కాంగ్రెస్‌ కు 75, జేడీఎస్‌ 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నది. బీజేపీని ఓడించి కర్ణాటకను తిరిగి చేజిక్కించుకోవడానికి హస్తం పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. జేడీఎస్‌ కూడా అయితే కింగ్‌ లేదా కింగ్‌మేకర్‌ కావాలని అనుకుంటున్నది.

ఆ మూడు సామాజికవర్గ ఓట్ల ప్రసన్నం కోసం

కర్ణాటకలో రాజకీయంగా ప్రధాన పాత్ర పోషించేది వివిధ సామాజికవర్గాలైనా వీటిలో కీలకమైనది లింగాయత్‌లు. కర్ణాటక జనాభాలో 17 శాతం ఉన్న లింగాయత్‌లు సుమారు 100 నిర్ణయాత్మకశక్తిగా ఉన్నారు. ఈ సీట్లన్నీ ఎక్కువగా ఉత్తర కర్ణాటకలోనే ఉన్నాయి. ఇక్కడ యడ్యూరప్ప నాయకత్వంలో గత రెండు దశాబ్దాలుగా బీజేపీ వెంట నడుస్తున్నారు.

ఈ వర్గానికి చెందిన మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ సవదికి ఈసారి బీజేపీ టికెట్లు నిరాకరించింది. దీంతో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరుఫున బరిలో నిలిచారు. లింగాయత్‌ల ఓట్లు పెద్దమొత్తంలో దక్కించుకోవడానికి అన్ని పార్టీలు యత్నిస్తున్నాయి.

లింగయాత్‌ల తర్వాత మరో బలమైన సామాజికవర్గం వక్కలిగలు. మాజీ ప్రధాని దేవేగౌడ, టీపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఈ సామాజికవర్గం వారే. కర్ణాటకను ఏలిన ఏడుగురు ముఖ్యమంత్రులు వక్కలిగ వర్గానికి చెందినవారే. కర్ణాటక జనాభాలో ఈ సామాజికవర్గం 15 శాతం ఉంటుంది. వీళ్లు దాదాపు 100 స్థానాల్లో పార్టీల గెలుపును నిర్దేశించగలరు. వీరి ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవడానికి మూడు పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి.

ముస్లిం సామాజికవర్గం కూడా కర్ణాటకలో చాలా ప్రాబల్య వర్గం. ఈ సామాజికవర్గ ఓట్లు చాలాకాలంగా కాంగ్రెస్‌ వైపే ఉన్నాయి. జేడీఎస్‌,ఎస్‌డీపీఐ, ఇతర పార్టీలు కూడా ఆ ఓట్లపై దృష్టి సారించింది. ఎన్నిలకు ముందు బొమ్మై ప్రభుత్వం ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లు తొలిగించింది.

ఎన్నికల ప్రచారంలో యడ్యూరప్ప, మాజీ మంత్రి ఈశ్వరప్పలు కూడా ముస్లిం ఓట్లు తమకు అక్కరలేదన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. 30-40 స్థానాల్లో ముస్లిం ఓట్ల ప్రభావం ఉండనున్నదని, అవి కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఉచితాల ప్రభావం

అసెంబ్లీ ఎన్నికల్లో ఉచితాలు కీలకంగా మారాయి. అన్నిపార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో ఉచితాలకు తెరలేపాయి. గతంలో ఉచితాలు ప్రగతి నిరోధకాలనిన ప్రధాని మోడీ అన్నారు. కానీ ఆ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో అందుకు భిన్నంగా ఉచిత హామీలను ప్రవచిస్తున్నది. ఉమ్మడి పౌరస్మృతి అమలు, 10 లక్షల ఉద్యోగాలు, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని వాగ్దానం చేసింది.

అలాగే రాష్ట్రాన్ని కుదిపేసిన నందిని పాల బ్రాండ్‌ను రోజు అరలీటర్‌ చొప్పున అందిస్తామని చెప్పింది. కాంగ్రెస్‌ కూడా బీజేపీకి ధీటుగా పలు ఉచిత హామీలు ఇచ్చింది. శక్తి పథకం కింద కేఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహ లక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబంలోని మహిళలకు నెలకు రూ. 2 వేలు, నిరుద్యోగల గ్రాడ్యూయేట్లకు రెండేళ్ల పాటు నెలకు రూ. 2 వేలు,డిప్లమా పూర్తి చేసిన వారికి రూ. 1500 చొప్పున ఇస్తామని, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కూడా పంపిణీ చేయనున్నట్లు హామీ ఇస్తున్నది.

రాష్ట్రంలో పాల ఉత్పత్తిని 1.5 కోట్ల లీటర్లకు పెంచుతామన్నది. ఆవులు, గేదెల కొనుగోలు కోసం పాడి రైతులకు రూ. 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామంటున్నది. పోలింగ్‌కు ఇంకో వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ గెలుపు కోసం ప్రధాని మోడీ, అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రోడ్‌ షోలు, ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మే 10 జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు ఎటువైపు మొగ్గుతారన్నది చూడాలి.