Kashmir | అందాల కాశ్మీర్‌లో.. అతివ‌ల నీటి యుద్ధాలు

విధాత: కాశ్మీర్ లోయ‌. అంద‌మైన లోయ‌లు, స‌హ‌జ‌మైన జ‌ల‌పాతాలు, ఆర్చిడ్ పూల‌తోట‌లతో అల‌రారే స్వ‌ర్గం. కానీ కాశ్మీర్ లోయ‌లో కూడా ప్ర‌జ‌ల‌కు నీటి క‌ష్టాలు ఉన్నాయంటే న‌మ్ముతారా? దాదాపు 80 లోయ గ్రామాల మ‌హిళ‌లు రోజువారీ నీటి కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారంటే ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ? కానీ ఇది నిజం. కశ్మీర్ లోయలోని 80 గ్రామాలకు తాగునీరు తీర‌ని కల. వన్యప్రాణుల భయంతో ప్రజలు, మహిళలు, పిల్లలు రోజూ ఐదు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి […]

  • By: krs    latest    Jun 17, 2023 1:19 AM IST
Kashmir | అందాల కాశ్మీర్‌లో.. అతివ‌ల నీటి యుద్ధాలు

విధాత: కాశ్మీర్ లోయ‌. అంద‌మైన లోయ‌లు, స‌హ‌జ‌మైన జ‌ల‌పాతాలు, ఆర్చిడ్ పూల‌తోట‌లతో అల‌రారే స్వ‌ర్గం. కానీ కాశ్మీర్ లోయ‌లో కూడా ప్ర‌జ‌ల‌కు నీటి క‌ష్టాలు ఉన్నాయంటే న‌మ్ముతారా? దాదాపు 80 లోయ గ్రామాల మ‌హిళ‌లు రోజువారీ నీటి కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారంటే ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ? కానీ ఇది నిజం.

కశ్మీర్ లోయలోని 80 గ్రామాలకు తాగునీరు తీర‌ని కల. వన్యప్రాణుల భయంతో ప్రజలు, మహిళలు, పిల్లలు రోజూ ఐదు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి నీటిని సేకరిస్తున్నారు. కాశ్మీర్ అన‌గానే మంత్ర‌ముగ్ధుల‌ను చేసే అందాలే ప్ర‌పంచానికి స్ఫుర‌ణ‌కొస్తాయి కానీ, దశాబ్దాలుగా, డజన్ల కొద్దీ గ్రామాలు కలుషితమైన నీటి వనరుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాయి. క‌లుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులతో పోరాడుతూ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెడుతున్నారు. ఒకప్పుడు జీవనోపాధిని అందించే కాశ్మీరీ వాగులు రోగాల పుట్టగా మారిపోయి, గ్రామస్తుల ఆరోగ్యాన్ని, ఆశలను నిశ్శబ్దంగా హ‌రించివేస్తున్నాయి.

దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని ఒక మారుమూల గ్రామం, కోకెర్‌నాగ్ స్ప్రింగ్ మధ్యలో ఉంది, ఇది తీవ్ర‌మైన నీటిసంక్షోభంతో అల్లాడుతోంది. నీటి క‌ష్టాల్లోచిక్కుకున్న ఆసియాలో అతిపెద్ద ట్రౌట్ ఫిష్ ఫారమ్ ఇక్క‌డే ఉంది. తాగడానికి మంచి నీరు లేకపోవడంతో, అండర్వాన్ గ్రామస్థులు భ‌రించ‌లేని కష్టాలను అనుభ‌విస్తున్నారు.

ఈ గ్రామంలో నివసిస్తున్న 400 మంది నివాసితులకు, మంచి నీటిని పొందేందుకు రోజువారీ ప్ర‌మాదాల‌తో కూడిన పోరాటం నిత్య‌కృత్యంగా మారింది. ఈ నీటి క‌ష్టాల‌కు సీజన్‌తో సంబంధం లేదు. రోజుకు రెండు సార్లు, గ్రామంలోని మహిళలు ఈ భయంకరమైన నీటి యుద్ధానికి సిద్ధ‌ప‌డ‌తారు. గుక్కెడు మంచినీటి కోసం వాళ్లు కఠినమైన మార్గాల గుండా, జారే లోయ‌ల మీదుగా నీటి బిందెల‌ను మోస్తూ ప్ర‌మాదాల‌తో సావాసం చేస్తున్నారు.

