కేసీఆర్ ఇంటికెళ్లడం తథ్యం.. కాంగ్రెస్ వైపే జనం మొగ్గు: కర్ణాటక మంత్రి మునియప్ప

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయని, కేసీఆర్ ఇంటికి వెళ్లడం తథ్యమని కర్ణాటక సివిల్ సప్లై శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప అన్నారు.

  • By: Somu    latest    Nov 25, 2023 12:44 PM IST
కేసీఆర్ ఇంటికెళ్లడం తథ్యం.. కాంగ్రెస్ వైపే జనం మొగ్గు: కర్ణాటక మంత్రి మునియప్ప

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయని, కేసీఆర్ ఇంటికి వెళ్లడం తథ్యమని కర్ణాటక సివిల్ సప్లై శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప అన్నారు. మంత్రి తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారానికి రాగా, శనివారం మంచిర్యాల జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కు అపూర్వ ఆదరణ లభిస్తోందన్నారు.


కర్ణాటక తరహాలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని అన్నారు. మహిళలకు రిజర్వేన్లు అమలు చేయాలని దివంగత రాజీవ్ గాంధీ ఎంతో ఆశించారని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే, కేసీఆర్ కాంగ్రెస్ కు ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ సాగర్ రావు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వాడవాడలా క్లబ్బులు పెడతారని ముఖ్యమంత్రి కేసీఆర్ తనస్థాయి మరిచి తనపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు.


హైదరాబాదులో కేసీఆర్ హయాంలో క్లబ్బులు ఎలా నడుస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్లబ్బు మూసివేసినట్లు తెలిపారు. రైతు బీమా ఓ చేత ఇస్తూనే, మరోచేత ధాన్యం తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నదని విమర్శించారు. రైతులు ప్రభుత్వ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.


జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ కు మంచి స్పందన వస్తోందన్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఆమోదయోగ్యమైన పథకాలను అమలు చేసి తీరుతుందని అన్నారు. ఈసమావేశంలో కర్ణాటక ఎమ్మెల్యేలు దేవేందర్, శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.