KGF మళ్లీ తెరుచుకుంటోంది! బంగారం అన్వేషణకు కేంద్రం కసరత్తు!
విధాత: ఈ తరానికి కేజీఎఫ్ అంటే కన్నడ సినిమా పేరే తెలుస్తుంది కానీ ఓ రెండు తరాలు ముందుకు వెళితే కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనే విషయం వెంటనే స్ఫురణకు వస్తుంది. బ్రిటిష్ కాలంలో కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో మొదలైన బంగారం తవ్వకాలు 1990 దశకం వరకూ బాగానే సాగాయి. అయితే ఆ తరువాత ఆ గనుల్లో బంగారం లేదని, తవ్వకానికి అవుతున్న ఖర్చుకు ఉత్పత్తి అవుతున్న బంగారానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో […]

విధాత: ఈ తరానికి కేజీఎఫ్ అంటే కన్నడ సినిమా పేరే తెలుస్తుంది కానీ ఓ రెండు తరాలు ముందుకు వెళితే కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనే విషయం వెంటనే స్ఫురణకు వస్తుంది. బ్రిటిష్ కాలంలో కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో మొదలైన బంగారం తవ్వకాలు 1990 దశకం వరకూ బాగానే సాగాయి.
అయితే ఆ తరువాత ఆ గనుల్లో బంగారం లేదని, తవ్వకానికి అవుతున్న ఖర్చుకు ఉత్పత్తి అవుతున్న బంగారానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో ఆ గనులు మరి లాభసాటి కాదని భావించిన కేంద్రం 2001 ఫిబ్రవరి28న అధికారికంగా మూసేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ గనులను తెరిచి బంగారం వెలికి తీద్దామని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగానే కేజీఎఫ్ లో ఇంకా నిల్వ ఉన్న 50 మిలియన్ల ఖనిజం నుంచి బంగారం వెలికి తీసేందుకు బిడ్లను ఆహ్వానిస్తారు.
కేజీఎఫ్ లో 2.1 బిలియన్ డాలర్ల విలువైన బంగారం నిక్షేపాలు ఉన్నాయని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు గతంలో శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారం వెలికి తీయాలని యోచిస్తోంది. బంగారాన్ని వెలికి తీసేందుకు ఉన్న ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. బంగారంతో పాటు పల్లాడియంను కూడా వెలికి తీయాలని కేంద్రం భావిస్తోంది.
ఎలక్ట్రిక్ కార్లు, విద్యుత్ సెమి కండక్టర్ల తయారీలో ఈ పల్లాడియం ఖనిజాన్ని విరివిగా వాడతారు. రానున్నది ఎలక్ట్రిక్ వాహనాల యుగమే కాబట్టి ఆ పల్లాడియం ఖనిజానికి మంచి డిమాండ్ ఉంటుందని కేంద్రం భావిస్తోంది.
శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారాన్ని వెలికి తీసే కంపెనీలను రాబోయే నాలుగు నెలల్లో బిడ్లకు ఆహ్వానించాలని కేంద్రం సమాలోచనలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. బంగారాన్ని వెలికి తీసే సమర్థత విదేశాల్లోనే ఎక్కువగా ఉందని దీంతో ఆ కంపెనీలతో స్వదేశీ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకొని లేదా కన్సార్షియం ఏర్పాటు చేసుకొని బంగారాన్ని వెలికి తీసేందుకు బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
గతంలో కేజీఎఫ్ నుంచి మట్టిని సేకరించిన తర్వాత గుట్టలుగా పోశారు. దీంతో కేజీఎఫ్ చుట్టురా 13 గుట్టలు పేరుకుపోయాయి. వీటి నుంచి బంగారం వెలికి తీసేందుకు కేంద్రం టెండర్లు ఆహ్వానించబోతుంది. 50 మిలియన్ల మట్టిని ఇప్పటికే సంబంధిత అధికారులు పరిశీలించారు.
ఇక్కడి మట్టి నుంచి 25 టన్నుల బంగారం వస్తుందని నిపుణులు అంచనా వేసి కేంద్రానికి నివేదించారు. 1956లో జాతీయం చేయబడిన ఈ కోలార్ గోల్డ్ గనుల్లో మొత్తం 900 టన్నుల శుద్ధి చేసిన బంగారాన్ని వెలికి తీశారు.