“మేము మా జీవితమంతా కుండలలో నీరు తెచ్చుకుంటున్నాము, కొండపై నుండి ఐదు కిలోమీటర్లు నడిచి, దట్టమైన మొక్కజొన్న పొలాలను దాటుతున్నాము. ప్రతిరోజూ, మహిళలు వంటకు, తాగడానికి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఉదయం, సాయంత్రం రెండుసార్లు యుద్ధం చేయాల్సి వ‌స్తోందిష అని జరీనా బేగం అనే వృద్ధురాలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

గుక్కెడు నీటికోసం రోజుకు ఐదు గంట‌లు క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోంది. క‌ష్ట‌మైన మార్గాల‌ను దాట‌డం ఒక ఎత్తు అయితే, దారిలో అడ‌వి జంతువుల బారి నుంచి త‌ప్పించుకోవ‌డం మ‌రో ఎత్తు. “చలికాలంలో నీటిని తీసుకురావడం ప్రమాదకరం, మంచుతో క‌ప్పుకున్న దారిలో అడుగుపెడితే జారి కింద‌ప‌డే ప్ర‌మాదం ఉంది. ఇలా చాలా మంది మహిళలు పడిపోయి గాయాల‌పాల‌య్యారు. ఎలుగుబంట్లు, చిరుతపులులు పగటిపూట కూడా మా గ్రామంలో సంచరిస్తాయి” అంటూ ఆమె భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేసింది.

2014లో, నల్లా నుంచి నీరు తీసుకురావడానికి ఫ‌రీదాకూతురు తల్లితో పాటు వెళుతుండగా, ఒక ఎలుగుబంటి ఆమెపై క్రూరంగా దాడి చేసి గాయ‌ప‌రిచింది. ఆమె జీవితం త‌ల‌కిందులైంది. “ఆమె తల, కాలు ఘోరంగా దెబ్బతిన్నాయి, ఆ రోజు నుంచి, నా కుమార్తె వికలాంగురాలు” అని ఫరీదా క‌న్నీరు మున్నీరు అయింది.”మా ఇళ్లకు నీటి సరఫరా ఉంటే, నా కుమార్తెకు అలాంటి ప‌రిస్థితి వచ్చేది కాద”ని ఆమె వాపోయింది.

“అండర్వాన్‌లో అత్యధిక జనాభా పేదరికంతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. గ్రామ‌స్థులంతా సమిష్టిగా నిధులను సేకరించి ప్లాస్టిక్ డ్రమ్ములను కొనుగోలు చేసాము. జల్ శక్తి డిపార్ట్‌మెంట్ నుండి నీటి ట్యాంకర్లు ప్రతి 10 రోజుల తర్వాత వ‌చ్చి ఆ ప్లాస్టిక్ డ్రమ్ములను నీటితో నింపుతాయి, కానీ పెరుగుతున్న జనాభాకు ఈ నీరు ఏమాత్రం స‌రిపోవు.” అని సర్పంచ్ అన్నారు.

“బోర్‌వెల్‌ల కోసం అనువైన స్థలాలను గుర్తించడానికి నా బృందంతో కలిసి అండెర్వాన్‌ను సందర్శించి నప్పుడు, నాకు దాహం వేస్తుంది ఒక గ్లాసు నీరు తెమ్మ‌న్నాను. నాకు ఆశ్చర్యం కలిగించే విధంగా గ్లాసు నీరు కోసం వారి క‌ష్టాలు చెప్పారు”అని భూగర్భజలాల సౌత్ కాశ్మీర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెప్పారు.

కశ్మీర్ లోయ అంతటా ఇదే కథ

దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని అర్వానీ విలేజ్‌లోని మురికి వీధుల్లో గ్రామస్థులు తమ వీపులకు ఖాళీ డబ్బాలు కట్టుకుని మోటార్‌సైకిళ్లు, ఇతర వాహనాలలో తిరిగే దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. ఈ ఊర్లో దాదాపు 1,400 ఇండ్లు ఉన్నాయి, అందులో వెయ్యి ఇళ్ల‌కు సమీపంలో నీటి వ‌న‌రులు లేవు. దీంతో గ్రామ‌స్థులు అధిక స్థాయిలో ఇనుమును కలిగి ఉన్న గొట్టపు బావుల నుండి మురుగునీటితో నిండిపోయిన‌ విషా నది నుండి నీటిని సేక‌రించాల్సి వ‌స్తోంది.

“ఈ కలుషితమైన నీటిని తాగడం వల్ల గ్రామస్తులకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయి, వారికి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది” అని తౌసీఫ్ అనే గ్రామ‌స్థుడు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉన్న సుర్సునా గ్రామం కూడా నీటి క‌ట‌క‌ట‌తో అల్లాడుతోంది. గత తొమ్మిదేళ్లుగా, గ్రామస్తులు ప్రతి రెండు రోజులకు జల్ శక్తి శాఖ పంపిన ఒకే నీటి ట్యాంకర్‌పై ఆధారపడుతున్నారు.