Karnataka Elections | కర్ణాటకలో.. కమలనాథుల కష్టాలు

అభ్యర్థులను మార్చినా అదే అసంతృప్తి సానుభూతి కోసం ప్రధాని ప్రయాస యడ్యూరప్పపైనే మొత్తం భారం ఆ ఆరుగురిని కట్టడి చేయాలనే వ్యూహం ఈ ప్రయత్నాలు ఫలించవంటున్న రాజకీయ విశ్లేషకులు Karnataka Elections | విధాత‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అధికార బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి ఆ పార్టీ 70 మందికిపైగా కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. గుజరాత్‌ […]

Karnataka Elections | కర్ణాటకలో.. కమలనాథుల కష్టాలు
  • అభ్యర్థులను మార్చినా అదే అసంతృప్తి
  • సానుభూతి కోసం ప్రధాని ప్రయాస
  • యడ్యూరప్పపైనే మొత్తం భారం
  • ఆ ఆరుగురిని కట్టడి చేయాలనే వ్యూహం
  • ఈ ప్రయత్నాలు ఫలించవంటున్న రాజకీయ విశ్లేషకులు

Karnataka Elections |

విధాత‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అధికార బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి ఆ పార్టీ 70 మందికిపైగా కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. గుజరాత్‌ తరహాలో ఇక్కడ కూడా వ్యూహం ఫలిస్తుందని భావించింది.

ఇన్ని చేసినా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివిధ సర్వేలు స్పష్టం చేశాయి. దీంతో అధికార కమలనాథులు పోలింగ్‌కు ముందే చేతులెత్తేసిందా? 40 కమీషన్‌ సర్కార్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిందా? అందుకే ప్రధాని మోడీ అక్కడ ఎన్నికల ప్రచారంలో ప్రజల సానుభూతి కోసం అప్రస్తుత అంశాలను ముందుకు తెస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తున్నది.

ప్రధాని ప్రచారంలో ప్రజల సానుభూతి కోసం

ఉత్తరాది రాజకీయాలకు, దక్షిణాది రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉన్నది. అక్కడ మోడీ మానియా పనిచేసి ఉండొచ్చు. గుజరాత్‌ నమూనా కర్ణాటకలోనూ ఫలిస్తుందనే నమ్మకం పార్టీ నేతలకే లేదు. గుజరాత్‌లో భూపేంద్రపటే్‌ల్ పేరు లేకుండానే అంతా తానే అన్నట్టు మోడీ వ్యవహరించారు. కానీ కర్ణాటకలో పరిస్థితులు పూర్తి విరుద్ధం. అక్కడ స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయంటున్నారు.

మోడీ ఛరీష్మా ఇక్కడ పనిచేయదని అందుకే ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగి ప్రస్తుత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న యడ్యూరప్పపైనే బీజేపీ నమ్మకం పెట్టుకున్నది. ప్రధాని కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ సాధించిన ప్రగతి గురించి గానీ, కేంద్రంలోని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు. ‘ కాంగ్రెస్‌ నన్ను నిందించడం ప్రారంభించింది. నన్ను నిందించిన ప్రతిసారి అది పతనమవుతున్నది. ఇప్పటికి 91 సార్లు నన్ను అవమానించింది’ అంటూ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు.

ప్రస్తుత కర్ణాటక ప్రభుత్వం ఎదుర్కొంటున్న 40 శాతం కమీషన్‌ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ ఢిల్లీ నుంచి రూ. 1 ఇస్తే ప్రజలకు 15 పైసలు మాత్రమే చేరుతున్నాయనే ఆయన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. అభివృద్ధి ఫలాలు అట్టుడుగు వర్గాలకు చేరేక్రమంలో జరుగుతున్న పరిణామాలను రాజీవ్‌ చెబితే.. దాన్ని మోడీ అవినీతిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం. బీజేపీ అధిష్ఠానం కర్ణాటక ఎన్నికల గురించి ఆందోళన పడుతున్నదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.

ఆ ఆరుగురి ఓడించాలనే లక్ష్యంతో

సీనియర్లను పక్కనపెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చిన బీజేపీకి పోలింగ్‌కు ముందే కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి అండగా ఉండి గెలిపించిన నాయకులే ఇప్పుడు బీజేపీ సవాల్‌గా మారారు. అందుకే వారిని, కాంగ్రెస్‌, జేడీయస్‌ కీలక నేతలను ఓడించాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నది.

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పోటీ చేస్తున్న వరుణ నియోజకవర్గంలో లింగాయతులు, కురుబ, దళితు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అక్కడ ఆయనను పోటీగా లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన ఆ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి సోమణ్ణను దించింది.

అలాగే గత ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పడటానికి ప్రధాన కారకుడిగా పేరొందిన లక్ష్మణ సవదిని ఓడించాలని మహేశ్‌ కుమటల్లిని బరిలోకి దింపింది. బెళగాం, విజయపురి జిల్లాల్లో పట్టున్న సవది తన సత్తా చాటాలని చూస్తున్నారు.

మోడీపై విరుచుకుపడుతున్న మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేను చిత్తాపూర్‌లో ఓడించాలని బీజేపీ భావిస్తున్నది. బీజేపీ టికెట్‌ నిరాకరించడంతో కాంగ్రెస్‌ నుంచి హొబ్బళ్లి-ధార్వాడ్‌ సెంట్రల్‌ నుంచి పోటీ చేస్తున్న మరో మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌ పై ఆయన శిష్యుడైన మహేశ్‌ టెంగినకాయను దించింది. ఈ ఇద్దరిని ఓడించే బాధ్యతను యడ్యూరప్పకు అప్పగించింది.

కనకపుర నుంచి పోటీ చేస్తున్న కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై మంత్రి ఆర్‌. అశోక్‌ బీజేపీ బరిలోకి దింపింది. మాజీ సీఎం కుమారస్వామి పోటీ చేస్తున్న చెన్నపట్టణపై కూడా కమళనాథులు ఎక్కువగా దృష్టి సారించారు. ఇక్కడ బలమైన నేతలను దించడం ద్వారా వాళ్లు నియోజకవర్గానికే పరిమితమౌతారని బీజేపీ అంచనా వేసింది. అయితే ఈ రెండు చోట్ల బీజేపీ గెలుపు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రధాన పార్టీల్లో అసంతృప్తి నెలకొన్నది. అయితే కాంగ్రెస్‌, జేడీఎస్‌లో ఆ ప్రభావం అంతగా లేదు. కానీ బీజేపీ లో మాత్రం టికెట్‌ ఆశించి భంగపడిన నేతల నుంచే పెద్ద సవాల్‌ ఎదురవుతున్నది. యడ్యూరప్ప, సినీ నటులను ముందుపెట్టి తిరిగి అధికారంలోకి రావాలనే బీజేపీ ప్రయత్నాలకు ప్రజలు ఎలాంటి సమాధానం ఇస్తారన్నది మే 13న తేలుతుంది.