KCR Frustration| కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎందుకీ అసహనం! అంతర్మథనం మాని.. ఆగ్రహమా!

Frustration in KCR Government : తెలంగాణను పాలిస్తున్న సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంలో అకస్మాత్తుగా రేగిన అసహనం దేనికి సంకేతమన్న చర్చ ప్రజల మదిలో రగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో కవిత (Kavitha) విచారణ, టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ల లీకేజీ, గవర్నర్ తో పంచాయితీ వంటి వరుస ఘటనలతో బీఆర్ఎస్ (BRS) సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఈ నేపథ్యంలో జనంలో తమ పాలన పట్ల ఏదో తేడా ఉందన్న సంకేతాలతోనే […]

KCR Frustration| కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎందుకీ అసహనం! అంతర్మథనం మాని.. ఆగ్రహమా!

Frustration in KCR Government : తెలంగాణను పాలిస్తున్న సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంలో అకస్మాత్తుగా రేగిన అసహనం దేనికి సంకేతమన్న చర్చ ప్రజల మదిలో రగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో కవిత (Kavitha) విచారణ, టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ల లీకేజీ, గవర్నర్ తో పంచాయితీ వంటి వరుస ఘటనలతో బీఆర్ఎస్ (BRS) సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఈ నేపథ్యంలో జనంలో తమ పాలన పట్ల ఏదో తేడా ఉందన్న సంకేతాలతోనే ప్రభుత్వ పెద్దల్లో అసహనం రేగుతున్నదని, అందుకే మీడియాపై దాడులంటూ విపక్షాలు చురకలేస్తున్నాయి.

ఉన్న మాట: తెలంగాణద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాల నినాదానికి బీఆర్ఎస్ (BRS) పాలనలో తాజాగా ఎదురైన పరిణామాలతో ప్రజల్లో తమ గ్రాఫ్ పడిపోతుందన్న ఆందోళన మొదలవ్వడం తోనే తెలంగాణ పాలకులు మీడియాపై విరుచుక పడుతున్నారన్న వాదన వినిపిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకూలమా? ప్రతికూలమా? అనే చర్చతో మొదలైన అసహనం.. లిక్కర్ స్కాం(Delhi Liquor Scam), పేపర్ల లీకేజీ (TSPSC Paper Leak)పరిణామాలతో తీవ్రతరమైనట్లు కనిపిస్తున్నది.

తాజాగా కర్ణాటకలో సినీ నటుడు చేతన్‌ (Chetan)ను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని ట్విట్టర్‌లో ప్రస్తావించిన కేటీఆర్‌ (KTR).. సీఎంను, మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డగోలుగా విమర్శిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోరాదు? కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం తరహా విధానాలే తెలంగాణలో కూడా అనుసరించాలేమో! అన్నట్లుగా పోస్ట్ చేశారు.

చేతన్‌ అరెస్టు సరైనదా? కాదా? అన్న విషయం పక్కనపెడితే.. ఒక మెజారిటీ వర్గం మనోభావాలను ఆయన దెబ్బతీశారన్న ఆరోపణలపై అక్కడ అరెస్టు జరిగిందని, దానిని ఇక్కడ తెలంగాణలో విపక్షాలు, మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను, కేసీఆర్‌ కుటుంబ తప్పులను విశ్లేషించే క్రమంలో చేస్తున్న విమర్శలకు మధ్య పోలిక పెట్టడమే విడ్డూరమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తమ సొంత మీడియాలో నిత్యం తమ ప్రత్యర్థి పార్టీలపైన, వారి ప్రభుత్వాలపైన చేస్తున్న విమర్శలపై విపక్షాలు కూడా ఇదే రీతిలో స్పందిస్తే ప్రశ్నించే అర్హత లేకుండా పోతుందన్న సోయి కేటీఆర్‌కు ఎందుకు లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. పాలకవర్గాల విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్‌ (Fourth Estate)గా పిలిచే మీడియా బాధ్యతగా భావిస్తారు.

లిక్కర్ స్కాం, పేపర్ లీకేజీల పైన మీడియా పోటీతత్వంతో వార్తా కథనాలను అందిస్తున్నది. సోషల్ మీడియాలో అటువంటి వాటిని ప్రశ్నించే తీరులో కొంత మొరటుతనం వినిపిస్తున్నా, దానిపై పాలకులకు అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామిక పద్ధతిలో, చట్టపరిధిలో చర్యలకు ఉపక్రమించే దారులు ఎన్నో ఉన్నాయి.

అయినా అక్రమ అరెస్టులు, దౌర్జన్యాల పద్ధతిని తెలంగాణ పాలకులు అనుసరిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. వారు ఎలా సమర్థించుకొన్నప్పటికీ ప్రజల్లో ఈ తరహా అణిచివేత చర్యలపై వ్యతిరేకత అటూఇటూ తిరిగి ప్రభుత్వ వ్యతిరేకతగానే రూపాంతరం చెందుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఎమర్జెన్సీ (Emergency) కాలంలో మీడియాపై అణిచివేత ఆనాటి ఇందిరాగాంధీ (Indira Gandhi) ప్రభుత్వానికి చేసిన నష్టం విస్మరించలేనిది. అదీకాక ప్రభుత్వ వర్గాలు స్కాములలో, తప్పులలో ఇరుక్కుపోయిన సందర్భాల్లో వాటిని దాటవేసే, సమర్థించుకునే ప్రయత్నాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా విపక్షాలకు, మీడియాకు ప్రశ్నించే సాధనాలు గానే ఉపయోగపడుతున్నాయి.

మంత్రి కేటీఆర్ పేపర్ల లీకేజీ ఇద్దరి తప్పు మాత్రమే అంటే.. విపక్షాలు 30 లక్షల మంది నిరుద్యోగుల బాధ అంటున్నాయి. లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయంపై ఎవరికీ స్పష్టత రాకపోయినా అసలు ఆమె అన్ని ఫోన్లు అంత తక్కువ కాలంలో ఎందుకు వాడారన్న ప్రశ్న.. జనం మెదళ్లలో బేతాళ ప్రశ్నగా నిలిచిపోయింది. ఇవే సామాజిక మాధ్యమాలు, మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.

ప్రభుత్వానికి కంటగింపుగానే మీడియా చర్చలు

ప్రభుత్వంపై అలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో మీడియా చర్చలు పాలకవర్గాలకు కంటగింపుగా ఉండడం సాధారణమే. అంతమాత్రాన మీడియా పైన, విపక్షాల పైన అసహనంతో అప్రజాస్వామిక, అణిచివేత చర్యలతో ఆధిపత్యం నిలుపుకొంటామంటే ఎక్కువ కాలం జనం వాటిని భరించే పరిస్థితి ఉండదన్నది చారిత్రక సత్యం. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వాదన నాణానికి ఒకవైపు ఉంటే, విపక్షాలు, మీడియా వాదన రెండవ వైపుగా ఉంటుంది. ఇదే అంశం నేపథ్యంగా లిక్కర్ స్కాం, పేపర్ల లీకేజీ పై రెండు వర్గాల వాదనలను విశ్లేషిస్తే ప్రజాస్వామిక చర్చలకు కొదవలేదు.

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ అని బీఆర్ఎస్ ఆరోపిస్తే.. ఫామ్ హౌస్, పేపర్ల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కూడా అదే పద్ధతి కదా? అంటూ బీజేపీ ప్రత్యారోపణ చేసింది. బీఎల్ సంతోష్ (BL Santosh) కోర్టుకెళ్లి విచారణ తప్పించుకున్నారని కేటీఆర్ అంటే.. లిక్కర్ స్కామ్ లో కవిత ఎందుకు కోర్టుకు వెళ్లారంటూ బండి సంజయ్‌ ఎదురు ప్రశ్నించారు. మహిళను ఈడీ విచారణ పేరుతో వేధిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు అంటే.. తెలంగాణలో గవర్నర్ పట్ల, వైఎస్ఆర్టీపీ నేత షర్మిల పట్ల మీ అనుచిత చర్యలు ఏమిటంటూ బీజేపీ నిలదీసింది.

పేపర్ల లీకేజీ ఇద్దరి తప్పు మాత్రమే అని మంత్రి కేటీఆర్ అంటే.. కేసును ఆయన తేల్చేసి.. సిట్‌ (Special Investigation Team)కు డైరెక్షన్ ఇచ్చాక ఇంక విచారణ దేనికి? అంటూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ నిలదీస్తున్నారు. ఇంకో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అయితే పేపర్ల లీకేజీలు కామన్ అంటూ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టేసి నాలుక కరుచుకున్నారు.

హైదరాబాద్‌లో కుక్కల బెడదకు సంబంధించి మేయర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌ జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యే రాజయ్యకు, మహిళా సర్పంచ్ కి మధ్య నెలకొన్న వివాదం… మెడికో ప్రీతి ఆత్మహత్య, గవర్నర్‌తో ప్రభుత్వ పేచీ, పెండింగ్ బిల్లుల పంచాయితీ, స్వప్నలోక్ అగ్ని ప్రమాదం వంటి వాటిపై పాలకవర్గ ప్రతినిధులు, ప్రతిపక్షాల మధ్య మీడియా, సోషల్ మీడియాలో జోరుగా అనేక వాదప్రతివాదాలు సాగాయి.

అటు లిక్కర్ కేసులో కవిత విచారణ ఎదుర్కొంటే.. కేసీఆర్‌ కుటుంబ బాధంతా తెలంగాణ సమాజం బాధగా బీఆర్ఎస్ మంత్రులు చెప్పడం, పేపర్ల లీకేజీలో 30 లక్షల నిరుద్యోగుల సమస్య పరిష్కరించకుండా ఒక ఎమ్మెల్సీ కవిత గూర్చి ప్రభుత్వ పెద్దలు ఢిల్లీలో మకాం వేయడం వంటి వాటిపై కూడా ప్రభుత్వ ప్రతిపక్షాల వాదనకు మీడియా వేదికైంది.

వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతుల కష్టాలు, మంత్రులు, ఎమ్మెల్యేల నామమాత్ర పంటల సందర్శన, పరిహారంపై భరోసా ఇవ్వకపోవడం, అసలు కేంద్ర ఫసల్ బీమాను కాదన్న రాష్ట్ర సర్కార్ రైతులకు పంట బీమా పథకం తేవడంలో ఏళ్ల తరబడి చేస్తున్న నిర్లక్ష్యంతో రైతులకు ఎదురవుతున్న నష్టం వంటి వాటిని మీడియా ప్రజల ముందు ఉంచింది. వాటన్నింటిపై సాగాల్సిన చర్చల్లో ప్రతిపక్షాల కంటే నేటి రోజుల్లో ప్రభుత్వమే ఎక్కువగా మీడియాను వాడుకునే అవకాశాలు ఉన్నాయి. అది వదిలేసి మీడియాపై దాడులకు తెగబడటం ప్రభుత్వ నియంత్రత్వ పోకడనే చాటుతుందని అంటున్నారు.

నిజానికి లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొన్న కవిత కంటే పెద్ద నాయకులైన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మొదలు తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ వరకూ కేసులను విచారణ ఎదుర్కొన్న మహిళా నేతలు ఎందరో ఉన్నారు.

దివంగత మాజీ సీఎం జయలలిత, రబ్రీదేవి, కనిమొళి వంటి వారితోపాటు మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్, కళ్యాణ్ సింగ్, శిబు సొరేన్, అజిత్ జోగి, చిదంబరం, సీఎం జగన్ వంటి నాయకులు అంతా కేసులను, విచారణను, జైళ్లను ఎదుర్కొన్నవారే. అయినా వారి బాధ ఆ రాష్ట్ర రాష్ట్రాల ప్రజల బాధ కాలేదు. కవిత విషయంలో మాత్రం అందుకు భిన్నంగా సాగాలనుకోవడం, అది సాధ్యంకాకపోవడమే ప్రభుత్వ పెద్దల్లో అసహనానికి ఒక కారణంగా చెబుతున్నారు.

ప్రభుత్వ విధానాల్లో లోపం ఉంటే సవరించుకోవడంలో సీఎం కేసీఆర్ కానీ, మంత్రి కేటీఆర్‌ కానీ.. ఈగో పాలిటిక్స్‌తో ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం తాను అనుకున్నదే సాగాలనుకోవడం.. సాగకపోతే డైవర్షన్ పాలిటిక్స్, ఎదురుదాడి రాజకీయాలు అలవాటుగా మార్చుకోవడం పరిపాటయిందన్న చర్చ కూడా వినిపిస్తున్నది.

ఎన్ని చేసినా లిక్కర్ స్కాం, పేపర్ లీకేజ్‌తో ప్రతిపక్షాల నుండి తీవ్రమైన దాడి కాస్తా.. ప్రజల్లోకి వెళుతుందన్న ఆందోళన రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా సీఎం కేసీఆర్‌కు కలిగిందని, అందుకే పార్టీ క్యాడర్‌ను ఆశ్రయించేలా చేసి, మీరే నా బలం అంటూ బేలతనంతో లేఖ రాసుకోవాల్సిన అనివార్యత వైపు నడిపించిందని పలువురు అంటున్నారు.

పేపర్ల లీకేజీలపై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వ పెద్దల తప్పు లేకపోతే నిరుద్యోగుల బాధను పరిగణలోకి తీసుకొని సిట్టింగ్ జడ్జి విచారణకు ఆదేశించి ప్రతిపక్షాల నోళ్లు మూయించడంతో పాటు ఇటు నిరుద్యోగుల నమ్మకం సాధించవచ్చు. గుజరాత్ తరహా చట్టంతో పేపర్ల లీకేజీకి చెక్ పెట్టవచ్చు.

అయితే ఇక్కడ మాత్రం చిత్రంగా కేంద్ర ప్రభుత్వం అదానీ వ్యవహారంలో జేపీసీకి ససేమిరా అన్నట్లు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు అడిగినట్లుగా మేమెందుకు చేయాలన్న పద్ధతిలో వెళుతూ, నిత్యం తాను తిట్టే కేంద్రం విధానాన్ని పరోక్షంగా అనుసరిస్తున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసుకున్నట్లుగా రాష్ట్రం ఎందుకో ప్రజలు, ప్రతిపక్షాల నుండి వచ్చే డిమాండ్లకు తలొగ్గడం లేదు. పైపెచ్చు పేపర్ల లీకేజీలో కేసులో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న విపక్ష నేతలకు సిట్ నోటీసులు ఇచ్చి లీకేజీ కేసుకు మరింత ఆజ్యం పోస్తున్నదని, ఇది సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడమే అవుతుందని పలువురు అంటున్నారు.

ఇదే సమయంలో కేంద్రం మీడియాపై ఇటీవల సాగిస్తున్న అణచివేత పద్ధతులను రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తూ.. ప్రశ్నించే గళాలను.. కలాలను తొక్కి పట్టడంలో పాలకవర్గాలన్ని ఒకటేనన్న వాదనకు ఊతమివ్వడం కొసమెరుపు.